Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Sunday, 13 October 2019

గాంధీజీ 'నయీ-తాలీం' (నవీన విద్య) గురించి వాడరేవు చిన వీరభద్రుడు గారి వ్యాసం...

Vadarevu Ch. Veerabhadrudu's Article on Gandhiji Nai talim- చదువుల్ని సంస్కరించాలంటే, గాంధీజీ ప్రతిపాదించిన  'నయీ-తాలీం' (నవీన విద్య) ఒక ఆచరణాత్మక ఉద్యమంగా మార్చుకోవడమొక్కటే మార్గం --మహాత్మా గాంధీజీ  'నయీ-తాలీం' (నవీన విద్య) గురించి వాడరేవు చిన వీరభద్రుడు గారి వ్యాసం...

 ఈ చదువుల్ని సంస్కరించాలంటే, గాంధీజీ ప్రతిపాదించిన 'నయీ-తాలీం' (నవీన విద్య) ఒక ఆచరణాత్మక ఉద్యమంగా మార్చుకోవడమొక్కటే మార్గం - వాడ్రేవు చిన వీరభద్రుడు, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ,ఆంధ్రప్రదేశ్


ఈ చదువుల్ని సంస్కరించాలంటే, గాంధీజీ ప్రతిపాదించిన  'నయీ-తాలీం' (నవీన విద్య) ఒక ఆచరణాత్మక ఉద్యమంగా మార్చుకోవడమొక్కటే మార్గం
- వాడ్రేవు చిన వీరభద్రుడు, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ,ఆంధ్రప్రదేశ్

మహాత్ముడు పుట్టి నేటికి నూటయాభై ఏళ్ళు. ఆయన జీవితకాలంలో వెలిబుచ్చిన అభిప్రాయాల్లోనూ, సాగించిన ఆలోచనల్లోనూ, చేపట్టిన ప్రయోగాల్లోనూ ఇప్పటిప్రపంచానికి పనికొచ్చే అంశాలేమైనా ఉన్నాయా అనే ఒక చర్చ ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నది. ఆయన నిర్వహించింది కేవలం ఒక దేశానికి, ఒక జాతికి, ఒక కాలానికి మాత్రమే పరిమితమైన చారిత్రిక పాత్ర కాదనేది దాదాపుగా అందరూ గుర్తిస్తున్నారు. వివిధ దేశాలకీ, వివిధ జాతులకీ, వివిధ మానవసమూహాలకీ, వివిధ కాలాలకీ కూడా స్ఫూర్తినివ్వగల ప్రాసంగికత వాటిలో ఉందనేది ఒక మెలకువ.

కొందరు ఆయనలో ఒక పౌరహక్కుల ఉద్యమకారుణ్ణి చూస్తున్నారు. ఆధునికతకు ప్రత్యామ్నాయ జీవనశైలిని అన్వేషించినవాడిగా కొందరు ఆయన్ని గుర్తిస్తున్నారు. కొందరి దృష్టిలో ఆయన స్థానిక గ్రామ స్వపరిపాలనను ప్రోత్సహించిన పోస్ట్ మాడర్న్ రాజనీతిజ్ఞుడు, పాలనాతత్త్వవేత్త. మరికొందరికి ఆయన వస్త్రధారణలో, ఆహారవినియోగంలో, గృహ నిర్వహణలో కొత్త పద్ధతుల్ని పాటించిన మనిషి. ఏమైనప్పటికీ మారుతున్న కాలంతో పాటు ఆయన్ని అర్థం చేసుకునే పద్ధతిలో కూడా మార్పు వస్తోంది. ఒకప్పుడు ఆయన్ని యంత్రనాగరికతకీ, ఆధునిక సాంకేతికతకీ వ్యతిరేకిగా భావించారు. కాని, సైన్సు అంటే నిజమైన అర్థం నిరంతర ప్రయోగశీలత్వమనీ, కొన్ని మూఢవిశ్వాసాలకు కట్టుబడి ఉండకపోవడమనీ అనుకుంటే, గాంధీజీ, తన జీవితం పొడుగునా, అనుదినం, అనుక్షణం ప్రయోగాల వెనక ప్రయోగాలు చేపడుతూనే ఉన్నారనీ, ఆ అర్థంలో ఆయనది నిజమైన scientific temper అనే భావన కూడా ఇటీవల బలపడుతున్నది.

