పరిశీలనలో ఆదాయపు పన్ను తగ్గింపు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
దిల్లీ: ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదాయపు పన్ను హేతుబద్ధీకరణ అంశం కూడా అందులో ఒకటని చెప్పారు. ‘హిందుస్థాన్ టైమ్స్’ లీడర్ షిప్ సమ్మిట్‌లో శనివారం పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపడతారా? అని ప్రశ్నించగా.. ‘‘ఒకవేళ నేను అవునూ అంటే ఎప్పుడు అని అడుగుతారు. అలాగని నేను నో అని చెప్పను. ఎందుకంటే మేం మరిన్ని చర్యలు చేపట్టే దిశగా పనిచేస్తున్నాం’’ అని సమాధానమిచ్చారు.అలాగే వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయం గురించి ప్రస్తావించగా.. తాము పరిశీలిస్తున్న అంశాల్లో అదీ ఒకటి అని నిర్మలా సీతారామన్ చెప్పారు. జీఎస్‌టీ గురించి ప్రశ్నించగా.. రేట్ల విధానంపై జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని సమాధానం ఇచ్చారు. పన్ను రేట్లను హేతుబద్ధీకరించి పన్ను వ్యవస్థను సరళీకరిస్తామని తెలిపారు. కార్పొరేట్ పన్నును సెప్టెంబర్‌లో తగ్గించిన నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను కూడా తగ్గించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
0 Comments:
Post a Comment