నిగ్గు తేలని మరణం లాల్ బహదూర్ శాస్త్రి-mysteries and conspiracies surrounding the death of Lal Bahadur Shastri
లాల్ బహుదూర్ శాస్త్రి మరణం: గుండెపోటా? విషప్రయోగమా? 52 ఏళ్లయినా సమాధానం దొరకని ప్రశ్నలు..
బాల్యం నుండే నిరాడంబరతకు తోడు అభిమానవంతుడుగా ఎదిగిన వాడు. దేశ స్వాతంత్య్రం కోసం చదువును వదిలి ఉద్యమబాట నెంచుకున్నవాడు. యువకుడిగా గాంధీజీ పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉప్పు సత్యాగ్రహంతో ఉప్పెనగా లేచినవాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగమై బ్రిటీష్‌వారిని సాగనంపడంలో కీలక భూమిక పోషించినవాడు. స్వాతంత్య్రం వచ్చాక వివిధ మంత్రి పదవులతో పాటు భారత రెండవ ప్రధానిగా దేశానికి ఎనలేని సేవ చేసినవాడు. పాక్‌తో యుద్ధం సందర్భంగా జై జవాన్, జై కిసాన్ అని నినదించి దేశాన్నంతాఒక్కతాటిపైన నడిపించినవాడు. రష్యాలోని తాష్కెంట్ ఒప్పందంతో యుద్ధం ముగిసి, శాంతి నెలకొన్నప్పటికీ తాష్కెంట్‌లోనే ఆనుమానాస్పదంగా మరణించిన భారతదేశ రెండవ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జీవిత డైరీలో చివరిపేజీ ఇది. అది 1965 ఆగస్టు, పాకిస్తాన్ తన సేనలను ప్రయోగించి జమ్మూ కాశ్మీరులోని కచ్ ప్రాంతా న్ని ఆక్రమించుకుంది, తద్వారా జమ్ము కాశ్మీరులోని ప్రజలు ఉద్యమించి, భారతదేశం నుండి విడిపోతారని ఆశించింది. కానీ అటువంటి ఉద్యమం పుట్టలేదు. పాకిస్తాన్ ఆక్రమణ గురిం చి తెలుసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలు నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. భారత సైన్యం విజయదుందుభికి చేరువలో ఉండగా శాస్త్రి పై అమెరికా తీవ్ర ఒత్తిళ్లు తెచ్చింది. 1965 యుద్ధం తీవ్రస్థాయికి చేరిన సమయంలో పాకిస్థాన్-అమెరికా, భారత్ -అమెరికా మధ్య దౌత్య కార్యక్రమాలు జరిగాయి. యుద్ధంలో పాక్ ఓటమి దశకు చేరడంతో నాటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్, విదేశాంగమంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టోలను పాక్ లో అమెరికా రాయబారి వాల్టర్ ప్యాట్రిక్ మెక్కో టే కలిసి యుద్ధ విరమణకోసం చర్చలు జరిపారు. అప్పటికే భారత సేనలు పాక్ భూభాగంలోకి ప్రవేశించటంతో పాక్ పాలకులు తాము యుద్ధ బాధితులమని అమెరికాకు, ఐక్యరాజ్యసమితికి కూడా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించా రు. అయితే, పాక్ వాదనను అమెరికా కొట్టిపారేసింది. కాశ్మీర్‌లోకి తన సేనల్ని పంపి యుద్ధానికి కారణం కావటమే కాకుండా నెపాన్ని ఇతరులపై మోపుతున్నారంటూ ప్యాట్రిక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అదీకాక తాము ఇచ్చిన ఆయుధాలతో భారత్‌పై యుద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. దాంతో ప్లేటు ఫిరాయించిన పాక్ 1948లో ఐరాస తీర్మానం ప్రకారం జమ్ముకశ్మీర్‌లో ప్రజాభిప్రాయసేకరణ జరుపాలని ఐరాసను కోరింది. అదే సమయంలో నాటి భారత ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్స్‌కు లేఖ రాశారు. ఐరాస తీర్మానానికి ఏనాడో కాలం చెల్లిపోయిందని, కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశమే లేదని కరాఖండిగా చెప్పారు. బేషరతుగా కాల్పుల విరమణను పాటించేందుకు తాము సిద్ధమేనని తెలిపారు. దాంతో పాకిస్తాన్ కాల్పుల విరమణ పాటించాలని అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చింది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటించగానే ఐరాస మధ్యవర్తిత్వం మేరకు సోవియట్‌లోని తాష్కెంట్‌లో శాస్త్రి, అయుబ్ ఖాన్ మధ్య సమావేశం జరిగింది. దీన్ని అలెక్సీ కోసైజిన్ నిర్వహించాడు.
