అది ఓ రహస్య గ్రామం.. వెళ్తే ఎన్నో వింతలు?
అదో ఏటవాలు కొండ. దాన్ని ఆనుకుని ఇటుకలు పేర్చినట్టుండే నివాసాలు. ఆ మట్టి ఇళ్లను కొండ రాయికి ఎలా అతికించారో! అని ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఆఫ్రికాలోని మాలి డాగోన్ గ్రామాన్ని చూస్తే వేరే ప్రపంచంలోకి రాలేదు కదా! అనిపిస్తుంది. తేనె తుట్టెలు ఎలా కొండ వాలున ఉంటాయో అలా ఈ మట్టి ఇళ్లు దూరం నుంచి కనిపిస్తాయి. డాగోన్‌ల విలక్షణమైన ఆ గ్రామం పేరు ‘క్లిఫ్ ఆఫ్ బాండియాగారా!’ కొండచరియను ఆనుకుని ఉండే ఈ ప్రత్యేక గ్రామం ప్రపంచ వారసత్వ సంపద కూడా
సహేల్ భూముల్లో 100 మైళ్ల పొడవున ఉండే బాండియాగారా సానువులు డాగోన్‌ల మర్మ దేశం. 1500 అడుగుల ఎత్తునుండే పర్వతాలను వేరుచేసే ఈ సానువుల్లో నక్కిన బాండియాగారా కొండలపైకి వేలాది ఏళ్ల క్రితమే జనావాసాలు వచ్చాయి. కానీ, ఎవరూ కూడా పర్వత లోయలో నివసించే సాహసం చేయలేదు. 15వ శతాబ్దంలో ఆ ప్రాంతానికి వచ్చిన డాగోన్ తెగవాళ్లు అక్కడ తొలి ఇంటిని కట్టారు. దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ఈ ఇళ్ల పైకప్పులు టోపీ పెట్టినట్టు ఉంటాయి. రాతిని తొలిచి, పునాది ఏర్పాటు చేసి దాని మీద అంచెలు అంచెలుగా గ్రామాన్ని నిలబెట్టారు. టెల్లెమ్ తెగవారు ఈ మట్టి ఇళ్లను కట్టే పద్ధతిని డాగోన్‌లకు నేర్పారు. టెల్లెమ్‌లు ఇక్కడ నివసించకపోయినా వారి బంధువుల మృతదేహాలను ఈ తరహా కట్టడాల్లో సమాధి చేసేవారు. వరదల బీభత్సం ఎక్కువగా ఉండే ప్రాంతంలో పర్వత చరియ మీదే వారి పూర్వీకుల మృతదేహాలు సురక్షితంగా ఉంటాయని అలా చేసేవారు.
కానీ డాగోన్‌లు వీటిని పూర్తిగా నివాసాలకు ఉపయోగించడం మొదలెట్టారు. కుటుంబ అవసరాలకు తగ్గట్టు వాటిని మలిచారు. ఇప్పటికీ ఈ చరియల్లోని మట్టి కట్టడాల్లో టెల్లెమ్‌ల అస్థిపంజరాలు, ఎముకలు కనిపిస్తాయి. ఇసుకరాతి పర్వతం మీద నక్కి ఉండే ఈ గ్రామం కొత్తవారికి ఇట్టే తెలిసేది కాదు. దాన్ని చేరుకోవడం కూడా కష్టమయ్యేది. ఇదో రకంగా ఊరికి రక్షణనిచ్చింది. డాగోన్‌లు అందుకే అన్ని తరాలపాటు ఇక్కడ నుంచి కదల్లేదు. ఆహారాన్ని దాచుకునేందుకు, వంటసరుకు దాచుకునేందుకు, ఇలా ప్రతి అవసరానికి ఓ మట్టి ముద్ద కట్టడమయ్యేది.
అలా తెలిసింది
700 ఏళ్ల క్రితం టెల్లెమ్‌లను తరిమేశాక డాగోన్‌లు ఈ ప్రాంతాన్ని తమ సొంతం చేసుకున్నారు. ఎడారి ప్రాంతం కావడంతో వీరికి నీడనిచ్చే చోటుగా ఇదొక్కటే కనబడింది. అంతెత్తు పర్వతం అడ్డు నిలిచి, దాని చరియల కింద గూడు కట్టుకుని ఉండే డాగోన్‌లను చూస్తే... పక్షుల గూళ్లు గుర్తుకు వస్తాయి. దగ్గరలోని హంబోరీ గ్రామం పసుపు పచ్చటి మైదానంలో విసిరేసినట్టు దూరంగా కనిపిస్తుంటుంది. దీనివల్లే మిగతా ప్రపంచానికి డాగోన్‌ల గురించి 1930ల వరకు తెలియలేదు. మూడేళ్లపాటు పశ్చిమ ఆఫ్రికాను జల్లెడపట్టిన ఫ్రెంచ్ శాస్త్రవేత్త మార్సెల్ గ్రియాలెకు ఈ గ్రామం అంతుచిక్కింది. తొలిసారి ఈ గ్రామాన్ని చూసిన గ్రియాలె హతాశుడయ్యాడు. ఆ తర్వాత గ్రామంలో ప్రవేశించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అతను ఆ గ్రామంలోకి ప్రవేశించడానికి డాగోన్‌లు ఇష్టపడలేదు.
