జాబిల్లిపై ఏం చేస్తున్నట్లు?
విక్రమ్ కూలిందా? సాఫీగా దిగిందా?
ల్యాండర్ నుంచి నేరుగా అందని సంకేతాలు
ఆర్బిటర్‌తో కొనసాగుతున్న కమ్యూనికేషన్!
చంద్రయాన్-2 వైఫల్యం కాదు
95శాతం విజయవంతం
శాస్త్రవేత్తల వెల్లడి
జాబిల్లిపై ఏం చేస్తున్నట్లు?
చంద్రయాన్-2.. దాదాపు రెండు నెలలుగా ప్రతి భారతీయుడి మనస్సును పులకింపచేసిన మాట ఇది. జాబిల్లిపై భారత పాదముద్రను వేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు శుక్రవారం అర్ధరాత్రి చివరి క్షణాల్లో అవాంతరం తలెత్తడం యావద్దేశాన్ని నిరాశపరచింది. అప్పటివరకూ ల్యాండర్ నుంచి అందిన సంకేతాలు ఉన్నపళంగా నిలిచిపోవడంతో దాని భవితపై అయోమయం నెలకొంది. చందమామపై క్షేమంగా దిగిందా లేక కూలిపోయిందా అన్నది ఇంకా తేలలేదు. దీనిపై నిపుణుల నుంచి రకరకాల విశ్లేషణలు వినపడుతున్నాయి. ల్యాండర్ పనిచేస్తూనే ఉండొచ్చని, దాని నుంచి రానున్న రోజుల్లో సంకేతాలు వస్తాయన్న ఆశాభావాన్ని కొందరు వ్యక్తంచేస్తున్నారు. జాబిల్లి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తువరకూ సవ్యంగానే దిగిన ల్యాండర్.. విజయతీరాల వాకిట్లో మొరాయించిన సంగతి తెలిసిందే.
ఉత్కంఠ.. ఉత్సాహం.. నిరాశ
బెంగళూరులో యువ, సీనియర్ శాస్త్రవేత్తలతో నిండిన నియంత్రణ కేంద్రంలో మొదట్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ లోగా కౌంట్‌డౌన్ ప్రక్రియ పూర్తయ్యింది. ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జాబిల్లికి 35 కిలోమీటర్ల ఎత్తు నుంచి విక్రమ్ ల్యాండర్‌ను కిందకు దించే క్రమంలో తొలి అంచె అయిన ‘రఫ్ బ్రేకింగ్’ దశ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ మాయమై, హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ‘ఫైన్ బ్రేకింగ్’ దశ ఆరంభం కావడంతో శాస్త్రవేత్తలతోపాటు ప్రధాని మోదీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే పరిస్థితి మారిపోయింది. ల్యాండర్ నుంచి అకస్మాత్తుగా సంకేతాలు ఆగిపోయాయి. దీంతో నియంత్రణ కేంద్రంలో అయోమయం తలెత్తింది. అందరిలోనూ నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఇస్రో ఛైర్మన్ కె.శివన్ ఇతర శాస్త్రవేత్తలతో చర్చోపచర్చలు జరిపారు. గ్యాలరీలో కూర్చొన్న మోదీ వద్దకు శివన్ వెళ్లి, పరిస్థితి వివరించారు. ప్రధాని శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు.
13 రోజులున్నాయి
‘విక్రమ్’ ల్యాండర్, అందులోని ప్రజ్ఞాన్ రోవర్‌లు జాబిల్లి ఉపరితలంపై 14 రోజుల నిడివి ఉండే పగటి సమయంలోనే మనుగడ సాగించేలా రూపొందించారు. ఆ తర్వాత చంద్రుడిపై 14 రోజుల నిడివి ఉండే రాత్రి దశ మొదలవుతుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్ 180 డిగ్రీల వరకూ పడిపోతాయి. అంతటి శీతల వాతావరణాన్ని ల్యాండర్ తట్టుకోలేదు. చంద్రుడిపై 14 రోజుల పగటి సమయంలో ఇప్పటికే ఒక రోజు గడిచిపోయింది. అందువల్ల ల్యాండర్ పునరుద్ధరణకు ఇంకా 13 రోజుల సమయం ఉంది. అది సాఫీగా జాబిల్లిపై దిగి ఉంటే, సౌరశక్తితో బ్యాటరీలను రీఛార్జి చేసుకొని 13 రోజుల్లో భూ కేంద్రంతో సంబంధాలు ఏర్పాటు చేసుకునే అవకాశం లేకపోలేదు. చంద్రుడి ఉపరితలానికి 100 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఆర్బిటర్.. విక్రమ్ ల్యాండర్ దిగిన లేదా కూలిన ప్రదేశాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తుంది.
ల్యాండర్ పనిచేస్తోందా?
