మీరే పెట్రోలు నింపుకోవచ్చు!
సిబ్బంది లేకుండానే సేవలు
విశాఖలో ప్రయోగాత్మకంగా పరిశీలించిన హెచ్‌పీసీఎల్
త్వరలో అందుబాటులోకి బంకు
పెట్రోలు బంకుల్లో సిబ్బంది అవసరం లేకుండా... మీకు మీరే వాహనాల్లో పెట్రోలు, డీజిలు నింపుకోవచ్చు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) మిలీనియం స్టేషన్లలో త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇ-ఫ్యూయల్ స్టేషన్‌గా పిలిచే ఈ బంకును రాష్ట్రంలో మొదటిసారిగా విశాఖపట్నంలోని సిరిపురం కూడలి వద్ద ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మక పరిశీలన పూర్తయింది. వచ్చే సంవత్సరం ఆరంభంలో ఈ స్వయం చాలక (ఆటోమేటెడ్) పెట్రోలు బంకు సేవలను వాహనదారులు పొందవచ్చు. సిరిపురంలోని ఇ-ఫ్యూయల్ స్టేషన్‌లోని అన్ని పంపులకూ స్వయంచాలక సాంకేతికతను అనుసంధానం చేస్తున్నారు. ఇక్కడ పూర్తిగా నగదు రహిత లావాదేవీలుంటాయి. డెబిట్, క్రెడిట్, ఇతర స్మార్ట్ కార్డులను హెచ్‌పీసీఎల్ రీఫ్యూయల్ యాప్ సహాయంతో నిర్వహించుకోవాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ సదుపాయమూ ఉంటుంది. వినియోగదారుడు తానే స్వయంగా ఎన్ని లీటర్ల డీజిల్/పెట్రోలు అవసరమో నమోదు చేయాలి. అనంతరం అక్కడ కనిపించే నగదు మొత్తానికి కార్డు స్వైప్ చేయాలి. ఆ తరువాత మాత్రమే పెట్రోలు పోసే గన్ పనిచేసి, నమోదు చేసిన మొత్తానికి ఇంధనం ట్యాంకులో పడుతుంది. ఏదైనా అత్యవసరమైతేనే దగ్గర్లో ఉన్న సిబ్బంది వచ్చి సహకారం అందిస్తారు.
0 Comments:
Post a Comment