ATM: గుడ్ న్యూస్... ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా
ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేవారికి శుభవార్త. త్వరలో మీరు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI యోనో క్యాష్ పేరుతో ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. ఎస్‌బీఐ కస్టమర్లు యోనో యాప్ ఉపయోగించి యోనో క్యాష్ పాయింట్‌లో ఏటీఎం కార్డు వాడకుండా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. త్వరలో యూపీఐ ద్వారా ఈ సదుపాయం అన్ని బ్యాంకుల కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. కేవలం యూపీఐ ఉపయోగించి ఏ బ్యాంకు ఏటీఎంలో అయినా డబ్బులు సులువుగా డ్రా చేయొచ్చు. మొదట బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సేవల్ని ప్రారంభించనుంది. డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్ ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్‌తో ఒప్పందం కుదుర్చుకొని ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురానుంది.
వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో యూపీఐ ద్వారానే ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ కార్యకలాపాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI పర్యవేక్షిస్తోంది.
కస్టమర్లు ఏటీఎం దగ్గరకు వెళ్లి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు. డబ్బులు డ్రా చేయొచ్చు. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పేమెంట్స్ చేసినట్టుగానే, డబ్బులు డ్రా చేసుకోవడం సులువవుతుంది. ఇందుకోసం మీకు స్మార్ట్‌ఫోన్, యూపీఐ అకౌంట్ ఉంటే చాలు. ప్రస్తుతం ఇదంతా ప్రయోగ దశలోనే ఉంది. ఈ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ అన్ని బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకొని ఏటీఎంలో యూపీఐ ద్వారా డబ్బులు డ్రా చేసే సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇదే కాదు... ఆధార్ నెంబర్, ఓటీపీ ఆథెంటికేషన్ ద్వారా డబ్బులు డ్రా చేసే ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. ఏటీఎం మోసాలు, కార్డు మోసాలు పెరిగిపోతున్నందున వాటిని అరికట్టేందుకు ఈ కొత్త సేవల్ని పరిశీలిస్తున్నాయి బ్యాంకులు.
0 Comments:
Post a Comment