పానీపూరీ అమ్మినోడు కోటీశ్వరుడయ్యాడు
కోల్‌కతా: ఒకప్పుడు ముంబయిలో పానీపూరీ అమ్మిన యువ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ గురువారం జరిగిన ఐపీఎల్ 2020 వేలంలో కోటీశ్వరుడయ్యాడు. 17 ఏళ్ల యశస్వి దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతడిపై భారీ అంచనాలు నెలకొనడంతో ఐపీఎల్ వేలంలో మంచి ధర పలుకుతాడని అంతా భావించారు. అనుకున్నట్లుగానే ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ యశస్విని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయి. చివరికి రాజస్థాన్ రూ.2.40 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యశస్వి 11 ఏళ్ల వయసులో క్రికెటర్ కావాలనే కోరికతో ముంబయికి చేరుకున్నాడు. ఉండడానికి చోటు లేక ఒక టెంట్‌లో మూడేళ్లు గడిపాడు. ఎండనకా, వాననకా అందులోనే జీవించాడు. సరైన ఆర్థిక వనరులు లేకపోవడంతో బతకడానికి అనేక పనులు చేశాడు. ఆజాద్ మైదానం చుట్టుపక్కల పానీపూరీ, పండ్లు అమ్మేవాడు. ఈ క్రమంలో అదే మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ తనని తాను తీర్చిదిద్దుకున్నాడు. కాగా, 2015లో పాఠశాల స్థాయిలో జరిగిన గైల్స్ షీల్డ్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు 391 చేయడంతో పాటు అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు 13/99 నమోదు చేశాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ముంబయి తరఫున ద్విశతకం బాది సంచలనం సృష్టించాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో ద్విశతకం సాధించిన యువ బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. 112.80 సగటుతో ఈ టోర్నీలో మొత్తం 564 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
0 Comments:
Post a Comment