అమ్మాయిలూ..ఆపదలో ఆదుకునేవి ఈ నంబర్లే
ఇంటర్నెట్‌డెస్క్: ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ బిడ్డలను బయటకు పంపించాలంటేనే తల్లిదండ్రుల్లో వణుకు పుడుతోంది. సమాజంలో మనిషి ముసుగులో తిరుగుతున్న మృగాలు కామోన్మోదంతో విరుచుకుపడి పసి పిల్లలు సహా ఏ వయసుల వారినైనా విచక్షణా రహితంగా బలి తీసుకుంటున్నారు. దేశంలో నిత్యకృత్యంగా మారిన ఇలాంటి దారుణాలు తీవ్ర ఆందోళనను కల్గిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులో యువ వైద్యురాలు, వరంగల్‌లో ఓ యువతిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.
సమాజంలో ఇలాంటి దారుణాలను, మహిళలపై వేధింపులను నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం షీ బృందాలను ఏర్పాటు చేసినా కొంత వరకే నియంత్రించగలుగుతున్నాయి. తాజాగా జరిగిన రెండు ఘటనలతో అమ్మాయిల భద్రతపై తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వారికి ధైర్యాన్నిచ్చేందుకు పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోంది. అమ్మాయిలకు ఏ ఆపద వచ్చినా.. వారెలాంటి ఇబ్బందుల్లో ఉన్నా.. వాహనాలు ఆగిపోయినా దయచేసి 100 నంబర్‌కు డయల్ చేయాలని పలువురు మంత్రులు, పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే, ఇప్పటికే భద్రతకు సంబంధించి అనేక టోల్‌ఫ్రీ నంబర్లు ఉన్నప్పటికీ.. ఆపదలో చిక్కుకున్న సమయంలో వాటిపై సరైన అవగాహన లేక చాలామంది యువతులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా శంషాబాద్ ఘటనలోనూ అదే జరిగింది. బుధవారం రాత్రి ఆమె తన సోదరితో ఫోన్లో మాట్లాడి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడే డయల్ 100కు ఫోన్ చేస్తే జీపీఎస్ ఆధారంగా నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడికి చేరుకొని.. ఈ ఘోరాన్ని నివారించగలిగేవారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆపత్కాలంలో భద్రతాపరంగా సాయపడే కొన్ని టోల్‌ఫ్రీ నంబర్లపై యువతులు, మహిళలు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన నొక్కి చెబుతోంది. ఈ నేపథ్యంలో దిగువ పేర్కొన్న నంబర్లను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకునేలా చర్యలు చేపడితే అలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించే వీలుంటుంది.
* డయల్-100
* దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1090, 1091
* రాష్ట్రంలో ‘షి’ బృందాలు ఏర్పాటు చేసిన 040-27852355 లేదా వాట్సాప్ నంబరు 94906 16555కు ఫిర్యాదు చేయవచ్చు.
0 comments:
Post a comment