కొత్త పీపీఎఫ్ నిబంధన మీకు తెలుసా?
ప్రావిడెంట్ ఫండ్ సొమ్మును ఎటాచ్ చేయటం ఇకపై వీలుకాదు
దిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త! కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) నిబంధనలను సవరించింది. దీనిప్రకారం ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని అటాచ్‌మెంట్ చేయటం ఇకపై వీలు కాదు. పాత నిబంధనల స్థానంలో ‘పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 2019’ కొత్త నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఖాతాదారు బాకీ ఉన్న మొత్తాన్ని జమచేయటం కోసం దేశంలో ఏ కోర్టు ఆర్డర్ లేదా డిక్రీ ఇచ్చినప్పటికీ, పీపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఎటాచ్ చేయటం వీలుకాదు.
పీపీఎఫ్ ఖాతాను పొడిగించుకోవచ్చు
మెచ్యూరిటీ అనంతరం కూడా ఖాతాదారు పీపీఎఫ్ ఖాతాను పొడిగించుకునేందుకు ఈ కొత్త నిబంధన వీలు కలిగిస్తోంది. మెచ్యూరిటీ మొత్తాన్ని పొందినప్పటికీ ఖాతాదారు తన పీఎఫ్ ఖాతాను కొనసాగించుకోవచ్చు. ఖాతా తెరిచిన ఏడాది చివరి నుంచి పదిహేను సంవత్సరాల తర్వాత మరో ఐదు సంవత్సరాల అవధికి ఖాతాను పొడిగించటానికి వీలవుతుంది.
ఏ వ్యక్తి అయినా ఫాం 1 దరఖాస్తును సమర్పించి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను పొందవచ్చు. ప్రావిడెంట్ ఫండ్‌లో ఉమ్మడి ఖాతాను తెరిచేందుకు వీలుకాదు. ఖాతాదారు ఒక ఆర్థిక సంవత్సరానికి గాను కనీసం రూ.500 నుంచి అత్యధికంగా రూ.1.5 లక్షల వరకు పీఎఫ్ ఖాతాలో జమచేసుకోవచ్చు. దరఖాస్తుదారు మైనర్ లేదా మానసిక స్థితి సరిగా లేకపోవటం వంటి అసాధారణ పరిస్థితుల్లో ఆ వ్యక్తి తరఫున ఎవరైనా సంరక్షకులు (గార్డియన్) దరఖాస్తు చేయవచ్చు. ఇటువంటి సందర్భాల్లో వారి పేరు మీద కేవలం ఒకే ఒక్క ఖాతాను తెరవటం వీలవుతుంది. సాధారణంగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతా తెరిచిన ఏడాది చివరి నుంచి ఐదు సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా ఖాతాదారు తన పీపీఎఫ్ సొమ్మును తిరిగిపొందవచ్చు. వారికి తమ ఖాతాలో ఉన్న సొమ్ములో 50 శాతం వరకు లభిస్తుంది.
Read also..
స్మార్ట్ ఫోన్ పోయిందా.... ఇలా చేస్తే మీ ఫోన్, డేటా సేఫ్...!
పక్క దేశాలకు వెళ్లినప్పుడు ఫోన్, సిమ్ ఎలా?
0 Comments:
Post a Comment