Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Saturday, 23 November 2019

Mallavaram Venkateswara swamy and Dam -మల్లవరంలోని వేంకటేశ్వర స్వామివారి దేవాలయం. -స్వామి వారి పాదములను అభిషేకించుచున్నట్లుగా గుండ్లకమ్మ నది-.స్థల పురాణము-


కలౌ స్మరణాన్ ముక్తిః -కలియుగంలో కేవలం దైవ నామస్మరణ చేసినంతనే ముక్తి లభిస్తుంది. అందులో కలౌ వేంకటనాయకః -కలియుగంలో వేంకటేశ్వరుని నామస్మరణ చేసినట్లయితే కష్టాలనుండి విముక్తి లభించడమే గాకుండా జీవన్ముక్తి లభిస్తుంది. అటువంటి నామస్మరణ ఆ దేవుని ఎదురుగా, ఆయన సన్నిధిలో చేసినట్లయితే.. అంతకంటే ముక్తీ, మోక్షం వేరొకటి ఏదీ ఉండదు భక్తులకు. ఆ మహాద్భాగ్యాన్ని ప్రసాదించే వేంకటేశుని దివ్య సన్నిధానాలలో ప్రసిద్ధమైనది శ్రీ మల్లవరంలోని వేంకటేశ్వర స్వామివారి దేవాలయం. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో (గుండికానది) గుండ్లకమ్మ తీరాన మల్లవరం కొండపై చాలా ఏండ్ల కిందట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వెలిశారు. ఇది పురాతనంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. అంతేకాదు, అత్యంత ప్రాచీనమైన క్షేత్రము కూడా. ఇందు విశేషముగా స్వామి వారి పాదములను అభిషేకించుచున్నట్లుగా గుండ్లకమ్మ నది ప్రవహిస్తూ ఉంటుంది. సూర్యోదయ సమయాన సూర్యుని కిరణాలు ఈ నదిమీదుగా నేరుగా స్వామివారి గర్భగుడి ఆవరణలోకి ప్రసరించటం ఈ పుణ్యక్షేత్ర విశేషము. నలువైపులా కొండలతో ప్రకృతి రమణీయత మధ్య

విరాజిల్లుతున్న ఈ కోనేటిరాయుడి నెలకొన్న ప్రాంతము వింతకాంతులతో అలరారుతుంటుంది. ప్రతి నెలలో శుద్ధ ఏకాదశినాడు ప్రాతఃకాలం నుంచి అహోరాత్రులూ గోవింద నామస్మరణతో దేవాలయ ప్రాంగణం అంతా మారుమ్రోగుతుంటుంది. సమీప గ్రామాల నుంచి లక్షలాదిగా భక్తులు ఉత్సాహంతో పాల్గొని స్వామి కృపకు పాత్రులౌతున్నారు. కవిత్రయంలో పేరెన్నికగన్నట్టి ఎర్రాప్రగడ ఈ క్షేత్ర వైభవాన్ని తన ఉత్తర హరివంశ పీఠికలో వర్ణించినారంటేనే ఈ క్షేత్ర మహత్మ్యము ఎంతటిదో గ్రహించవచ్చు.

