సచివాలయం, సీఎం క్యాంపు ఆఫీసు హెచ్‌వోడీ కార్యాలయాలు
అధికారులకు నివాస గృహాలు
ఐదు మండలాల్లో భూములు కేటాయింపు
సీఎంవో సహా కొన్ని విభాగాలకు రుషికొండ ఐటీ సెజ్‌లో తాత్కాలిక వసతి
మరికొన్నిటికి నగరం, మధురవాడల్లో
రాజధాని ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం
పై నుంచి జిల్లా యంత్రాంగానికి సంకేతాలు
(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)రాజధాని మార్పుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు సాగుతున్నా.. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకు ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అధికారికంగా ఆదేశాలు రాకపోయినా అందుకు అనుగుణంగా సన్నద్ధం కావాలని జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వ పెద్దల నుంచి సంకేతాలు అందినట్లు తెలిసింది. విశాఖపట్నం పాలనా రాజధాని కావచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. అనంతరం జీఎన్ రావు కమిటీ విశాఖపట్నంలో సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో పాలనా రాజధానికి ప్రాథమికంగా 3 వేల ఎకరాలు సరిపోతాయని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పలు కార్యక్రమాల నిమిత్తం జిల్లా అధికారులు ప్రభుత్వ భూముల వివరాలు సేకరించారు.
ఇటీవల బిల్డ్ ఏపీ కోసం నగరంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు, స్థలాలు, భవనాలను గుర్తించారు. వీటిలో అవసరమైన వాటిని రాజధానికి వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఒకేచోట కాకుండా పలుచోట్ల ఉన్న ప్రభుత్వ భూములను రాజధాని అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. పాలనా రాజఽధాని అంటే సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, మంత్రులు, ఉన్నతాఽధికారులు, సిబ్బంది నివాసాలు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వస్తాయి. ముఖ్యమంత్రి కార్యాలయం ఒకచోట నిర్మిస్తారు. మిగిలినవి వేర్వేరు చోట్ల ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
సచివాలయం, హెచ్‌వోడీలు ఒకేసారి..
హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధానిని తరలించేప్పుడు తొలుత విభాగాధిపతులు విజయవాడ వచ్చారు. అనంతరం తాత్కాలిక వసతి సిద్ధం కావడంతో సచివాలయం కూడా తరలివచ్చింది. అయితే విశాఖలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు ఒకేసారి ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇందుకు మూడు వేల ఎకరాలు సరిపోతాయని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. నగరంలోని ముడసర్లోవ ప్రాంతంతోపాటు విశాఖ రూరల్, భీమునిపట్నం, ఆనందపురం, సబ్బవరం, పెందుర్తి మండలాల్లోని భూములను రాజధానికి కేటాయించనున్నట్టు చెబుతున్నారు. శాశ్వత భవనాలు నిర్మించే వరకు తాత్కాలికంగా అందరికీ నగరంలో వసతి కల్పిస్తారు. ఇందుకోసం భవనాల అన్వేషణ కూడా మొదలైంది. ఈ కార్యక్రమాన్ని అధికారులు గుట్టుచప్పుడు కాకుండా చేపట్టారని తెలిసింది. సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయం, విభాగాధితుల్లో కొందరు కార్యాలయాల కోసం రుషికొండ ఐటీ సెజ్‌లోని భవనాలను పరిశీలిస్తున్నారు. మరికొన్ని విభాగాలు, ఉన్నతాధికారులకు నగరం, మధురవాడ పరిసరాల్లో కొత్తగా నిర్మించిన అపార్టుమెంట్లు చూస్తున్నారు. బిల్డర్లను సంప్రదిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తర్వాతే భవనాల సమీకరణకు ముందుకెళ్లాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. కాగా.. ఉన్నతాధికారులకు విజయవాడలో నెలకు 40 వేలు ఇంటి అద్దె అలవెన్స్ ఇస్తున్నారు. బహుశా అదే మొత్తం లేదా మరికొంత పెంచి ఇవ్వవచ్చనే చర్చ అధికారుల్లో సాగుతోంది.
అధికారికంగా ఆదేశాలు రాలేదు
పాలనా రాజధానికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వస్తే జిల్లా యంత్రాంగం అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. అయితే నగర పరిసరాల్లో ఇతరత్రా అవసరాలకు భూములు గుర్తించాం. ప్రభుత్వం ఎలా ఆదేశిస్తే ఆ విధంగా వాటిని వినియోగిస్తాం.
- వి.వినయ్‌చంద్, విశాఖ కలెక్టర్
అనకాపల్లి నుంచి భోగాపురం వరకు మెట్రో
విశాఖ నగరంలో రహదారులు, ఇతరత్రా సౌకర్యాలు ఉన్నందున కొత్తగా భవనాలు నిర్మిస్తే సరిపోతుందనే భావన ఉన్నత స్థాయిలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును అనకాపల్లి నుంచి భోగాపురం వరకు నిర్మించాలనే ఆలోచన కూడా తాజాగా తెరపైకి వచ్చింది. భవిష్యత్‌లో నగరంలో ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు మెట్రో దోహదపడుతుందనేది అంచనా.
Hai...ఫ్రెండ్స్...
New....ఇంటర్నెట్ దిగ్గజం ....గూగుల్ వారి బెస్ట్ యాప్స్....డౌన్లోడ్ చేసుకోండి.... బెస్ట్ యాప్స్
0 Comments:
Post a Comment