రానున్న రోజుల్లో గాంధీజీని ప్రపంచం ఏ పార్శ్వంలో ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది, ఏ అంశంలో ఆయన్ను ఎక్కువ అనుసరించడానికి సిద్ధపడుతుందనేది ఈ క్షణాన తేల్చి చెప్పడం కష్టం. నానాటికీ, ప్రపంచం ఒక గ్లోబల్ మార్కెట్ గా మారుతూ, పర్యావరణాన్ని కొల్లగొడుతూ, అత్యధిక సంఖ్యాకులకి అస్థిరతనీ, అభద్రతనీ కలిగించే ఆర్థిక-రాజకీయ వ్యవస్థగా రూపొందుతున్నకాలంలో, వ్యక్తి విశ్వాసాలకీ, గౌరవానికీ, మానవమర్యాదకీ భంగం వాటిల్లుతున్న కాలంలో, బహుశా, మనిషి తన అస్తిత్వ గౌరవాన్ని తాను కాపాడుకునే ప్రయత్నంలో గాంధీజీని ముందుముందు మరింత శ్రద్ధగా పరికిస్తాడని భావించవచ్చు.

కాని, నేనేమనుకుంటానంటే, తాను విద్య పట్ల చేపట్టిన ప్రయోగాలూ, నవీన విద్య గురించి కన్నకలలూ, ప్రకటించిన అభిప్రాయాల వల్ల గాంధీజీ నేడు మునుపెన్నటికన్నా మిన్నగా మరింత ప్రాసంగికుడవుతున్నాడని. విద్య గురించి ఆయన జీవితకాలం పొడుగుతా తనకై తానుగా ఏర్పరచుకుంటూ వచ్చిన స్పష్టత, ఈనాడు మనకి మరింత స్పష్టతనిచ్చేదిగా కనిపిస్తున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే, 1921 దాకా తన జీవితగమనాన్ని ఆయన ఆత్మకథగా రాసుకున్నప్పుడు 'సత్యంతో నా ప్రయోగాలు' అని పేరుపెట్టాడుగాని, తన పూర్తి జీవితాన్ని ఆత్మకథగా రాసుకుని ఉంటే 'విద్యతో నా ప్రయోగాలు' అని పేరుపెట్టి ఉండేవాడనిపిస్తుంది,

మనం ఆధునిక విద్యగా భావిస్తున్నది పద్ధెనిమిదో శతాబ్దిలో యూరోప్ లో వికాస యుగంకాలం లో రూపుదిద్దుకున్నది. సైన్సు, రీజను, ప్రజాస్వామ్యం, లౌకిక భావజాలం పునాదులుగా రూపుదిద్దుకున్న ఆ విద్యావ్యవస్థ, మధ్యయుగాల దాస్యం నుంచి మానవాళిని విడుదల చేస్తుందనీ, కుల, మత, ప్రాంత, లింగ, వర్ణ ప్రాతిపదికలతో నిమిత్తం లేకుండా, మనుషులందరినీ, సమానపౌరులుగా తీర్చిదిద్దుతుందనీ  ఒక ఆశ కల్పించింది. కాని పందొమ్మిదో శతాబ్దినాటికే, ఆధునిక విద్యాపద్ధతులపట్ల అనుమానం మొదలై, ఇరవయ్యవ శతాబ్దం చివరికి వచ్చేటప్పటికి, అది కొందరికి అమృతాన్నీ, అత్యధికులకు విషాన్నీ పంచే మోహినీ మాయగా  బయటపడింది.  మనుషుల్ని విడదీసే రాక్షస శక్తుల్లో, అసమానతల్ని కొనసాగించేవాటిలో అన్నిటికన్నా బలమైనదిగా, 21 వ శతాబ్దం నాటికి,  ఆధునిక విద్య పూర్తిగా స్పష్టపడింది. మధ్యయుగాల్లో కులం,మతం, వర్ణం, లింగం, జాతి వంటి ప్రాతిపదికలు మనుషుల మధ్య సృష్టించిన అసమానతలకన్నా, ఆధునిక కాలంలో ఆధునిక విద్య మనుషుల మధ్య పైకెత్తిన అడ్డుగోడలు మరింత అనుల్లంఘ్యనీయాలుగా కనిపిస్తున్నాయి.