1966 జనవరి 10న శాస్త్రి, ఆయూబ్ ఖాన్ తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేసారు. 1966 జనవరి 10 రాత్రి 10 గంటలకు శాస్త్రి తాష్కెంట్‌లో తనకు కేటాయించిన కాటేజ్‌కు వచ్చారు. తన వ్యక్తిగత సిబ్బందితో మాట్లాడారు. శాస్త్రి కాటేజ్‌లో వంటమనిషికి సహాయంగా ఇద్దరు రష్యన్ మహిళలు ఉండేవారు. వారు ఆ దేశ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందినవారు. శాస్త్రికి ఆహారపదార్థాలు వడ్డించడానికి ముందు వారు వాటిని పరీక్షించేవారు. చివరకు ఆయన తాగే మంచినీటిని కూడా పరీక్షించాకే ఆయనకు ఇచ్చేవారు. జగన్నాథ్ సహాయి, శాస్త్రి సేవకుడు రామ్‌నాథ్, మరికొందరు సహాయకులు ఆయనతో వచ్చారు. పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తేనీటి విందుకు ఆహ్వానించినట్లు వారికి తెలియడంతో పాకిస్తాన్ హాని తలపెట్టే ప్రమాదముందని జాగ్రత్తగా ఉండాలని శాస్త్రికి వారు సూచించారు. అయితే, శాస్త్రి వారి ఆందోళనను కొట్టిపారేసి.. అయూబ్ ఖాన్ మంచివారని చెబుతూ రాయబారి టి.ఎన్.కౌల్ ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని తన కోసం తెమ్మని రామనాథ్‌ను పురమాయించారట. ఆ భోజనాన్ని కౌల్ వంటమనిషి జన్ మొహమ్మద్ తయారుచేశారు. శాస్త్రి చాలా కొంచెమే తిన్నారని.. తింటున్న సమయంలో ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని జగన్నాథ్ చెప్పారు. ఆ ఫోన్ ఢిల్లీలో ఉన్న శాస్త్రి మరో సహాయకుడు వెంకటరామన్ నుంచి వచ్చింది. తాష్కెంట్ ఒప్పందంపై మంచి స్పందన వచ్చిందని.. కానీ, కుటుంబసభ్యులు మాత్రం సంతోషంగా లేరని చెప్పారాయన. అంతేకాదు... ప్రజా సోషలిస్ట్ పార్టీ నేత సురేంద్ర నాథ్ ద్వివేదీ, జనసంఘ్ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా హాజీపూర్, టిత్వాల్ నుంచి సేనలను ఉపసంహరించాలన్న నిర్ణయాన్ని తప్పు పట్టినట్లుగా చెప్పారు. అయితే.. శాస్త్రి దానికి స్పందిస్తూ ఒప్పందాన్ని విమర్శించడమే ప్రతిపక్షాల పని అన్నారట. ఆ తరువాత జగన్నాథ్.. రెండు రోజులుగా మీరు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదు. ఫోన్ కలపమంటారా అని అడగ్గా తొలుత వద్దని చెప్పిన శాస్త్రి ఆ వెంటనే మనసు మార్చుకుని ఫోన్ చేయమని చెప్పారు. అప్పుడు తాష్కెంట్లో సమయం దాదాపు 11 గంటలైంది.(దిల్లీలో సుమారు 11.30 గంటలు). మొదట ఆయన అల్లుడు వి.ఎన్.సింగ్ మాట్లాడిన తరువాత పెద్ద కుమార్తె కుసుముకు (వి.ఎన్. సింగు కు వదిన) ఫోన్ ఇచ్చారు. తాష్కెంట్ ఒప్పందంపై ఆయన ఆమె అభిప్రాయాన్ని కోరగా ఆమె తనకు నచ్చలేదని చెప్పారు. ఆ తరువాత భార్య లలితా శాస్త్రితోనూ ఆయన మాట్లాడారు.ఆ సంభాషణలు శాస్త్రిని అసంతృప్తికి గురిచేశాయని జగన్నాథ్ సహాయి చెప్పారు. ఫోన్‌లో మాట్లాడిన తరువాత ఆయన గదిలోనే అటూఇటూ పచార్లు చేశారని.. ఢిల్లీలో ఇంటికి వచ్చినవారితో మాట్లాడాక కూడా ఆయన ఇలాగే అటూఇటూ నడుస్తారని జగన్నాథ్ చెప్పారు. అప్పటికే రెండుసార్లు హార్ట్ అటాక్ వచ్చిన ఆయనపై ఆ సంభాషణ, పత్రికల్లో వస్తున్న విమర్శలు ఒత్తిడికి గురిచేసి ఉండొచ్చు. అనంతరం రామానాథ్ పాలు తెచ్చి ఇచ్చారు. తాను అక్కడే నేలపై పడుకుంటానని రామ్‌నాథ్ చెప్పినప్పటికీ వద్దు నీ గదికి వెళ్లి పడుకోమని శాస్త్రి చెప్పడంతో ఆయన పైనున్న తన గదికి వెళ్లిపోయారు.