తమ పూర్వీకులు బలవంతపు మతమార్పిడులను తప్పించుకుని ఇక్కడ తలదాచుకున్నారనే విషయం వాళ్లకు తెలుసు. ఆ తర్వాత తమ సంస్కృతిని నిలబెట్టుకోవడం కోసం ఎన్ని త్యాగాలు చేశారో కూడా తెలుసు. అందుకే మార్సెల్‌ను వాళ్లు నమ్మలేదు. చివరకు ఏళ్ల వ్యవధిలో ఏడు సార్లు గ్రామంలో కలియతిరిగి ఓ అంధ డాగోన్ నుంచి ఆ గ్రామం కథ తెలుసుకున్నాడు మార్సెల్. ఒగొటెమ్మెలి అనే ఆ పెద్దాయనతో 1946లో ఇంటర్వ్యూలు తీసుకుని ఆ తర్వాత ‘కాన్వర్జేషన్స్ విత్ ఒగొటెమ్మెలి’ పేరిట ఓ పుస్తకం ప్రచురించాడు. అప్పుడే ఆ గ్రామం కథ ప్రపంచానికి తెలిసింది.
అన్నీ మట్టితో తయారైనవే!
మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతున్న డాగోన్‌ల జీవన శైలి కన్నా వారి ఇళ్ల నిర్మాణమే అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. డాగోన్‌ల గ్రామానికి మరింత ప్రత్యేకతను చేకూర్చింది బావోబాబ్ చెట్లే. వీటి ఆకారమూ విచిత్రంగానే ఉంటుంది. ఈ చెట్లు, పర్వత చరియలు ఆ గ్రామాన్ని లోకం కంటికి కనిపించకుండా చేశాయి. ఇప్పటికీ పర్యాటకులు వెళితే డాగోన్‌లు ఇబ్బందికరంగా కనిపిస్తారు. వారికి సంబంధించిన పవిత్ర కట్టడాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం ఓ కారణమైతే.. ఏది ఇల్లో, ఏది కాదో తెలీక డాగోన్‌ల కుటుంబాలకు తలనొప్పి తెప్పిస్తుంటారు సందర్శకులు. ఇప్పుడిప్పుడే పర్యాటకుల కోసం ఏర్పాట్లు పెరుగుతున్నాయి. అక్కడి డాగోన్ హోటళ్లు కూడా పూర్తిగా మట్టితో తయారైన కట్టడాలే. గదులకు కిటికీలు ఉండవు.
దాంతో కొత్తవాళ్లు తడబడతారు. భయపడతారు. యండోమా గ్రామం కూడా ఇదే తరహాలో కనిపిస్తుంది. డాగోన్‌లు తమ శైలి ఇళ్లను ఎక్కడ అనుకూలత దొరికితే అక్కడ నిర్మించారు. రెండంతస్తుల మట్టి ప్యాలెస్ ఇక్కడ ప్రత్యేకం. ప్రహేళికలాంటి గజిబిజి దారులు ఎటు వెళ్తున్నారో తెలీకుండా చేస్తుంది. ఇలా ఎన్నో వింతలతో డాగోన్‌ల రహస్య గ్రామం ‘క్లిఫ్ ఆఫ్ బాండియాగారా!’ ప్రత్యేకతను సంతరించుకుంది.
వారి సృష్టిదైవం ‘అమ్మ’
గ్రామం మధ్యలో వచ్చే హోగోన్ కట్టడం వారి గ్రామ రక్షక దేవతది. విచిత్రంగా వీరి సృష్టి దైవం పేరు కూడా ‘అమ్మ!’ ఆ దేవత కోసం గ్రామం పైభాగాన తొలిచిన భారీ రంధ్రాల్లో ఆస్ట్రిచ్ గుడ్లను నివేదిస్తారు. భర్త మరణించిన స్త్రీల కోసం గ్రామం కొసన ఓ గృహాన్ని ఏర్పాటు చేసి, ఆమె తన అక్కచెల్లెళ్లతో మూడు వారాల పాటు గడిపి పూర్తిగా కోలుకున్నాక గ్రామంలోకి తీసుకువస్తారు. ఇక పండగలకి పబ్బాలకి పర్వతం మీద ఏర్పాటు చేసుకున్న యుగా డొగొరు గ్రామం వేదిక అవుతుంది. 60 ఏళ్లకు ఓసారి జరుపుకునే ఓ భారీ పండుగ కోసం ఇది ఎదురుచూస్తుంటుంది.
0 Comments:
Post a Comment