ఆధునిక విద్యలోని ఈ అమానుషత్వాన్నీ, హృదయరాహిత్యాన్నీ రూసో, టాల్ స్టాయి, థోరో, రస్కిన్ వంటి వారు పసిగట్టకపోలేదు. దాన్ని ప్రక్షాళన చేయడానికి అటువంటి వారు కొన్ని ప్రయోగాలు చేపట్టకపోలేదు. కానీ, వారందరికన్నా కూడా గాంధీజీ చేపట్టిన ప్రయోగాలు మరింత ప్రభావశీలమైనవీ, మరింత ఆచరణ సాధ్యమైనవీను.

ఆధునిక విద్యకి ఒక ప్రత్యామ్నాయాన్ని అన్వేషించవలసిన అవసరం గాంధీజీకి 1897 లోనే కలిగింది. టాల్ స్టాయి ఫారంలోనూ, ఫీనిక్సులోనూ మొదలైన ప్రయోగాల అనుభవాల మీద ఆయన 1907 లో రాసిన 'హింద్ స్వరాజ్' లో మొదటిసారిగా విద్య గురించి ఒక స్పష్టత కోసం ప్రయత్నించాడు. కేవలం విషయపరిజ్ఞానం విద్య కాదనీ, మనిషి తన ప్రవృత్తినీ, ఇంద్రియాల్నీ అదుపు చేసుకోవడమెట్లానో తెలుసుకోకపోతే ఆ విద్య నిరుపయోగమనే మెలకువ అందులో కనిపిస్తుంది. దాదాపుగా వందేళ్ళ తరువాత, 1996 లో యునెస్కో వెలువరించిన 'లెర్నింగ్: ద ట్రెజర్ విదిన్' లో ప్రపంచ విద్యావేత్తలు దీన్నే 'లెర్నింగ్ టు లివ్ టుగెదర్' అన్నారు. కేవల విషయపరిజ్ఞానం, సమాచార సంచయం మనిషిని మనిషికి చేరువగా తీసుకుపోదు. విద్య పరమార్థం సాంఘికీకరణ అని మనం నమ్మినట్లయితే, అది మనిషి తన ప్రవృత్తినీ, ఇంద్రియాల్నీ అదుపు చేసుకోవడం ద్వారానే సాధ్యపడుతుందని నేడు మనకి అర్థమవుతున్నది.

1915 లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, గాంధీజీ శిష్యబృందానికి టాగోర్ శాంతినికేతనంలో ఆశ్రయమిచ్చాడు. గాంధీజీకి శాంతినికేతన్ నచ్చిందిగాని అందులో నలుగురూ కలిసి కాయకష్టం చేసుకోవడానికి తావులేదు. అక్కడ బుద్ధికీ, హృదయానికీ విద్య ఉందిగాని, శరీరానికి లేదు. అందుకని, దేహానికీ, బుద్ధికీ, హృదయానికీ ఏకకాలంలో శిక్షణనివ్వగల ఒక సమగ్ర విద్య కోసం గాంధీజీ అన్వేషణ మొదలుపెట్టాడు. 1916-17 చంపారన్ సత్యాగ్రహకాలంలో ఆయన మనసంతా అటువంటి ఒక పాఠశాల ప్రారంభించడం మీదనే  ఉండింది. చంపారన్ రైతులకోసం తాము ఒక కమిటీ వేస్తున్నామనీ, ఇక గాంధీజీకి అక్కడ ఏమి పని ఉంటుందనీ తనని ప్రశ్నించిన బీహారు లెఫ్టినెంటు గవర్నరుతో 'చంపారన్ లో తిరిగిన తరువాతనే తన సామాజిక లక్ష్యాలు తనకి స్పష్టంగా అర్థమయ్యాయనీ, అవి ' శిక్షా, స్వాస్థ్య, సఫాయీ ' (చదువు, ఆరోగ్యం, పరిశుభ్రత) అన్నాడు ఆయన. ఇప్పుడు భారతదేశంలో సుపరిపాలన అందించాలనుకునే ఏ ప్రభుత్వానికైనా ఈ మూడే ప్రధాన ఆదర్శాలు కావడంలో ఆశ్చర్యం లేదు.

