అక్కడ చదువు చెప్పాలంటే..గుర్రం ఎక్కాల్సిందే!మగధీర.. ఈ చిత్రం పేరువింటే చాలు గుర్రంపై వేగంగా స్వారీ చేసే ఆ సినిమాలోని కథానాయకుడు గుర్తొస్తాడు. కానీ విశాఖ మన్యం తూర్పు కనుమల కొండ ప్రాంతాల్లోనూ ఓ ఉపాధ్యాయధీరుడు ఉన్నాడు. అతనే పాడేరు ఏజెన్సీలోని గెమ్మెలి పంచాయతీ సుర్లపాలెం ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే వెంకటరమణ అనే టీచర్. కష్టపడి గుర్రపు స్వారీ నేర్చుకొని.. తాను విధులు నిర్వర్తించే పాఠశాలకు వెళ్తూ.. పాఠాలు బోధిస్తున్నాడు.విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ జి. మాడుగల మండలం పరిధిలోని మారుమూల గెమ్మెలి పంచాయతీ సుర్లపాలెం ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ విధులు నిర్వర్తించాలంటే దాదాపు ఐదు కిలోమీటర్లు నడవాల్సిందే. ఇదే పాఠశాలలో వెంకటరమణ అనే ఉపాధ్యాయుడు విధులు నిర్వర్తిస్తున్నాడు.
యువకుడు కావడంతో కొత్త ఉత్సాహంతో పిల్లలకు పాఠాలు చెబుతుండడం చూసి సంతోషించారు. వాతావరణం ఎలా ఉన్నా వెంకటరమణ నిత్యం హాజరు అవుతుంటాడు. అయితే, వెంకటరమణ సుర్లపాలెం గ్రామానికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడడం గమనించి గ్రామస్తులందరూ కలిసి అతడికి ఓ గుర్రాన్ని కొనిచ్చారు. ఆ గుర్రం ఖరీదు రూ.9000. ఇప్పుడా గుర్రం మీదే వెంకటరమణ నిత్యం పాఠశాలకు రాకపోకలు సాగిస్తుంటాడు.
మొదట్లో గుర్రపుస్వారీ తెలియకపోవడంతో కొంత అవస్థ పడినా, ఆ తర్వాత నిదానంగా అలవాటు చేసుకున్నాడు. ఇక దాని పోషణ విషయానికొస్తే గ్రామస్తులే చూసుకుంటున్నారు. వెంకటరమణ పాడేరులో నివాసం ఉంటాడు. ప్రతిరోజు గెమ్మల వరకు బైక్ పై వస్తాడు. అప్పటికే అక్కడ గిరిజనులు గుర్రంతో సిద్ధంగా ఉంటారు. రోజూ సుర్లపాలెం నుంచి గెమ్మల వెళ్లే ఎవరో ఒకరు ఆ గుర్రాన్ని తమతో తీసుకెళ్లి ఉపాధ్యాయుడు వచ్చే సరికి సిద్ధంగా ఉంచుతారు. ఆ గుర్రాన్ని ఎక్కి వెంకటరమణ పాఠశాల చేరుకుంటారు. తిరిగి ఆ గుర్రంపై గెమ్మల వరకు వెళతారు. అక్కడ సుర్లపాలెం గ్రామస్తులెవరైనా ఉంటే ఆ గుర్రాన్ని మళ్లీ గ్రామానికి తీసుకువస్తారు.
ఇది ఎంతో ప్రయాసభరితమైన తంతు అయినా, తమ బిడ్డల చదువు కోసం గ్రామస్తులకు తిప్పలు తప్పడంలేదు. ఈ దుస్థితిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు మార్గం వేయాలని ఉపాధ్యాయుడు వెంకటరమణ కోరుతున్నాడు.
ప్రతిరోజు ఇలా సాహసం చేస్తూ విధులు నిర్వర్తించేందుకు వస్తున్నప్పటికీ ఆ పాఠశాలకు శాశ్వత భవనమంటూ లేదు. చుట్టుపక్కల పల్లెల నుంచి సుమారు 55 మంది వరకు విద్యార్థులు చదువుకునేందుకు వస్తుంటారు. శాశ్వత భవనంతో పాటు కనీస మౌలిక వసతులు లేకపోవటంతో చాలా మంది విద్యార్థులు బడికి రావటం మానేస్తున్నారు. ఎంతో నిబద్ధతతో ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తించే టీచర్ ఉన్న ఈ పాఠశాలను అభివృద్ధిని చేయాలని స్థానికులు కూడా కోరుతున్నారు.అన్ని రకాల సౌకర్యాలు ఉండి విధులు నిర్వర్తించేందుకు వెళ్లేందుకు ఇబ్బందిపడే ఈ రోజుల్లో గుర్రంపై వెళ్తూ ఉపాధ్యాయ విధులను నిర్వర్తిస్తున్న వెంకటరమణను గ్రామస్థులు అభినందిస్తున్నారు. విశాఖ మన్యం లాంటి ప్రాంతాల్లో విధులు అంటేనే వెనకడగు వేసే పరిస్థితుల్లో వృతిపై ఉన్న ప్రేమతో, నిబద్ధతో విధులు నిర్వర్తిస్తున్న వెంకటరమణలాంటి ఉపాధ్యాయుడు నిజంగా ఎంతోమందికి ఆదర్శనీయం.
కింది వీడియో చూడగలరు...
🥦 *కొటారి వలసయ్య - ఓ మన్యం ఉపాధ్యాయుడు.... స్పెషల్ స్టోరీ....ఆ ఉపాధ్యాయుడు పలువురికి ఆదర్శం
0 Comments:
Post a Comment