2018-డీఎస్సీకి మోక్షం
నెలాఖరులో నియామకాలకు కసరత్తు
కోర్టు కేసులతో మిగిలిన పోస్టుల భర్తీ ఆలస్యం
స్పెషల్ డీఎస్సీ నియామకాలపైనా వివాదాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లకు సుమారు 3 వేల మంది కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారు. వీరిలో స్కూల్ అసిస్టెంట్లు(తెలుగు, హిందీ మినహా), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ), ప్రిన్సిపాళ్లు, ఎస్‌జీటీలు ఉన్నారు. ఈ నెలాఖరులోగా ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందనున్నాయి. డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌కు సంబంధించి తొలివిడతలో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 7,902 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగా వేర్వేరు విభాగాల పోస్టులకు రాత పరీక్షలను నిర్వహించారు.
అయితే, విద్యార్హతలు, సర్వీసుపరమైన అంశాలకు సంబంధించి న్యాయపరమైన సమస్యలు రిక్రూట్‌మెంట్‌కు ప్రతిబంధకంగా మారాయి. ఒక వైపు ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలు, మరో వైపు నిరుద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో కోర్టు కేసులు లేని విభాగాలకు చెందిన 2,882 టీచర్ పోస్టులను తొలివిడతలో భర్తీచేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించుకుంది. ప్రొవిజినల్ మెరిట్ లిస్టుల నుంచి ఇప్పటి వరకు దాదాపు 1900 మంది అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది. సదరు జాబితాలోని మిగిలిన అభ్యర్థులను వేర్వేరు కారణాలతో తిరస్కరించారు. దీంతో ఆయా అభ్యర్థుల స్థానంలో ప్రొవిజినల్ మెరిట్ లిస్టులో ఉన్న తదుపరి అభ్యర్థులను మరో రెండు రోజుల్లో వెరిఫికేషన్‌కు పిలవనున్నారు. ఈ ప్రక్రియ కూడా పూర్తికాగానే తొలివిడతలో సుమారు 3 వేల మంది అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమించాలని పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
కేసులతో పెండింగ్
డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌కు సంబంధించి మిగిలిన 5 వేల టీచర్ పోస్టుల భర్తీపై, ప్రత్యేక డీఎస్సీ ద్వారా 602 ఖాళీల భర్తీకి గత ఏడాది ఇచ్చిన నోటిఫికేషన్‌పై పలు కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఫలితంగా వాటి నియామకాలు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వీటిలో ప్రధానంగా సెకండరీ గ్రేడ్ టీచర్(తెలుగు) పోస్టులు ఉన్నాయి. వేలాది మంది నిరుద్యోగులు ఎస్‌జీటీ(తెలుగు) ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించి నియామకాలు పూర్తి చేయాలని వారు విద్యాశాఖాధికారులను కోరుతున్నారు
0 Comments:
Post a Comment