జీఎస్‌టీ రేట్లు పెంపు.. శ్లాబులు కుదింపు?
దిల్లీ: రెవెన్యూలోటుతో కేంద్ర ప్రభుత్వం సతమతమవుతున్న నేపథ్యంలో జీఎస్‌టీ రేట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శ్లాబులను కుదించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చేవారం జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్‌టీ మండలి సమావేశం ఈ నెల 18న జరగనుంది. ఓ వైపు జీఎస్‌టీ వసూళ్లు తగ్గుమఖం పట్టడం, రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం బకాయి పడడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం జీఎస్‌టీలో 5, 12, 18, 28 శాతం చొప్పున నాలుగు శ్లాబులున్నాయి. కొన్నింటిపై జీఎస్‌టీ రేటుకు తోడు సెస్ సైతం విధిస్తున్న సంగతి తెలిసిందే. జీఎస్‌టీ కౌన్సిల్‌కు చేయాల్సిన సిఫార్సులకు తుదిరూపు ఇచ్చేందుకు మంగళవారం కేంద్ర, రాష్ట్రాలకు చెందిన అధికారులు భేటీ అయ్యారు. ప్రస్తుతమున్న జీఎస్‌టీ రేటును 5 శాతం నుంచి 8 శాతానికి, 12 శాతంగా ఉన్న రేటును 15 శాతానికి పెంచాలని యోచిస్తున్నట్లు తెలిసింది. రేట్ల హేతుబద్ధీకరణకు సంబంధించి జీఎస్‌టీ మండలి సమావేశంలో ఓ ప్రజంటేషన్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే పలు వస్తువులపై విధిస్తున్న సెస్‌ను కూడా పెంచనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతమున్న నాలుగు శ్లాబులను మూడుకు కుదించే అంశాన్ని జీఎస్‌టీ మండలి పరిశీలిస్తు్న్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
బడ్జెట్ అంచనాల మేరకు జీఎస్‌టీ వసూళ్లు రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్- నవంబర్ మధ్య సీజీఎస్‌టీ వసూళ్లు ఏకంగా 40 శాతం మేర తగ్గడం గమనార్హం. మరోవైపు జీడీపీ వృద్ధి రేటు సైతం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకంగా 4.5 శాతానికి పడిపోయింది. ఇది 26 త్రైమాసికాల కనిష్ఠం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆదాయం పెంచుకునే మార్గాలపై సూచనలు చేయాల్సిందిగా జీఎస్‌టీ మండలి కేంద్ర, రాష్ట్రాల అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీకి లేఖ రాసింది.
0 Comments:
Post a Comment