ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న విద్యుత్ పరికరాలను చూడండి. ఎయిర్ కండిషనర్, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, టీవీ, కంప్యూటర్... ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయంటే దానికి కారణం ఆల్టర్నేటింగ్ కరెంట్ (ఏసీ) వినియోగమే. దానిని ఆవిష్కరించి మనం ఇప్పుడు పొందుతున్న సౌకర్యాలకు దారి చూపి 'ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ'గా పేరొందిన శాస్త్రవేత్తే మైకేల్ ఫారడే. విద్యుదయస్కాంత, విద్యుత్‌రసాయనిక రంగాల్లో కూడా ఆయన కృషి మరువలేనిది. 'అప్పటికి నోబెల్ లేదు కానీ, ఉండి ఉంటే కనీసం ఆరు వచ్చేవి' అని శాస్త్రవేత్తలే కొనియాడే వ్యక్తిగా పేరుతెచ్చుకున్నాడు.
లండన్ దగ్గర ఉండే ఒక చిన్న పల్లెటూరిలో పేద కుటుంబంలో 22, సెప్టెంబరు 1791న ఓ బాలుడు జన్మించాడు. కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు. కానీ ఈ పిల్లాడు చిన్నతనంలో చదవడం, రాయడం నేర్చుకున్నాక పేదరికం వల్ల ఆ తర్వాత స్కూలుకు వెళ్లలేకపోయాడు. కానీ ఆ పిల్లాడికి చదువంటే చాలా ఇష్టం. అందుకనే అతడు ఏరి కోరి పేపర్ బాయ్ పనికి కుదిరాడు. కారణం ఒక ఇంట్లో పేపర్ వేసి మరో ఇంట్లోకి వేసే అతి కొద్దికాలంలో పేపర్లలోని విషయాలను చదవడానికి వీలు దొరకడం. ఆ తర్వాత పుస్తకాలు బైండింగ్ చేసే షాపులో చేరాడు. ఎందుకంటే, బైండింగ్‌కు వచ్చే పుస్తకాలు విలువైనవనీ, విజ్ఞానంతో నిండి ఉంటాయనే, వాటిని కొనకుండానే చదవచ్చనే ఉద్దేశంతో. సైన్స్‌కు సంబంధించిన గ్రంథాలను ఇంటి దగ్గర బైండ్ చేస్తాననే నెపంతో వాటిని ఇంటికి తీసుకెళ్లేవాడు. రాత్రంతా మేల్కొని కొవ్వొత్తి వెలుగులో వాటిని చదివేవాడు.
శాస్త్రజ్ఞులు విద్యుత్ కెపాసిటర్ యూనిట్‌కి ఫారడే అని నామకరణం చేసి మైకేల్ ఫారడే పేరును శాశ్వతం చేశారు.
ఆవిధంగా పదమూడు ఏళ్ల వయస్సుకే ఆ బాలుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. అంత చిన్న వయసులోనే ‘ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా’ సంపుటాలను ‘కాన్వర్సేషన్స్ ఆన్ కెమిస్ట్రీ’ లాంటి పెద్ద పెద్ద గ్రంథాలను చదివేశాడు.
ఆ రోజుల్లో గొప్ప శాస్త్రవేత్తగా పేరుపొందిన సర్ హంఫ్రీడేవీ ఓసారి లండన్‌లో ఉపన్యాసాలు ఇస్తే ఆ పిల్లాడు ఆ సమావేశాలకు హాజరయ్యాడు. ఆ ఉపన్యాసాలను శ్రద్ధగా విన్నాడు. వాటిని తన చేతిరాతతో అందంగా రాసి వాటిలోని విషయాలకు సంబంధించిన చిత్రాలను వేసి చక్కగా బైండ్ చేసి హంఫ్రీడేవీ చిరునామాకు పంపాడు. హంఫ్రీడేవీకి తన ఉపన్యాసాలు వినడానికి ఆసక్తిగా ఉంటాయని తెలుసుకానీ, అంత అందంగా ఉంటాయని తెలియదు. దాంతో ఆశ్చర్యపోయిన ఆయన తన ఉపన్యాసాలను అంత ఓపికగా, శ్రద్ధగా రాసిన వారు ఎవరో శాస్త్రవేత్త కావచ్చుననుకొన్నారు.
తీరా పిలిపించి చూస్తే చిన్న పిల్లాడు. అంతగా చదువులేకపోయినా అతనికి సైన్స్ పట్ల ఉన్న ఆసక్తిని, ఉత్సాహాన్ని చూసి తన ప్రయోగశాలలో అటెండర్‌గా చేర్చుకున్నారు. రోజూ ల్యాబ్‌ను తుడిచి, కూజాలో నీళ్లు పెట్టి, డేవీ ఉపన్యాసాలిచ్చేటప్పుడు ప్రయోగాలకు సంబంధించిన పరికరాలను అమర్చడం ఆ పిల్లాడి పని. ఈ పనులతో పాటు చిన్న చిన్న ప్రయోగాలు చేసేవాడు. చివరకు రసాయన శాస్త్రం, మెటలర్జీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఎలక్ట్రాలసిస్‌లో ప్రపంచాన్నే అబ్బురపరచే ప్రయోగాలను అతడు చేశాడు.
![]() |
The papers include laboratory notebooks, lecture notes and various publications, some administrative papers on the Royal Institution of Great Britain |
ఆ పిల్లాడు ఎవరో కాదు. అయస్కాంత శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చవచ్చని నిరూపించిన శాస్త్రవేత్త. ఇప్పుడు మనం నిత్యం వాడుతున్న ఆల్టర్‌నేటింగ్ కరెంట్, ఎలక్ట్రిక్ జనరేటర్, డైనమోల తయారీకి కారకుడై శాస్త్రలోకంలో Father of electricity గా పేరు పొందిన ‘మైకేల్ ఫారడే’. ఆ రోజుల్లో నోబెల్ బహుమానం లేదు కానీ ఉంటే ఆ మహనీయునికి కనీసం అరడజను నోబెల్స్ వచ్చి ఉండేవని శాస్త్రజ్ఞులు అంటారు.
ఓసారి హంఫ్రీడేవీని ఎవరో ‘మీరు కనిపెట్టింది గనుల్లో వాడే డేవీ సేప్టీలాంప్ ఒకటే కదా. మరి మీ శిష్యుడు ఫారడే ఎన్నో కనిపెట్టాడే’ అని ఎద్దేవా చేస్తే దానికి ఆయన ఒక చిరునవ్వు నవ్వి ‘నేను కనిపెట్టిన అద్భుత విషయం మైకేల్ ఫారడే’ అని అన్నారట.
చూశారా! స్కూలుకు, కాలేజీకి వెళ్లి చదువుకోకపోయినా, సొంతంగా పుస్తకాలు చదువుకోవడం వల్ల ఫారడే ఎంతో గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. భౌతిక శాస్త్రాన్నే ఒక మలుపు తిప్పాడు!
- ప్రొ।। ఈవీ సుబ్బారావు, హైదరాబాద్
0 Comments:
Post a Comment