‘విక్రమ్’ ఆకృతి చెక్కుచెదరలేదు
జాబిల్లిపై ఒక పక్కకు ఒరిగి, అవిచ్ఛిన్నంగా ఉంది
ఇస్రో శాస్త్రవేత్తల వెల్లడి
కమ్యూనికేషన్ పునరుద్ధరణపై ఆశలు సజీవం
జాబిల్లి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఆచూకీ లేకుండా పోయిన విక్రమ్ ల్యాండర్‌పై ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఆ వ్యోమనౌక ఆకృతి చెక్కు చెదరకుండా ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధికారి ఒకరు చెప్పారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో నిర్దేశిత ప్రాంతానికి అత్యంత సమీపంలో హార్డ్ ల్యాండింగ్ అయ్యిందని, ఆ క్రమంలో అది ఒక పక్కకు ఒరిగిందని తెలిపారు. దాని నుంచి కమ్యూనికేషన్ సంకేతాలు మాత్రం రావడంలేదన్నారు.
భారత్ ప్రయోగించిన చంద్రయాన్-2 వ్యోమనౌకలోని ల్యాండర్ ఈ నెల 7న తెల్లవారుజామున చంద్రుడిపై కాలుమోపడానికి కొన్ని సెకన్ల ముందు ఇబ్బంది ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. జాబిల్లి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకూ సజావుగా దిగిన ఈ వ్యోమనౌకతో ఆ తర్వాత నుంచి భూ కేంద్రానికి కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. దాని ఉనికిని ఇస్రో ఇప్పటికే గుర్తించింది. ‘‘చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ అవిచ్ఛిన్నంగానే ఉంది. ముక్కలు కాలేదు. అది ఒకపక్కకు ఒరిగి ఉన్నట్లు చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని కెమెరాలు పంపిన చిత్రాలను బట్టి స్పష్టమవుతోంది’’ అని ఇస్రో అధికారి ఒకరు చెప్పారు. చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్ బలంగా ఢీ కొట్టినప్పటికీ, లక్షిత ప్రాంతానికి అది చేరువలోనే దిగిందన్నారు. దీనితో కమ్యూనికేషన్ పునరుద్ధరించుకోవడానికి ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ (ఇస్ట్రాక్) బృందం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. 14 రోజుల పాటు ఈ ప్రయత్నాలు సాగుతాయని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ సోమవారం పునరుద్ఘాటించారు.
అయితే విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించుకోవడానికి అవకాశాలు చాలా స్వల్పమని మరో శాస్త్రవేత్త పేర్కొన్నారు. ల్యాండర్‌లోని వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తుంటేనే ఇది సాధ్యమని చెప్పారు. ఆ వ్యోమనౌక జాబిల్లిపై మృదువుగా దిగి ఉంటేనే అది సాధ్యమని వివరించారు. కమ్యూనికేషన్ పునరుద్ధరణకు కొద్దిపాటి అవకాశాలు ఉన్నాయని మరో శాస్త్రవేత్త తెలిపారు. అయితే కొన్ని పరిమితులూ ఉంటాయన్నారు. గతంలో ఒకసారి భూస్థిర కక్ష్యలోని ఒక ఉపగ్రహంతో సంబంధాలు తెగిపోయినప్పుడు, ఇస్రో దాన్ని తిరిగి పునరుద్ధరించుకోగలిగిందని చెప్పారు. అయితే విక్రమ్ ల్యాండర్ పరిస్థితి అందుకు భిన్నమన్నారు. ‘‘అలాంటి వెసులుబాటు ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇప్పటికే అది చంద్రుడి ఉపరితలంపై దిగింది. దాని దిశను మార్చడం సాధ్యం కాదు’’ అని వివరించారు. వ్యోమనౌకలోని యాంటెన్నాలు ఏ దిక్కుకేసి మళ్లాయన్నది కీలకమని తెలిపారు. వాటిని భూ కేంద్రం వైపునకు కానీ జాబిల్లి కక్ష్యలోని ఆర్బిటర్ వైపునకు కానీ మళ్లించాల్సి ఉంటుందన్నారు. అది అత్యంత అసాధ్యమైన ఆపరేషన్ అని వివరించారు. ల్యాండర్‌లో విద్యుదుత్పత్తి పెద్ద సమస్య కానేకాదని పేర్కొన్నారు.
చైనా నెటిజన్ల ప్రశంస
చంద్రయాన్-2 ప్రాజెక్టులో పాలుపంచుకున్న భారత శాస్త్రవేత్తలపై చైనా నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. ల్యాండర్‌లో ఎదురైన ఇబ్బందితో ధైర్యం కోల్పోరాదని, విశ్వంలో పరిశోధనలు సాగించాలని సూచించారు. రోదసి పరిశోధనలో భారత శాస్త్రవేత్తలు గొప్ప విజయాలు సాధించారని, ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. విక్రమ్ ల్యాండర్‌లో నియంత్రణ కోసం 8 థ్రస్టర్లు మాత్రమే ఉన్నాయని, అందులోని 800 న్యూటన్ సామర్థ్యమున్న ప్రధాన ఇంజిన్లకు ఆ వ్యోమనౌకను కిందకు దించే సత్తా లేదని చైనా అంతరిక్ష నిపుణుడు పాంగ్ జిహావో చెప్పారు. ఇస్రోపై పాకిస్థాన్ తొలి మహిళా వ్యోమగామి నమీరా సలీమ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ అంతరిక్ష రంగానికి ‘చంద్రయాన్-2’ గర్వకారణమన్నారు.
🇮🇳 *ISRO -ఇస్రో శక్తి ఇదీ.. !*
ఇస్రో ఖర్చు కాదు....పెట్టుబడి..
అంతరిక్ష మార్కెట్ రేసులో ప్రధాన పోటీదారుగా అవతరణ..
Also... Read.....
0 Comments:
Post a Comment