Bathini Mogilaiah Goud: a forgotten warrior in the history of Warangal (1918 జనవరి 2 - -11 ఆగష్టు, 1946 )--చరిత్ర మరిచిన ఓరుగల్లు అభిమన్యుడు - చరిత్ర కెక్కని ఉద్యమ కెరటం, దేశభక్తుడు - బత్తిని మొగిలయ్య గౌడ్
మట్టి మనుషుల వీరోచితమైన పోరాటాలను మననం చేసుకుం దాం. జాతి విముక్తికోసం నెత్తురు చిందించిన అమరులకు నివాళులర్పిద్దాం. జాతీ య జెండా ఎత్తడంపై నీలినీడలు, నిషేధాజ్ఞలు కొనసాగుతున్న నిజాం నిరంకుశ పాలనలో ప్రాణాలకు తెగించి జాతీయ జెండా ఎత్తిన దేశభక్తులను కాపాడటం కోసం రెండు వందల మంది రజాకార్లతో వీరోచితంగా పోరాడి అమరుడైన బత్తిని మొగిలయ్య గౌడ్ అమరత్వమే నాలుగు కోటలున్న ఓరుగల్లుకు పెట్టని ఐదవ కోట.తెలంగాణ ఒక నిరంతరం పోరాటాల ఝరి. తెలంగాణ చరిత్రంతా అసంఖ్యాక బహుజనుల అసమాన త్యాగాల ఫలితమే. ఈ గడ్డ మీద జరిగిన ఆధిపత్య వ్యతిరేక పోరాటాల్లో అసువులు బాసిన అమరులంతా ఈ గడ్డ మీద మరణం కూడా ఒక మధుర జ్ఞాపకమని వాళ్ళ అమరత్వపు స్మృతులను మనకందించారు. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో తెలంగాణలో భూస్వామం వేళ్ళానుకుపోయింది. ఓరుగల్లులో స్వతంత్య్ర ఆకాంక్ష అభివృద్ధిలో భాగంగా 1929లో మొలుగు భూమయ్యతో ఆర్య సమాజ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. చైతన్య కేంద్రమైన ఓరుగల్లు కోటలో బొలుగొడ్డు ఆచారి అనే ఆర్యసమాజ్ కార్యకర్త యువకులను చేరదీసి ఆసనాలు, సాము గారడీలు దేశభక్తికి సంబంధించిన వివిధ సాంస్కృతిక ప్రక్రియలను నేర్పించడం మొదలుపెట్టాడు. క్రమంగా ఆర్యసమాజ్ కార్యకలాపాలలో కాళోజీ, హయగ్రీవాచారి, చందా కాంతయ్య, మడూరి శంకరలింగం, బుర్ర కృష్ణస్వామి, దేవరకొండ చంద్రమౌళి, వేముల వెంకట్రామయ్య, ఇటికాల మధసూధన్ రావు అతని శ్రీమతి అనసూయాదేవీ, బత్తి ని మొగిలయ్య మొదలైన వారు అందు లో భాగస్థులై వరంగల్ రాజకీయాలను చైతన్యవంతం చేశారు. 1946 ఫిబ్రవరి రెండవ వారం లో హైద్రాబాద్ కాంగ్రెస్ కమిటీ ఒక రహస్య సర్క్యూలర్‌ని జారీ చేసింది. నిజాం రాజ్యం పట్టణాలలో, గ్రామాలలో కాంగ్రెస్ సేవాదళ్ కార్యకర్తలంతా రహస్యంగానైనా త్రివర్ణ పతాకాలు ఎరుగవేయాలని, జాతీయ గీతాన్ని ఆలపించాలని దాని సారాంశం. బత్తిని మొగిలయ్య ఆర్య సమాజ్ కార్యకర్త. ఇతను వరంగల్ తూర్పుకోటలో 1917లో చెన్నమ్మ మల్లయ్య దంపతులకు ఐదవ సంతానంగా జన్మించాడు. మొగిలయ్య దేశభక్తిని మదినిండా నింపుకున్న యువకుడు. అన్యాయాన్ని, ఆధిపత్యాన్ని సహించలేనివాడు. తాళ్లె