ల్యాండర్ ఏమై ఉంటుందన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ల్యాండర్‌కు జాబిల్లి కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్‌కు మధ్య ఓ విధంగా కమ్యూనికేషన్ ఇంకా కొనసాగుతూనే ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ల్యాండర్ సవ్యంగానే జాబిల్లి ఉపరితలంపై దిగి ఉండొచ్చని వారు అంటున్నారు. భూ కేంద్రాలతో నేరుగా అది కమ్యూనికేషన్ సాగించడంలేదని, అదే అసలు సమస్య అని విశ్లేషిస్తున్నారు. ల్యాండింగ్ ప్రదేశంలో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు మారితే సంకేతాలు అందుకునే అవకాశాలు లేకపోలేదన్న విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. ఆర్బిటర్ నుంచి వచ్చే సమాచారంతో ల్యాండర్ స్థితిగతులను అంచనా వేయొచ్చని వీరు ఆశాభావంలో ఉన్నారు. ఇస్రో సైతం ఇంకా ల్యాండర్ నుంచి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నామని అంటోందే తప్ప చంద్రయాన్-2 విఫలమైనట్లు మాత్రం ప్రకటించలేదు.
వేగాన్ని తగ్గించుకోలేదా?
ల్యాండర్‌తో సంబంధాలను పునరుద్ధరించుకోవడం దాదాపుగా అసాధ్యమేనని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సీనియర్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అది కూలిపోయి ఉండొచ్చంటున్నారు. రఫ్ బ్రేకింగ్ దశలో వేగాన్ని గంటకు ఆరు వేల కి.మీ.ల నుంచి 1,630 కి.మీ.లకు తగ్గించుకున్న ల్యాండర్ ఆపై వేగాన్ని అదుపుచేసుకోలేకపోయినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆపై దశలో ప్రతి పది సెకన్లకు కనీసం 50 మీటర్ల దూరాన్ని తగ్గించుకోవాల్సిన ల్యాండర్ లక్ష్యాన్ని చేరుకోలేదని శాస్త్రవేత్తలోని ఓ వర్గం అంచనా వేస్తోంది.
95% విజయవంతం.. ఆర్బిటర్ పటిష్ఠం
ల్యాండర్ మొరాయించినంత మాత్రాన చంద్రయాన్-2 విఫలమైనట్లు కాదని నిపుణులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ వ్యోమనౌకలో మొత్తం 13 పరిశోధన పరికరాలు ఉండగా.. అందులో 8 ఆర్బిటర్‌లోనే ఉన్నాయి. ల్యాండర్‌లో మూడు, రోవర్‌లో రెండు ఉన్నాయి. ఆర్బిటర్ జాబిల్లి ఉపరితలానికి దాదాపు 100 కిలోమీటర్ల ఎత్తులో విజయవంతంగా పరిభ్రమిస్తోంది. అక్కడి నుంచి అది రిమోట్ సెన్సింగ్ పరిశీలనలు, ఫొటోలు తీయడం, జాబిల్లి బాహ్య వాతావరణాన్ని పరిశీలించడం, నీరు, ఖనిజాల జాడను తెలుసుకోవడం వంటివి చేస్తుంది. అందువల్ల 95 శాతం మేర పరిశోధన వీటి ద్వారానే సాగుతుంది.
ఏడున్నరేళ్ల జీవితకాలం?
ఆర్బిటర్‌ను ఏడాదిపాటు పనిచేసేలా ఇస్రో రూపొందించింది. అయితే జులై 22న చంద్రయాన్-2 ప్రయోగ సమయంలో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 వాహకనౌక అంచనాలకు మించి పనిచేయడం బాగా కలిసొచ్చింది. అది అద్భుతంగా పనిచేయడంతో నిర్దేశిత ప్రదేశం కన్నా ఎగువ ప్రదేశంలోకి అది చేరింది. ఫలితంగా ఆర్బిటర్‌లోని ఇంధనం ఆదా అయ్యింది. దీనివల్ల ఆ వ్యోమనౌక జీవితకాలం ఏడున్నరేళ్ల వరకూ పెరగొచ్చని అంతరిక్ష నిపుణులు చెబుతున్నారు. జాబిల్లి ఉపరితలాన్ని తాకడానికి కొద్ది క్షణాల ముందు విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. అయితే దీనిపై నిరుత్సాహపడాల్సిన అవసరమేమీ లేదని పరిశోధకులు చెబుతున్నారు. చంద్రయాన్-2లోని ‘పెద్దన్న’ ఆర్బిటర్‌కు వచ్చిన ఢోకా ఏమీ లేదు. అది నిర్దేశిత రీతిలో చందమామ కక్ష్యలో తిరుగుతూనే ఉంది.
0.0006 శాతంలో తప్పిన సువర్ణాధ్యాయం
చంద్రయాన్-2 వ్యోమనౌక.. చరిత్ర సృష్టించే ఘట్టాన్ని 0.0006 శాతం తేడాతో కోల్పోయింది. సరాసరిన భూమికి చంద్రుడికి మధ్య ఉన్న 3,84,000 కిలోమీటర్ల దూరంలో 3,83,998 కిలోమీటర్ల ప్రయాణాన్ని అది విజయవంతంగానే పూర్తిచేసుకుంది.
భవిష్యత్తు ఏమిటి?
* కమ్యూనికేషన్ డేటాను ఇస్రో విశ్లేషిస్తోంది. ఒకవేళ విక్రమ్ సాఫీగానే దిగిందా లేక జాబిల్లి ఉపరితలంపై కూలిపోయిందా అన్నది పరిశీలిస్తోంది.
* ల్యాండర్‌లోని వివిధ సెన్సర్ల నుంచి చివర్లో వచ్చే డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
- ఈనాడు సౌజన్యం తో...
0 Comments:
Post a Comment