ఉదయాన్నే కాబూల్ వెళ్లాల్సి ఉండడంతో సామాన్లు సర్దుకుంటుండగా రాత్రి 1.20 గంటల సమయంలో శాస్త్రి తమ గది తలుపు కొట్టారని జగన్నాథ్ గుర్తు చేసుకున్నారు. రాగానే డాక్టర్ ఎక్కడున్నారని అడిగారని.. తీవ్రమైన దగ్గుతో మెలికలు తిరిగిపోతుండడంతో ఆయన గదికి తీసుకెళ్లి పడుకోబెట్టి మంచి నీళ్లు ఇచ్చినట్లు జగన్నాథ్ చెప్పారు. ఆ వెంటనే శాస్త్రి ఛాతీపై చేయి పెట్టుకుని అచేతన స్థితిలోకి వెళ్లిపోయారని జగన్నాథ్ గుర్తు చేసుకున్నారు. అంతలో ఆయన వ్యక్తిగత వైద్యుడు చుగ్ వచ్చి శాస్త్రి నాడి పట్టుకుని చూసి బాబూజీ! మీరు నాకు ఏమాత్రం సమయం ఇవ్వలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చేతికి ఒక ఇంజక్షన్ ఇచ్చి ఆ తరువాత ఛాతీకి మరో ఇంజక్షన్ ఇచ్చినా ఎలాంటి స్పందనా లేకపోవడంతో చివరి ప్రయత్నంగా నోటి ద్వారా శ్వాస అందించే ప్రయత్నమూ చేశారు. అవేమీ ఫలితమివ్వకపోవడంతో ఇంకా వైద్యులను పిలిపించాలని జగన్నాథ్‌కు ఆయన సూచించారు. కొద్ది నిమిషాల్లోనే వైద్య బృందం వచ్చి అప్పటికే శాస్త్రి మరణించినట్లు నిర్ధారించింది. తాష్కెంట్ సమయం ప్రకారం 1.32గంటలకు (ఢిల్ల్లిసమయం 2.00 గంటలు) ఆయన మరణించినట్లుగా ప్రకటించారు. శాస్త్రి ఉన్న విశాలమైన గదిలోని మంచంపై ఆయన అచేతనంగా పడి ఉన్నారు. ఆ పక్కనే ఉన్న టేబుల్‌పై థర్మాస్ ప్లాస్క్ పడిపోయి కనిపించింది. ఆయన దాన్ని తెరవడానికి ఎంతో ప్రయత్నించినట్లుగా అనిపించింది. సహాయకులను పిలవడానికి వీలుగా గదిలో బజర్ వంటిదేమీ లేదు. అక్కడికి చేరుకున్న అందరూ పక్కనే టేబుల్‌పై శుభ్రంగా మడతపెట్టి ఉన్న భారత జాతీయ పతాకాన్ని ఆయనపై కప్పి అక్కడున్న పుష్పాలను ఆయనపై ఉంచి నివాళులర్పించారు. వేకువన 4 గంటలకు పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్ వచ్చి భారత్-పాక్ మధ్య శాంతి కోసం ఈ మనిషి ప్రాణాలర్పించారు అన్నారు. ఆ తరువాత ఆయన పాక్ పాత్రికేయులతో మాట్లాడుతూ.. శాస్త్రి బతికుంటే రెండు దేశాల మధ్య సమస్యలు పరిష్కారమయ్యేవి అని చెప్పారు. ఇప్పటికీ అనుమానమే లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి తన తండ్రి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. తన తండ్రి మృతికి సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేయాలని ఆయన 2015లో ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరారు. సీఎన్‌ఎన్ ఐబీఎన్ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్.. తన తండ్రి మృతిపై అనేక అనుమానాలు లేవనెత్తారు.నాన్న మృతదేహం దిల్లీ విమానాశ్రయానికి వచ్చినప్పుడు చూస్తే ఆయన శరీరం నీలిరంగులో కనిపించింది. ముఖంపై తెల్లమచ్చలు కనిపించాయి. ఉజ్బెకిస్తాన్‌లో భారత్ ప్రధాని ఉండే రూంలో కాలింగ్‌బెల్ కూడా ఉండదా, ఫోన్ ఉండదా, కనీసం చూసుకునే వారు కూడా ఉండరా? నమ్మశక్యంగా లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. భారత దౌత్య కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన తండ్రి మరణించారంటూ అనిల్ ఆరోపించారు.