Income tax | ప్రభుత్వ పరిశీలనలో ఆదాయపన్ను తగ్గింపు?!
కార్పొరేట్ టాక్స్ తగ్గింపు తరహాలోనే వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గించాలన్న డిమాండ్‌ను పరిశీలిస్తున్నామని, ఈ విషయమై ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కార్పొరేట్ టాక్స్ తగ్గింపుతో కొత్త పెట్టుబడులు ఆరంభమయ్యాయని, వ్యవస్థలో రికవరీ చిగురులు వేస్తోందని చెప్పారు. వైయుక్తిక ఆదాయపన్ను ప్రయోజనాలను ప్రభుత్వం క్రమానుగతంగా సమీక్షిస్తుంటుందన్నారు. మందగమనంపై మాట్లాడుతూ, తమది చైతన్యవంతమైన ప్రభుత్వమని, ఎకానమీలో సవాళ్లను దీటుగా ఎదుర్కొంటామని దీమా వ్యక్తం చేశారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు ఏ ఒక్క కంపెనీకో ప్రయోజనం చేకూర్చేందుకు తీసుకురాలేదని, వ్యవస్థలో పెట్టుబడులు పెంచేందుకు ఉద్దేశించామని తెలిపారు.
దీనివల్ల ఆదాయంలో రూ. 1.45 లక్షల కోట్ల మేర కోత పడుతుందని, కానీ ఏడాదిలో అంతకుమించిన పెట్టుబడులు తీసుకువస్తుందని వివరించారు. పన్ను నిబంధనల సవరణల బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె పార్లమెంట్‌లో సమాధానమిచ్చారు. తదనంతరం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లలో ఎలాంటి తరుగుదల నమోదు కాలేదని నిర్మల వివరించారు.
ఇదే తొలిసారి కాదు..
జీడీపీ మందగించడం చరిత్రలో ఇదే తొలిసారి కాదని నిర్మల వ్యాఖ్యానించారు. 2012-13లో సైతం జీడీపీ 5 శాతం దిగువకు వచ్చిందని గుర్తు చేశారు. తర్వాత రోజుల్లో వృద్ది పరుగు మరలా పుంజుకుందన్నారు. ఈ దఫా కూడా జీడీపీ తిరిగి గాడిలో పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిపుణుల సూచనలు ప్రభుత్వం స్వీకరించదన్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. బడ్జెట్‌కు ముందు తాను మాజీ ఆర్థిక మంత్రులు ప్రణబ్, మన్మోహన్‌ను కలిసి చర్చించిన సంగతి ఆమె గుర్తు చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ను గత యూపీఏ ప్రభుత్వం సవతితల్లిలా చూసిందని, తాము మాత్రం సంస్థ వ్యూహాత్మక ప్రాముఖ్యతను అర్ధం చేసుకొని సంస్థకు తగిన నిధులు సమకూర్చామని తెలిపారు. లిక్విడిటీ పెంచేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా చాలా రుణాలు ఇస్తోందన్నారు. మరోవైపు నోట్ల రద్దు ప్రభావం ఇప్పట్లో ముగియదని, జీడీపీ 2 శాతం దిగువకు వస్తుందని పార్లమెంట్‌లో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
0 Comments:
Post a Comment