1918 నుంచి 1948 దాకా గాంధీజీని భారత జాతీయోద్యమం రాజకీయ పోరాటాల వైపు తిప్పకపోయి ఉంటే, ఆయన పూర్తికాలపు విద్యావేత్తగా ప్రయాణించి ఉండేవాడు. కాని, రాజకీయ పోరాటాల మధ్య విరామం లభించినప్పుడల్లా ఆయన విద్యాప్రయోగాలు చేపడుతూనే ఉన్నాడు. ఆ ప్రయోగాల మొదటి ముసాయిదాగా ఆయన 1937 లో ప్రకటించిన 'నయీ-తాలీం' (నవీన విద్య) ను పేర్కొనవచ్చు.

స్వాతంత్య్రం తరువాత భారతీయ విద్యావ్యవస్థ మీద నయీతాలీం ప్రభావం నెమ్మదిగా కనుమరుగవుతూ వచ్చిన మాట నిజమే గాని, ఆ స్ఫూర్తి అంతర్లీనంగా  కొనసాగుతూనే ఉందని మనం ఒప్పుకోవాలి. ఉదాహరణకి, మన రాజ్యాంగంలో, ఆదేశ సూత్రాల్లో పొందుపరిచిన ఒక ఆశయం, బాలబాలికలందరికీ పధ్నాలుగేళ్ళదాకా ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలనేదాని వెనక, గాంధీజీ ప్రతిపాదించిన ఏడేళ్ళ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనే ఆశయమే పునాది. కానీ రాజ్యాంగ రూపకర్తలు ఆ ఆశయాన్ని ఒక ప్రాథమిక హక్కుగా కాక, ఒక ఆదేశ సూత్రంగా మాత్రమే భావించారు. కాని గాంధీజీ దృష్టిలో అది ఒక హక్కు. అది చట్టబద్ధమైన హక్కుగా మారడానికి మనం 2009 దాకా ఆగవలసి వచ్చింది.

గాంధీజీ ప్రతిపాదించిన నవీన విద్యలో చాలా ప్రయోగాలకి కాలం చెల్లిపోయి ఉండవచ్చు. కాని, దాని స్ఫూర్తికి మాత్రం కాలదోషం లేదు. 'మీరు ప్రతిపాదిస్తున్న నవీన విద్యలో కొత్తదనమేమిటి' అని ఆయన్ని ప్రశ్నించినప్పుడు  1938 లో  ఆయనిలా అన్నాడు: 'నయీతాలీం నిజంగా కొత్త చదువే అయితే దానివల్ల రావలసిన ఫలితాలివీ: దానివల్ల మనల్ని ఆవరించిన నిస్పృహ పోయి, జీవితం పట్ల కొత్త ఆశ చిగురించాలి. మన పేదరికం, కరువు, కొరత తొలగిపోయి మనకి తగినంత జీవనోపాధి దొరకాలి. నిరుద్యోగం అంతరించి చేతుల్నిండా పని, పరిశ్రమ వికసించాలి. మనుషుల మధ్య ద్వేషం నశించి మైత్రి పెరగాలి. దానివల్ల మన పిల్లలకి చదవడం, రాయడంతో పాటు, అన్నం పెట్టి, ఆనందాన్నిచ్చే ఒక చేతిపరిశ్రమ కూడా అందుబాటులోకి రావాలి.'