క్కే కులవృత్తిని చేపట్టి ఆర్యసమాజ్ కార్యకలాపాలలో భాగమయ్యాడు. ఇతని అన్న రామస్వామి అంకితభావం కలిగిన కాంగ్రెస్ కార్యకర్త. వీరిద్దరి కారణంగా వరంగల్ కోటలో రాజకీయ చైతన్యం పెరుగసాగింది. వీరి ఇండ్లు తూర్పు కోట పరిసర ప్రాంతాలు స్వతంత్య్ర ఉద్యమకాలంలో చైతన్య వేదికలుగా మారాయి. నిజాం రాజు అధికారికంగా త్రివర్ణ పతాకావిష్కరణను నిషేధించాడు. జెండా ఎత్తడమంటే మరణానికి కూడా వెరువకుండా చేసే సాహస కార్యమే! కోటలో నిజాం రజాకార్ అనయాయులున్నప్పటికీ, మొగిలయ్య, రామస్వామిల ఆధ్వర్యంలో రహస్యంగా జెండా ఎత్తడం మొదలు పెట్టారు. ఈ చైతన్యమే క్రమంగా ఆ తరువాత కాలంలో నిజాం సంస్థానమంతా విస్తరించింది.ఆ రోజు 11-08-1946 ఆదివారం ఉదయం 7.30 గంటలకు తూర్పుకోట ముఖద్వారం దగ్గర జెండా ఎగురవేయాలని, అందులో కోటలో ఉన్న వాళ్ళందరిని భాగస్వాములను చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు హయగ్రీవాచారి కాంగ్రెస్పట్టణ అధ్యక్షులుగా భూపతి కృష్ణమూర్తి కోశాధికారిగా ఉన్నారు. వీళ్లతో పాటుగా ఆర్యసమాజ్ కార్యకర్తలు, కాంగ్రెస్ వాలంటీర్స్‌తో పాటు కోటలోని ప్రజలు సుమారు వంద మందితో పాటు కె. సమ్మయ్య, వెంకట్రాంనర్సయ్య, మడూరి రాజలింగం కెప్టెన్ మల్లయ్య, వైస్‌కెప్టెన్ ఆరెల్లి బుచ్చయ్య మొదలైన నాయకులంతా కలిసి జెండా ఆవిష్కరణ చేశారు. మువ్వన్నెల జెండాకు జైకొట్టారు.
ఈ విషయం తెలిసిన రజాకార్లు వారి అనుయాయులు సుమారు రెండు వంద ల మంది మారణాయుధాలతో జెండా ఎత్తిన నాయకులను చంపడానికి వరంగల్ చార్బౌళీ నుంచి తూర్పు కోటకు చేరుకున్నారు. జెండాను దించి కాళ్ళతో తొక్కి తగులబెట్టి అంతా కలిసి బత్తిని రామస్వామి ఇంటి వూపు కదిలారు. జెండా ఎత్తిన ప్రధాన నాయకులైన భూపతి కృష్ణమూర్తి, హయగ్రీవాచారి, పంచాయితి ఇన్స్పెక్టర్ కె.సమ్మయ్య, వెం కట్రాంనర్సయ్య, ఎం.యస్.రాజలిం గం.. ఈ ఐదుగురు బత్తిని రామస్వామి ఇంట్లో చాయ్ తాగుతూ భవిష్యత్ జెండా వందన కార్యక్రమాల గూర్చి స్వతంత్ర ఉద్యమ రాజకీయాల గురించి చర్చించుకుంటున్నారు. అప్పుడు ఆ ఇంటి చుట్టూ మోహరించిన రజాకార్లు ఆయుధాలతో, ఇంట్లోకి వెళ్ళి వాళ్లను చంపే ప్రయ త్నం చేశారు. లోపల ఉన్న కృష్ణమూర్తి కాంపౌండ్‌కు గొళ్లెం పెట్టాడు. రజాకార్లు రాళ్ళతో ఇంట్లోని వాళ్ల మీద దాడి మొదలుపెట్టాడు. ఏ క్షణమైన తలుపులు బద్దలు కొట్టి జెండా ఎత్తిన నాయకులనందరిని మట్టు బెట్టాలని చూశారు. జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్న మొగిలయ్య అనంతరం తన కులవృత్తి అయిన తాళ్ళెక్కడానికి తాటి వనానికి వెళ్ళా డు. మొగిలయ్య భార్య లచ్చవ్వ 15 రోజుల బాలింత పురిటి బిడ్డతో మంచంపై ఉన్నది.