షిప్పింగ్ వ్యాపారి ధరమ్ తేజ్ కుంభకోణం గురించి నాన్నకు తెలుసు. శాస్త్రి చనిపోయన సమయంలో ధరమ్ తేజ్ కూడా తాష్కెంట్లోనే ఉన్నారని కుశ్వంత్ సింగ్ కథనం రాశారని ఆయన పేర్కొన్నారు.మృతదేహం ఢిల్లీకి వచ్చినప్పుడు చూస్తే ఆయన నోరు, ముక్కు నుంచి రక్తం కారడం కనిపించింది. ఆయన ఒంటిపై గాట్లు ఉన్నాయి. అమ్మమ్మ నెయ్యిలో ఆయన చేతులను ముంచింది. పెదాలకు నెయ్యి పూసింది. అప్పుడు నెయ్యి నీలిరంగులో కనిపించింది. ఆయన వ్యక్తిగత డైరీ, ఆయన రోజువారి కార్యక్రమాలను రాసుకొనే యాక్షన్ ప్లాన్ పుస్తకం కనిపించలేదు అని మనవడు సంజయ్ తెలిపారు. శాస్త్రి మరణంపై విచారణ జరిపించాలంటూ 1970లో ఆయన జయంతి రోజున(అక్టోబర్ 2) లలితా శాస్త్రి కోరారు. ఎమర్జెన్సీ తరువాత జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాస్త్రి మరణంపై దర్యాప్తు కోసం రాజ్‌నాథ్ కమిటీని నియమించారు. ఈ కమిటీ ముందు వివరాలు చెప్పడానికి వస్తుండగానే శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు చుగ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా... వ్యక్తిగత సహాయకుడు రామ్‌నాథ్ కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గతం మర్చిపోయారు.(అయితే... కమిటీ ఎదుట హాజరవడానికి ముందు రామ్‌నాథ్ శాస్త్రి సతీమణిని కలిశారు. చాలా రోజులుగా మనసులో ఈ భారమంతా మోస్తున్నాను. ఈ రోజు మొత్తం చెప్పేస్తాను అని చెప్పారని కుటుంబీకులు వెల్లడించారు.)కమిటీ నివేదిక ఇవ్వనప్పటికీ దర్యాప్తు ప్రక్రియ ప్రారంభించింది. కానీ, దీనికి సంబంధించి పార్లమెంటు లైబ్రరీలో ఎలాంటి పత్రాలు లేవు. శాస్త్రి మరణం నాటికే భారత్, సోవియట్ల మధ్య విస్తృతమైన మైత్రిబంధముంది. దీంతో మరణం వెనుక సోవియట్ హస్తాన్ని ఎవరూ సందేహించలేదు. ఆ తర్వాత మాత్రం ప్రభుత్వం ఆయన హార్ట్‌ఎటాక్ వల్లే చనిపోయారని నిర్ధారించింది. నాటి యుద్ధంలో పాక్ ఓటమిదశకు చేరుకుంది. నిబంధనలు అడ్డురావడంతో ప్రత్యక్షంగా సాయం చేయకపోయినా అమెరికా పరోక్షంగా పాక్‌కు అండగా నిల్చింది. ఈ కారణంగా సిఐఎ ప్రమేయాన్ని కూడా తక్కువగా అంచనావేయలేం. పైగా ఆ సమయంలో సిఐఎ (సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ) లో డైరెక్టర్ ఆఫ్ ప్లాన్స్‌గా ఉన్న రోబర్డ్ క్రోలీ అమెరికాకు చెందిన గ్రెగరీడగ్లస్ అనే జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇస్తూ శాస్త్రితో పాటు భారత అణు పితామహుడు డాక్టర్ హోమీబాబా మరణాలకు సిఐఎ ప్రణాళికలు రచించి అమలు చేసిందని వెల్లడించారు. అయితే తన మరణానంతరమే ఈ ఇంటర్వ్యూను ప్రచురించాలని ఆయన డగ్లస్‌ను కోరారు. శాస్త్రి, హోమీబాబా మరణాలు ఒకే నెలలో జరిగాయి. రెండింటికీ మధ్య రెండు వారాల వ్యవధే ఉంది. పైగా ఈ రెండు దేశానికి వెలుపలే చోటు చేసుకున్నాయి. శాస్త్రి మరణంలో హృద్రోగాన్ని సాకుగా చూపితే బాబా మరణానికి పైలెట్ తప్పిదాన్ని కారణంగా ప్రచారం చేశారు. 60వ దశకంలో అమెరికాకు సహకరించని వివిధ దేశాల నేతల్ని హతమార్చడం సిఐఎ పనిగా పెట్టుకుందని ఆరోపణలున్నాయి.
0 Comments:
Post a Comment