స్థల పురాణము
పిలిచిన పలికే దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు గగనమార్గాన విహరించుచూ గుండికా (గుండ్లకమ్మ) నది సమీపము వేంచేసి, అక్కడి ప్రకృతి రమణీయతకు పరవశులై కొంతసేపు విశ్రమింప దలచినారు. శ్రీవారి కోరికను తీర్చలేని తమ్మవరపు గిరిని ఒక్క తాపుతో గుండ్లకమ్మ నదిలో పడవేసిరి. నేటికినీ మనము ఆ విరిగి పడిన తమ్మవరపు గిరిని గుండ్లకమ్మ నదిలో చూడవచ్చు. అంతట మల్లవర గిరి మాత్రము స్వామివారిని అర్ధించి తన సానువులపై విశ్రాంతి తీసుకొమ్మని ప్రార్ధించి, తన జన్మ పావనము చేయమని వేడుకొన్నది. అంతట స్వామివారు ఆ గిరిపై విశ్రమించారు. మల్లవరగిరి పాదభూమిలో ఒక శిలపై స్వామివారి అశ్వపు డెక్కల గుర్తులు నేటికినీ స్పష్టముగా గుర్తింపబడుతూ, భక్తులచే పూజింపబడుచున్నవి. తనకు విశ్రాంతి నిచ్చిన మల్లవరగిరిని ఏదైనా కోరుకొమ్మని స్వామివారు అనుగ్రహించగా, ‘శ్రీవారి తేజో అంశమును ఇచ్చట శాశ్వతముగా నెలకొల్పుమని ప్రార్ధించినది’. భక్త వరదుడైన శ్రీనివాసుడు తన నిజ తేజమును గిరిపై నిల్పి, తాను భక్తసులభుడనని నిరూపించారు. ఈ విషయమును గ్రహించిన నారద మునీంద్రులవారు మల్లవరగిరిపై నెలకొన్న శ్రీనివాసులవారి తేజో అంశమును చూసి, భక్తి పారవశ్యముతో పూజించి, శ్రీ వేంకటేశ్వరులవారి
విగ్రహ ప్రతిష్ట గావించినారు. నేటికినీ నడి రేయి ఏ జాములోనైనా దేవ ఋషి గణములు స్వామివారి సేవించుచుందురు. ఆదిశేషుడు తన దివ్యమైన సర్పాకృతిలో వచ్చి ఈ స్వామిని సేవించుచున్నట్లు ఈ స్థలపురాణం స్పష్టంగా తెలియజేయుచున్నది.
ఇంతటి మహిమాన్వితమైన ఈ దేవాలయమును శ్రీకృష్ణదేవరాయలు వారు దర్శించి, దేవాలయ నిర్మాణము గావించారని చరిత్రకారులు చెబుతున్నారు. అద్దంకి సీమను పాలించిన రెడ్డిరాజులు ఈ దేవాలయమునకు అనన్యమైన మాన్యములను సమర్పించుకున్నారుట. పెదకోమటి వేమారెడ్డి శిలాశాసనములను అనుసరించి క్రీ.శ.1277వ సంవత్సరము చంద్ర గ్రహణ సమయమున యజ్ఞము కావించి శ్రీ వేంకటేశ్వర స్వామివారి కైంకర్యముల నిమిత్తము ‘మల్లవర’ గ్రాముము మొత్తం దానం చేసినట్లు తెలియుచున్నది. వేమారెడ్డి పుత్రుడు సైన్యాధిపతియైన మల్లారెడ్డి పేర ఈ గ్రామము స్థాపింపబడి శ్రీ శ్రీనివాసునికి కైంకర్యముగా సమర్పించారని కూడా చెప్తుంటారు.

స్వామివారిని కీర్తించి తరించిన కవులు
‘అహోబలీయము’ అన్న సంస్కృత వ్యాకరణమును రచించిన గాల నరసయ్య గారు మల్లవర శ్రీనివాసుని సదమల భక్తితో ఆరాధించారు. 1854లో ముక్తినూతలపాటి సీతారామ కవీంద్రుడు -శ్రీ మల్లవర వేంకటేశ్వరునిపై చూర్ణికలను రచించారు. సుప్రసిద్ధ కవి పండితుడైన వావిలాల రామమూర్తిగారు మల్లవర వేంకటేశ్వర శతకమును రచించారు. శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో ప్రతిష్టించబడిన శ్రీ ఆంజనేయునిపై వావిలాల జాలయ్యగారు కీర్తనలను రచించారు.
పూర్వ చరిత్ర:- ప్రాచీనకాలంలో మల్లవర గిరిపై వైష్ణవ అగ్రహారము ఉండెడిది. వైష్ణవులు స్వామివారి సన్నిధిలో ప్రబంధ పారాయణము గావించుచుండెడి వారు. వారు వేద ఘోషతో, పురాణ పఠనాలతో, నృత్య గీత వీణా వాయిద్యములతో స్వామివారిని సేవించుండెడివారు. కాలక్రమమున ఇచ్చట నుంచి వారు తిరుపతి,