శనిగరం పుల్లయ్య అనే ఆర్య సమా జ్ కార్యకర్త తాటివనంలో ఉన్న మొగిలయ్యకు రజాకార్ల దాడి గురించి చెప్పాడు. దాడి గురించి విన్న మొగిలయ్య కట్టలుతెంచుకున్న ఆవేశంతో తన ఇంటివైపు పరుగుతీశాడు. రజాకార్ల దాడి భీకరంగా సాగుతుంది. ఏ క్షణమైన ఆ ఇంట్లో ఉన్నవాళ్లంతా చనిపోయేట్టుగా వుం దని భావించి తన ఇంటి వెనుక దర్వాజ నుంచి రజాకార్ల కంటబడకుండా ఇంట్లోకివెళ్ళి ఇంటి సూరులోని తల్వార్‌తో రజాకార్ల సమూహం మధ్య ప్రత్యక్షమయ్యాడు. కాకతీయ ప్రతాపానికి ప్రతీకగా మొగిలయ్య రజాకార్ మూకపై విరుచుకుపడి నరకడం మొదలుపెట్టాడు. దీంతో రజాకార్లంతా చెల్లాచెదురయ్యా రు. చెదిరిపోయిన రజాకార్లు తిరిగి మొగిలయ్యపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఖాసీం షరీఫ్ బల్లెంతో మొగిలయ్య వైపు వస్తున్నప్పుడు మొగిలయ్య తన శత్రువును నరకడానికై తన కత్తిని పైకెత్తాడు. అది తన ఇంటి ముందు గల పందిరి గుంజల మద్య చిక్కుకున్నది. ఇదే అదనుగా భావించిన షరీఫ్ తన బల్లెంతో మొగిలయ్య గుండెల మీద పొడిచాడు.మొగిలయ్య అమరుడైనాడు. మొగిలయ్యను చంపిన షరీఫ్ అతని గుండెల మీద చిమ్మి న రక్తాన్ని తన ముఖమంతా పులుముకున్నాడు. ఖాసీం షరీఫ్‌ని అతని అనుయాయులు తమ భూజాలపై మోస్తూ ఈలలు వేస్తూ చప్పట్లతో ఇప్పటి వరంగల్ చౌరస్తాకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అప్పటి వరంగల్ తాలుకాదార్ (కలెక్టర్) అబ్దుల్ మోహిత్ మీన్ ఎదురేగి హంతుకుడైన ఖాసీం షరీఫ్‌కు పూలమాలలు వేసి ఆలింగనం చేసుకున్నాడు. జెండా ఎత్తిన నాయకులకు ప్రాణభిక్ష పెట్టి అమరుడైన దేశభక్తుడు బత్తిని మొగిలయ్య అమరత్వం చిరస్మరణీయంగా నిలిచి ఉండాలని వరంగల్ నడిబొడ్డున గల జెపియన్ రోడ్ లో 1954లో మొగిలయ్య స్మారక భవనాన్ని ప్రజలు ఏర్పా టు చేశారు. కోల్పోయిన హక్కులేవి పోరాటం చేయకుండా రావు. మొగిలయ్య జాతికి ఒక దివిటి అయ్యాడు. పోరాటమేదైనా సజీవమైనదే. పోరాటంలో వీరులు మరణించవచ్చు. చంపిన శత్రువులు విజయగర్వంతో విర్రవీగవచ్చు. కానీ వాళ్ళ త్యాగం సమస్త ప్రజల ఆకాంక్షలలో వెళ్ళి విరుస్తుంది. భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్గురుల నుంచి బత్తిని మొగిలయ్య దాకా మనం మననం చేసుకునేది.. ఈ మట్టిని, మానవీయతను, ప్రేమించిన అమరులను త్యాగధనులనే.
