ఇక పెట్రోల్ కూడా డోర్ డెలివరీ?
ముంబయి: ఇప్పటి వరకు డీజిల్‌ను మాత్రమే డోర్ డెలివరీ ద్వారా అందిస్తున్న ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఇక నుంచి పెట్రోల్‌కి సైతం ఆ సదుపాయాన్ని విస్తరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రయోగాత్మకంగా కొన్ని నగరాల్లో మాత్రమే చేస్తున్న డీజిల్ డోర్ డెలివరీని మరో 20 నగరాలకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలైన హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ సేవల్ని అందిస్తున్నాయి. ‘‘ఇంధన డోర్ డెలివరీ సేవలకు మంచి స్పందన వస్తోంది. పటిష్ఠ భద్రతాపరమైన చర్యలతో ఈ సేవల్ని మరింత విస్తరించాలని భావిస్తున్నాం’’ అని హెచ్‌పీసీఎల్ ఛైర్మన్ ఎం.కె.సురానా గత వారం జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. ప్రస్తుతం డీజిల్ డోర్ డెలివరీకి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ.. పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) త్వరలో పెట్రోల్‌కి కూడా అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ప్రస్తుతం 35 నగరాల్లో డీజిల్ డోర్ డెలివరీ సౌకర్యం ఉంది. అందులో ఐఓసీ 15, బీపీసీఎల్ 13, హెచ్‌పీసీఎల్ 7 నగరాల్లో సేవల్ని అందిస్తోంది. తాజాగా మరో 500 డోర్ డెలివరీ వాహనాల్ని కొనుగోలు చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. భారీ పరిమాణంలో కొనే వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈ సేవల్ని ప్రారంభించారు. అయితే ఒకేసారి 2000లీటర్లకు మించి ఇంధనాన్ని కొనాలంటే పెసో అనుమతి తప్పనిసరి. తాజాగా ఐఓసీకి 4, బీపీసీఎల్‌కి 10, హెచ్‌పీసీఎల్‌కి 6 నగరాల్లో కొత్తగా అనునుమతులు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ముంబయి లాంటి మహానగరాల్లో నెలకి దాదాపు 150కిలో లీటర్ల డీజిల్ డోర్ డెలివరీ అవుతున్నట్లు అంచనా.
0 Comments:
Post a Comment