మా ఆదేశాలకు లోబడే ఆంగ్ల మాధ్యమం అమలు
పాఠ్యపుస్తకాల ముద్రణకు ఖర్చు చేస్తే చర్యలు తప్పవు
బాధ్యుల నుంచి సొమ్ము రాబడతాం
జీవోపై ‘స్టే’ ఎందుకివ్వకూడదో వివరణ ఇవ్వండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
విద్యా హక్కు చట్టం, ‘సుప్రీం’ తీర్పునకు విరుద్ధంగా జీవో
అభిప్రాయం వ్యక్తం చేసిన ధర్మాసనం
మా ఆదేశాలకు లోబడే ఆంగ్ల మాధ్యమం అమలు
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న ఉత్తర్వులు తమ ఆదేశాలకు లోబడి ఉంటాయని సర్కారుకు హైకోర్టు స్పష్టం చేసింది. ఆంగ్ల మాధ్యమం అమల్లో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణ, ఆంగ్ల పాఠ్యపుస్తకాల ముద్రణ తదితర చర్యలకు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆ సొమ్ము రాబడతామని పేర్కొంది. ప్రాథమికంగా చూస్తే ప్రభుత్వ జీవో విద్యా హక్కు చట్టం, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి, కమిషనర్, రాష్ట్ర ఎడ్యుకేషనల్ రిసెర్చ్, ట్రైనింగ్ కౌన్సిల్ డైరెక్టర్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్, విద్యా పరిశోధన, శిక్షణ రాష్ట్ర మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులపై ‘స్టే’ ఎందుకు ఇవ్వకూడదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. వ్యాజ్యాలను విచారణకు స్వీకరిస్తూ ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 27కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.వెంకటరమణతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2020-21) 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు వీలుగా నవంబరు 20న రాష్ట్ర ప్రభుత్వం జీవో 85 జారీ చేసింది. దానిని సవాలు చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం రావిపాడు గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు, భాజపా నాయకుడు రాంభొట్ల శ్రీనివాస సుధీష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు.
మాధ్యమాన్ని ఎంపిక చేసుకొనే హక్కు విద్యార్థులకు ఉంది: న్యాయవాదులు
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అనూప్ కౌషిక్, కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ.. ‘ప్రభుత్వం జారీ చేసిన జీవో వల్ల తెలుగు మాధ్యమం కనుమరుగై ఆంగ్ల మాధ్యమం అమల్లోకి వచ్చే పరిస్థితి ఉంది. మాతృభాషలో మాధ్యమాన్ని ఎంపిక చేసుకొనే హక్కు విద్యార్థులకు ఉంది. రాజ్యాంగం కల్పించిన వాక్‌స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛలో భాగంగా... మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవడం కూడా ఇమిడి ఉంది. మాధ్యమాన్ని ఎంపిక చేసుకునే హక్కు లేకుండా చేయడం విద్యార్థుల హక్కులకు భంగం కలిగించడమే. ప్రభుత్వ జీవో రాజ్యాంగం కల్పించిన హక్కులపై నిషేధం విధించేలా ఉంది. కేంద్రం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29(2)(ఎఫ్) ప్రకారం విద్యార్థులకు బోధించే మాధ్యమం మాతృభాషలో ఉండాలని స్పష్టం చేస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ ప్రభుత్వం జీవో తీసుకురావడం తగదు. మాతృభాషలో విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత’ అని పేర్కొన్నారు.
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టబోతున్నామని చెప్పారు. కౌంటర్ దాఖలు చేయడానికి గడువు ఇవ్వాలని కోరారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయబోతున్న సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఆంగ్ల మాధ్యమం అమలు చేసేది వచ్చే విద్యా సంవత్సరం అయినా.. ఈలోగా పాఠ్యపుస్తకాల ముద్రణ, ఉపాధ్యాయులకు శిక్షణ తదితర కార్యక్రమాలు చేపట్టబోతున్నారని, తద్వారా ప్రజాధనం వృథా అవుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో ‘యథాతథస్థితి’ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
సొమ్ము వృథా చేయడం ఎందుకు?: ధర్మాసనం
ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రభుత్వం వద్ద డబ్బులు లేని పరిస్థితుల్లో సొమ్ము వృథా చేయడం ఎందుకని ప్రశ్నించింది. ఏజీ మాట్లాడుతూ ‘ఆచరణ సాధ్యమైన మేరకు మాత్రమే మాతృభాషలో బోధన ఉండాలని’ విద్యా హక్కు చట్టం చెబుతోందన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చే వెసులుబాటు ప్రభుత్వానికి ఉందన్నారు. అందుకు ధర్మాసనం స్పందిస్తూ ఎక్కువగా వాదనలు వినిపిస్తే జీవోపై ‘స్టే’ ఇవ్వాల్సి ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. నోటీసులు జారీ చేస్తూ ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ఆదేశించింది.
0 Comments:
Post a Comment