అమరావతిపై మీ వాదనేంటి?
పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
రాజధానిపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలను హైకోర్టు ఆదేశించింది. మీ వాదనేంటని అడ్వొకేట్ జనరల్‌ను ప్రశ్నించింది.
రాజధాని అమరావతి అంశంలో మీ వాదనేంటని అడ్వొకేట్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ఆదేశించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, పర్యావరణ, అటవీశాఖ ముఖ్య పరిరక్షకుడు (కన్జర్వేటర్), సీఆర్డీఏ ఛైర్మన్, కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు, రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ అధ్యయన అథారిటీ ఛైర్మన్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి.. వీరందరికీ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.వెంకటరమణతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాజధాని అమరావతిలో ప్రస్తుత ప్రణాళికల ప్రకారం అభివృద్ధి కార్యక్రమాల్ని కొనసాగించాలని, రాజధాని ప్రణాళికలను పునఃసమీక్షించి సిఫారసులు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది. రాజధాని అమరావతిలో ప్రస్తుత ప్రణాళికల ప్రకారం అభివృద్ధి కార్యక్రమాల్ని కొనసాగించేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని, రాజధాని ప్రణాళికలను పునఃసమీక్షించి సిఫారసులు చేసేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి జి.ఎన్.రావు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి సంబంధించిన జీవో 585ను రద్దు చేయాలని కోరుతూ ‘రాజధాని రైతు పరిరక్షణ సమితి’ కార్యదర్శి డి.రామారావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
ఆ జీవోతో ఆగిన అభివృద్ధి: పిటిషనర్
పిటిషనర్ తరఫున న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ.. రాజధాని ప్రణాళికల పునఃసమీక్ష కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో ఇవ్వడంతో రాజధాని ప్రాంతంలోని అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్నారు. సీఆర్డీఏ చట్టంలోని నిబంధనల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. భూసమీకరణలో వేలమంది రైతులు భూములు ఇచ్చారన్నారు. వాటిని అభివృద్ధి చేసి ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం వారికి హామీ ఇచ్చిందన్నారు. రైతులకు యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు (ఓనర్షిప్ సర్టిఫికెట్లు) ఇచ్చారన్నారు. అభివృద్ధి పనులు చేపట్టాలని సీఆర్డీఏ చట్టం స్పష్టం చేస్తోందన్నారు. భూసమీకరణలో భూములు ఎప్పుడిచ్చారని ధర్మాసనం ప్రశ్నించగా.. రెండేళ్ల కిందట ఇచ్చారన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. నిపుణుల కమిటీ తర్వలో నివేదిక ఇచ్చేలా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా.. ధర్మాసనం స్పందిస్తూ కోర్టు తీర్పునకు లోబడి ఆ నివేదిక ఉంటుందని వ్యాఖ్యానించింది. న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ.. శాసనసభలో ఇటీవల ముఖ్యమంత్రి మూడు రాజధానుల గురించి ప్రకటన చేశారని గుర్తుచేశారు. దీంతో రాజధాని ప్రాంత రైతులు వేదనకు గురవుతున్నారన్నారు. ఈ సందర్భంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. పిటిషన్లో పేర్కొనని అంశాల్ని లేవనెత్తడం సరికాదన్నారు.
పిటిషన్ దాఖలుపైనే ప్రాథమికంగా అభ్యంతరం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ‘‘రాజధాని నిర్మాణ అంశాన్ని చట్టం ద్వారా పేర్కొన్నారు. మీ వాదనలేంటో తెలియజేస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయండి’’ అని వ్యాఖ్యానించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ విచారణను వాయిదా వేసింది.
0 comments:
Post a comment