వేళలను బట్టి విద్యుత్తు ఛార్జీలు
డిమాండ్‌కు తగ్గట్లు మార్పులు
ఎండాకాలంలో ఒకలా, చలికాలంలో మరోలా
సిద్ధమవుతున్న జాతీయ టారిఫ్ విధానం
మీరు ఏ సమయంలో ఎక్కువ విద్యుత్తు వాడుతున్నారు? పగటివేళా..రాత్రి వేళా? మీకు భవిష్యత్తులో విద్యుత్తు బిల్లు పంపేప్పుడు ఇలాంటివి అన్నీ గమనంలోకి తీసుకుంటారు. ఉదయం వేళ విద్యుత్తు వినియోగించుకుంటే ఒక ధర..రాత్రివేళైతే మరో ధర ఉంటుంది. కేంద్ర విద్యుత్తు శాఖ రూపొందిస్తున్న కొత్త టారిఫ్ విధానం అమలులోకి వస్తే బిల్లులు వేసేప్పుడు ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటారు.
జాతీయస్థాయిలో విద్యుత్తు ఛార్జీల నిర్ణయ విధానాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. రాష్ట్రాలకు ఇది మార్గదర్శకంగా కూడా ఉండాలని భావిస్తోంది. కేంద్ర విద్యుత్తుశాఖ సిద్ధం చేస్తున్న ప్రతిపాదనల మేరకు వినియోగదారుల నిర్దిష్ట అవసరాలు, విద్యుత్తుకు ఉన్న గిరాకీ, సరఫరాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఛార్జీలను నిర్ణయిస్తారు. ఇందుకోసం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా ఏ సమయంలో విద్యుత్తు వాడుతున్నారన్నది లెక్కలోకి తీసుకుంటారు. ఎండాకాలంలో అయితే ఒకలా, వర్షాకాలంలో అయితే మరోలా, చలికాలంలో అయితే ఇంకోలా రుసుములు నిర్ణయించే అవకాశం ఉంది.
డిస్కంల ఆధ్వర్యంలోనే సౌర విద్యుత్తు ఉత్పత్తి ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. వేసవిలో మధ్యాహ్న వేళల్లో సౌర విద్యుత్తు ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ సమయంలో సౌర విద్యుత్తు ఛార్జీలు కూడా తక్కువగా ఉండొచ్చు. అదే శీతాకాలంలో సౌర విద్యుత్తు ఉత్పత్తి తక్కువగా ఉంటుది కాబట్టి అప్పుడు రుసుములు ఎక్కువగా ఉండొచ్చు. ‘ప్రస్తుతం విద్యుత్తు ఛార్జీలను నిర్ణయించేటప్పుడు పంపిణీ సంస్థలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వినియోగదారుల అవసరాలను విస్మరిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం జాతీయ విద్యుత్తు ఛార్జీల విధానాన్ని రూపొందించే క్రమంలో వినియోగదారుల నిర్దిష్ట అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని యోచిస్తోంది’ అని ఒక అధికారి చెప్పారు. విద్యుత్తు వినియోగంపై కచ్చితమైన అవగాహన కోసం ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ మీటర్ ఏర్పాటును తప్పని సరి చేసేలా కూడా కొత్త విధానం ఉంటుంది. ఈ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదానికి సమర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రం ఆమోదించిన తరవాత ఈ విధానం అమలుకు రాష్ట్రాలను కూడా ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని అధికారి ఒకరు వివరించారు.
Source : Eenadu News
0 Comments:
Post a Comment