అహోబిలము మొదలగు ప్రాంతములకు తరలిపోయారు. తిరుపతిలో వాసికెక్కిన శ్రీ సుదర్శనాచార్య నరసింహాచార్యుల పూర్వులు ఈ మల్లవరమునకు చెందిన వారే.

ముక్తినిచ్చే మల్లవరం
అనేకమంది భక్తులు ఇక్కడ తపస్సు గావించి ముక్తిని పొందారని పురాణాలు చెప్తున్నాయి. శ్రీ కొంగలయ్యగారు గుండ్లకమ్మ సమీపంలోని ఒక శిలపై ఏకాగ్రతతో తపస్సు కావించుచుండగా, కొంగలు వారిచుట్టూ బారులు తీరి వారికి ప్రదక్షిణములు చేసేవిట. ఒంటికాలుపై నిలుచుని వారు చేసే తపోదీక్ష అంత తీవ్రంగా ఉండేదట. కాలక్రమములో వారు పేరు శ్రీకొంగలయ్య గారుగా ప్రసిద్ధి చెందింది. వైష్ణవ పీఠాధిపతులై పాలపర్తి సీతారామయ్య గారు ఈ క్షేత్రములో ఉగ్ర తపస్సు చేసి అనంతను సాక్షాత్కారము పొందినారు. అద్దంకి వెంకట్రాయుడుగారు ఇచ్చట ఒక మండలము పాటు కఠిన మంత్ర జపం గావించి సిద్ధినొందినారుట. గాలి రంగదాసుగారు ఇచ్చట ‘రాసక్రీడోత్సవము’ నిర్వహించి గరుడ ఆళ్వారుల దర్శనము నొందినారు. తెనాలి, బందరు, గుంటూరు మున్నగు పట్టణముల నుంచి కూడా భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటుంటారు.
మల్లవరములోని శిలాశాసనము ప్రకారం గుండ్లకమ్మకు ఇరువైపు గల ప్రాంతమును పుంగినాడుగా వ్యవహరించేవారుట.
శ్రీశైలము, అహోబిలము, శ్రీ మల్లవరపు శ్రీనివాసుల నిలయమునకు గల సోపానములు. ఒకే సమయమున రెడ్డి రాజులచే నిర్మితములైనట్లు చరిత్ర తెలుపుతోంది. ఈ క్షేత్రము రెండవ తిరుపతి దివ్యక్షేత్రమై అలరారుతుంటోంది.
వైశాఖ శుద్ధ దశమి మొదలు నవాహ్నికముగా నిచ్చట వార్షికముగా బ్రహ్మోత్సవములు శతాబ్దముల నుంచి జరుగుచున్నది. ఈ బ్రహ్మోత్సముల్లో తరంగా కాలక్షేపము ఒక ప్రత్యేక