భారతదేశం తన చరిత్రలో ఎన్నడూ చూసి ఉండని ఒక జనాబా లభ్ధి (population dividend) శకంలో నేడు పయనిస్తున్నది. 15-60 సంవత్సరాల మధ్యవయస్కులు నేడు దేశ జనాభాలో దాదాపు 63 శాతం మంది ఉండే ఈ అవకాశం మరొక ముప్పై అయిదేళ్ళ పాటు మాత్రమే ఉంటుంది. పిల్లలకి చదువుతో పాటు ఏదో ఒక వృత్తిపని నైపుణ్యాన్ని కూడా మనం అందచేసి ఉంటే, ఈపాటికి భారతీయ ఆర్థిక వ్యవస్థ కేవలం వినియోగదారుల వ్యవస్థగాకాక, ఉత్పాదకశీల వ్యవస్థగా రూపొంది ఉండేది. గాంధీజీ మాట్లాడిన మాటలకి విరుద్ధదిశగా ప్రయాణించిన దాని దుష్ఫలితాల్ని ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా పట్టణాల్లో, గ్రామాల్లో చూస్తున్నాం. కేవలం 20 శాతం మందికి మాత్రమే స్థిరమైన ఉద్యోగాల్నీ, ఉపాధినీ కల్పిస్తూ, 80 శాతం మందిని అటు బడికీ, ఇటు పనికీ కూడా పనికిరాకుండా చేసిన విద్య మనది.

మనం మన పాఠశాలలు సరిగ్గా నడిపి ఉంటే, ఈ రోజు నిరుద్యోగుల కోసం పెద్ద ఎత్తున నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం వచ్చి ఉండేది కాదు. పందొమ్మిదో శతాబ్దిలోనే, మహాత్మా జోతిబా ఫూలే వ్యవసాయ క్షేత్రాల్లోనే పాఠశాలలు నడపవలసిన అవసరం గురించి మాట్లాడేడు. మన గ్రామీణ పాఠశాలల్ని మనం వ్యవసాయక్షేత్రాలకీ, పండ్లతోటలకీ, పాడిపరిశ్రమకీ, మత్స్యరాశులకీ అనుసంధానంగా నడిపి ఉండి ఉంటే, ఈరోజు ఇంతమంది నిరర్థక అక్షరాస్యులు ఉండి ఉండేవారు కాదు. చైనా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం వెనక, ఆ దేశం మానుఫాక్చరింగ్ రంగంలో అభివృద్ధి చెందడం ముఖ్యకారణమనీ, అందుకు ఆ దేశం ప్రాథమిక విద్యమీద పెట్టిన పెట్టుబడి ప్రధానకారణమనీ అమర్త్యసేన్ వంటి వాడే చెప్తున్నాడు. కాని, మనం మన పిల్లల్ని పదోతరగతిదాకా పనికి దూరంగా పెంచి ఆ తర్వాత వాళ్ళని ఇంజనీరింగ్ చదువుల్లో చేర్పించినందువల్ల, వాళ్ళల్లో నిజంగా ఉద్యోగాలకు అర్హత పొందినవాళ్ళు నూటికి ఎనిమిది మంది కూడా లేని స్థితికి చేరుకున్నాం. ఈ విద్య కేవలం నిరుద్యోగాన్ని మాత్రమే కాదు, అరకొర చదువులు తెచ్చిపెడుతున్న అసమానతల వల్ల, ద్వేషభావాన్ని కూడా పెంపొందిస్తున్నది.

ఈ చదువుల్ని సంస్కరించాలంటే, గాంధీజీ ప్రతిపాదించిన నవీన విద్యను ఒక ఆచరణాత్మక ఉద్యమంగా మార్చుకోవడమొక్కటే మార్గం.

💥  శ్రీ వాడరేవు చిన వీరభద్రుడు* గారి గురించి... సంక్షిప్తం గా.. (కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ,ఆంధ్రప్రదేశ్)

Nai Talim and Modern Education- Mahatma Gandhi (గాంధీజీ - నయీ - తాలీం) 

1 comment:

 1. Very good essay... Inspirational and useful essay by sree China veera bhadrudu garu

  ReplyDelete

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top