- విద్యాశాఖ కసరత్తు
- 7న మంత్రి సమీక్ష
- 15 అంశాలపై దృష్టి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
అమ్మఒడి లబ్దిదారుల ఎంపికకు ప్రాతిపదికలు రూపొందించడంపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అమ్మఒడితో పాటు మరో 15 అంశాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ నెల 7న ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రతి ఏటా రూ.15 వేల మొత్తాన్ని అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు మొత్తం 43 లక్షల మందికి అందజేస్తామని పేర్కొంది. అయితే ఈ పథకానికి లబ్దిదారులను ఎలా ఎంపిక చేస్తారో అనే అంశంపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అమ్మఒడి లబ్దిదారుల ఎంపిక ప్రాతిపదికలపైనే సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చించేవీలుంది. ఈ మేరకు అధికారులు కూడా సూచనలు చేయాలని విద్యాశాఖ కోరింది. టిడిపి ప్రభుత్వ హయాంలో మూత పడ్డ పాఠశాలలను తిరిగి ప్రారంభించే అంశంపైనా చర్చించనున్నారు. గత ప్రభుత్వ హాయాంలో రాష్ట్రవ్యాప్తంగా 826 పాఠశాలలు మూత పడినట్లు విద్యాశాఖ మంత్రి అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. 2019-20 విద్యా సంవత్సరానికి పాఠశాలల్లో సమాంతరంగా ఇంగ్లీష్ మీడియం అమలు చేసే అంశంపైనా చర్చించనున్నారు. వీటితో పాటు మధ్యాహ్నభోజనంలోని కేంద్రీకృత వంటశాలలు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, సివిల్ పనులు, డిఎస్‌సి-2018, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు, చైల్డ్ ఇన్‌ఫో, ఎన్‌రోల్‌మెంట్ స్టేటస్, పుస్తకాలు, యునిఫారం సరఫరా, ఉపాధ్యాయుల పని సర్దుబాటు, ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు, ఒక బ్రాంచ్ కంటే ఎక్కువ బ్రాంచులు నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలల వివరాలు, పాఠశాల సమర్ధత, మోడల్ పాఠశాలల పనితీరు తదితర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. విజయవాడలో జరిగే ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ఆర్‌జెడి, డిఇవో, సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారులు పాల్గొననున్నారు.
మూలం : ప్రజాశక్తి సౌజన్యం తో...
0 Comments:
Post a Comment