ఆకర్షణ. ఎందరో నిష్ణాతులైన సంగీత విద్వాంసులు ఇచ్చట తరంగ కాలక్షేపము చేయుట తమ భాగ్యమని భావించెడివారుట. శ్రీ నారాయణ తీర్థ జీవిత చరిత్రలో మల్లవరం తరంగ కాలక్షేపము ప్రసిద్ధిమైనదని లిఖించబడినది. ఈ తరంగ కాలక్షేపములో పాల్గొన్న ప్రముఖులలో -శ్రీ ధేనువకొండ చిన్నయ్య, వెంకయ్యలు, శ్రీ ధేనువకొండ సుబ్బారావు, శ్రీ వాలి సుగ్రీవులు, రామాయణంవారు, కొత్తపల్లి బలరామయ్య, శ్రీ బొమ్మరాజు సీతారామయ్య, శ్రీ ఘోరకవి రాఘవరావు, శ్రీ నాగరాజు సుబ్బారావు, మున్నగు హరిదాసులిచ్చట తరంగ కాలక్షేపమును గావించి ధన్యులైనారు. శ్రీ కుర్తాళం వౌనస్వామి, పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శివచిదానంద భారతి, శ్రీ విఠల్‌స్వామి, శ్రీ మహేషానందస్వామి, శ్రీ బ్రహ్మానంద తీర్థులు, శ్రీ ప్రేమానంద స్వామి, మున్నగు సాధువులు ఈ క్షేత్రాన్ని దర్శించిన వారిలో ఉన్నారు. ఈ క్షేత్రము కొలది కాలములోనే దివ్య వైభవం సంతరించుకోగలదని వారు అన్నారు.
ఈ దేవస్థానము నందు జీర్ణోద్ధరణ కార్యక్రమములు ప్రారంభమైనవి. నూతనంగా సోపానములు నిర్మిస్తున్నారు. దేవాలయంలో పాలరాళ్ళు పరిచారు. నూతన కళ్యాణ మండపాలు నిర్మించారు. భక్తులు ఇచ్చట ఉచితంగా కళ్యాణములు జరుపుకొనుచున్నారు. ప్రతి మాసములో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు ఇక్కడ అఖండ నామ సంకీర్తనం జరుగుతుంది. వేలకొలది భక్తులు ఈ ఏకాదశి నాడు జరిగే భజనలలో పాల్గొంటారు. ఈ భక్తులకు ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.
20 అడుగుల ఎత్తుగల ఆంజనేయ, గరుడ విగ్రహాలు ఆలయం ముందు నిర్మించారు.
గాలి గోపురం, వేంకటేశ్వర, ఆంజనేయ ముఖమండపాలు, యజ్ఞశాల, నూతన ధ్వజ స్థంభములు నిర్మాణమునకు ప్రభుత్వ దేవాదాయ శాఖ వారు సుమారు 12 లక్షలు ఆర్ధిక సహాయం కావించారు. కుర్తాళం పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామివారు 13-05-2005న కలశ ప్రతిష్ట గావించారు. శ్రీ పద్మావతి దేవాలయ నిర్మాణం పూర్తి అయింది. గోదాదేవి (ఆండాల్)

దేవాలయ నిర్మాణము రామానుజ కూటమి నిర్మాణము త్వరలో ప్రారంభం కాబోతున్నాయి.
శ్రీ వేంకటేశ్వర స్వామివారి పాద సన్నిధిలో త్వరలో గుండ్లకమ్మ రిజర్వాయరు ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఇది పూర్తిగా రూపుదిద్దుకున్న తర్వాత ప్రముఖ పర్యాటక కేంద్రంగా రాణించగలదు.
సంతానము లేనివారు గరుడపతాకమునెత్తు సమయమున, గరుడ పతాకము దించు సందర్భములలో ప్రసాదమును స్వీకరించి ఆ రాత్రి దేవాలయంలో నిద్రించిన వారికి సత్వరమే సంతానము కల్గునని భక్తుల విశ్వాసము. అలాగే ఇచ్చట జరిగే విశిష్ట కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీపద్మావతి, స్వామివార్ల తలంబ్రాలను శిరమున ధరించిన వారికి శీఘ్రముగా వివాహం జరుగునని కూడా భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ కళ్యాణోత్సవములో పాల్గొన్న భక్తులకు భోజన సదుపాయాలు కూడా కలిగించుచున్నారు. ఈ కారణంగా వచ్చు భక్తులకు సేవా కార్యక్రమములు చేయుటకు స్వచ్ఛందంగా భక్తులే కార్యకర్తలుగా మజ్జిగ, పానకము, తాగునీరు అందించుటతోపాటు శీతలోపచారములు గావించుచూ స్వామిపట్ల తమకున్న భక్తిని చాటుకొంటున్నారు. అతి సమీపకాలంలోనే ఈ క్షేత్ర మహిమ ఆంధ్రప్రదేశ్‌లో మారుమోగగలదని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసము.
రమణీయ ప్రకృతి దృశ్యముల మధ్య వెలసిన ఈ ప్రాచీన క్షేత్రమును ఆస్థికులందరూ దర్శించవలసినదే!