వరంగల్ వాసుల్లో ‘బత్తిని మొగిలయ్య గౌడ్’ గురించి తెలియని వాళ్లు ఉండరు. రజాకార్లతో పోరాడి అమరుడైన వీరుడు మొగిలయ్య. ఆయన భార్యే లచ్చవ్వ. డబ్బుకు ఆరాటపడని ఆ తెలంగాణ తల్లి తన భర్త వేన వేల జ్ఞాపకాలను మదిలో దాచుకున్న తీరు చదవండి...
‘‘..చిన్నప్పుడే నాకు మొగిలయ్యతో పెండ్లైంది. ఆయన చానా పొడుగరి. అందరితో
మంచిగా సోపతి జేసేటోడు. రోజు బండరాళ్లను పైకి కిందికి ఎత్తుతూ, కత్తులను, కర్రలను ఇటు అటు తిప్పుతూ సాధన జేసేటోడు. ఆయన గుర్తుగా ఇప్పటికి అవి నేనున్న మా కోట ఇంట్లనే ఉన్నయి. ఆ రోజు ఆదివారం (11--1946). నేను పదిహేనొద్దుల బాలింతను. గారోజు పొద్దుగాల్నే మొగిలయ్య వరిమండెకు నీళ్లు బోసి వత్తనని పోయిండు. అప్పుడే వాళ్ళమీద మన్నుబడ రజాకార్లు వచ్చిండ్లు. మా ఇంటి ముంగట లొల్లిబెట్టుకుంట రాళ్లతో గొట్టుకుంట ఆగమాగం జెయ్యబట్టిండ్లు. ఎట్ల దెలిసిందో ఏందోగని ఆయన పొలం కాడికని పోయినోడు ఉరికచ్చి మా ఇంట్ల, గడ్డి గుడిసె సూరులో దాసిన జంబియా దీసి బయటకురికి రజాకార్ల మీద పడ్డడు. ఇంట్ల ఉన్న నాకు, మా అత్తకు ఏం జరుగుతాందో తెల్వలే. అటెంక కొద్దిసేపట్లనే ఒర్రుడు, తుపాకి దెబ్బలు ఇన్పడ్డయి. వాళ్ళమీద మన్నుబడ ఆయనను సంపనే సంపిండ్లు.
తమ్మున్ని సంపుతాంటే అడ్డంబోయిన మా బావకు సుత కత్తి దెబ్బల్ దాకినయ్, అటెంక అందరు నా మంచం సుట్టూత జేరిండ్రు. గుండెలు అవిశిపోయేటట్టుగ ఏడ్చిన. అటెంక ఎవలు మందలిచ్చెటోల్లే లేకుంట అయింది. మొగిలయ్యతో కలిసి తిరిగినోళ్లు, లీడర్లు, దేశ దేశాలల్ల మొగిలయ్య పేరు మీద పైసలు వసూలు జేసిండ్లు, వసూలు చేసిన పైసలు అందరి ముంగట ఇచ్చెటోల్లు..తెల్లారే మల్ల తీసుకపోయేటొల్లు. ఒక్కపైస నా చేతికి రాలే.’’
-లచ్చవ్వ ఇప్పుడు కూడా అప్పుడు మొగిలయ్యతో కలిసి కాపురం చేసిన ఇంట్లోనే ఉంటున్నది. తనను ఎవ్వరు గుర్తించకున్నా, గౌరవించకున్నా మొగిలయ్యతో పంచుకున్న జ్ఞాపకాలు ఇంకా తన మనసులో సజీవంగా ఉన్నట్టు చెప్పింది. మంత్రి పొన్నాల లక్ష్మయ్య లచ్చవ్వను సన్మానించి వెయ్యినూట పదహార్ల రూపాయలివ్వబోతే. ‘వెయ్యి నూట పదహార్లు, వద్దు వేల జ్ఞాపకాలు సాలు’ అని, ఆ సన్మానాన్ని, డబ్బుని తిరస్కరించింది.
అదీ ఆమె ఆత్మగౌరవం. అట్ల డబ్బుకు ఆరాటపడని ఆ తెలంగాణ తల్లికి వందనాలు.
(‘చరిత్ర మరవని ఓరుగల్లు ఉద్యమ కెరటం-బత్తిని మొగిలయ్య గౌడ్’
0 comments:
Post a comment