ధోతీలో నోబెల్ అందుకున్న అభిజిత్
స్టాక్‌హోం: అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకొని భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన అభిజిత్ బెనర్జీ.. మరోసారి దేశ ఔన్నత్యాన్ని ఇనుమడింపజేసే పనిచేశారు. దేశాన్ని విడిచి ఏళ్లు గడుస్తున్నా.. భారత సంప్రదాయాన్ని ఏమాత్రం మరువలేదు. స్వీడన్‌లో మంగళవారం నోబెల్ పురస్కార ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డుఫ్లో భారత సంప్రదాయ దుస్తుల్లో హాజరై అందరినీ అబ్బురపరిచారు. ధోతి, బంద్‌గలా సూట్‌లో అభిజిత్ వేడుకకు హాజరుకాగా.. చీరకట్టు, బొట్టుతో వచ్చిన ఎస్తర్ మన సంస్కృతిని ప్రపంచానికి చాటారు. పురస్కారం అందుకున్న తర్వాత వేడుకకు హాజరైన వారందరికీ నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి భారత్‌లోని ఆయన కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు.
పేదరికపు విషకోరల నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించేలా తన అధ్యయనం ద్వారా అద్భుత పరిష్కారాలను సూచించినందుకుగానూ అభిజిత్ బెనర్జీ సహా ఆయన భార్య ఎస్తర్ డుఫ్లో, మరో ఆర్థికవేత్త మైఖెల్ క్రెమర్‌కు నోబెల్ పురస్కారం లభించిన విషయం తెలిసిందే. స్వీడన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆ దేశ రాజు గుస్టాఫ్ నుంచి వారు పురస్కారం అందుకున్నారు.
0 Comments:
Post a Comment