బ్రహ్మోత్సవాలు
ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ విదియ వరకు తొమ్మిది రోజులు బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజులు స్వామివారికి వివిధ అలంకరణలు, అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ గ్రామ ప్రజలేకాక, చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు కూడా ఈ

కార్యక్రమములో పాల్గొని తమ జన్మ ధన్యమైనట్లు భావిస్తారు.
తొమ్మిది రోజుల కార్యక్రమాల వివరాలు:-
 శుద్ధ దశమి రాత్రి: అంకురారోపణము, అజస్త్ర దీపారాధన, దీక్షారాధన, మృత్సం గ్రహణము.
 ఏకాదశి ఉదయం: పుణ్యాహవాచనం, అగ్నిప్రతిష్టాపన, వాస్తుశుద్ధి, నిత్యహోమము, ధ్వజారోహణము, నిత్య బలిహరణ. రాత్రి: నిత్య హోమము, బలిహరణ, శేషవాహనము.
 ద్వాదశి ఉదయం: పుణ్యాహవాచనం, నిత్య హోమం, బలిహారణం, హంసవాహనము. రాత్రి: నిత్యహోమము, బలిహారణము, హంసవాహనము.
 త్రయోదశి ఉదయం: పుణ్యాహవాచనం, నిత్యహోమం, బలిహారణ. రాత్రి: నిత్యహోమము, బలిహరణ, సింహవాసనము
 చతుర్దశి ఉదయం: పుణ్యాహవాచనం, నిత్యహోమము, బలిహారణ. రాత్రి: నిత్యహోమము, బలిహరణ, హనుద్వాహనము
 పూర్ణిమ ఉదయం: పుణ్యాహవాచనం, నిత్యహోమము, బలిహారణ. రాత్రి: ఉత్సవమూర్తులకు విశేష స్నపన, మోహిని ఉత్సవము, నిత్యహోమము, బలిహారణ, గరుడసేవ
 బహుళ పాడ్యమి ఉదయం: పుణ్యాహం, నిత్యహోమము, బలిహారణ. రాత్రి: నిత్యహోమము, బలిహారణ, గజోత్సవం, సాంస్కృతి కార్యక్రమాలు
 విదియ ఉదయం: శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ సహస్రనామ పారాయణం, కళ్యాణ మహోత్సవము, అన్న సంతర్పణం. రాత్రి: నిత్యహోమము, బలిహరణ రథోత్సవము
 తదియ ఉదయం: పుణ్యాహవాచనం, నిత్యహోమము, బలిహారణ. రాత్రి: నిత్యహోమము, బలిహారణ, అశ్వవాహనము.
 చవితి ఉదయం: పుణ్యాహవాచనం, నిత్యహోమము, బలిహారణ, అశ్వవాహనము, ఉత్సవము అనంతరం జోర సంవాదము. రాత్రి: పుణ్యాహవాచనం, నిత్యహోమము, బలిహారణ, శాంతిహోమము, ధ్వజారోహణ, పూర్ణాహుతి
 పంచమి ఉదయం: చక్రతీర్థము, రాత్రి: ఏకాంతసేవ

ప్రతి నిత్యం స్వామివారికి, విశేష సాల గ్రామాలకు క్షీరాభిషేకం, తిరువారాధన, అష్టోత్తరం, శ్రోత్రనామావళి, హారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వామివారికి విశేష పూలాంకరణ చేస్తారు.


Mallavaram Dam Youtube video...

1 comment:

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top