Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Saturday, 19 January 2019

Ajjada Adibhatla Narayana Dasu- (31 August 1864-2 January 1945)-‘హరికథా పితామహుడు’ ఆదిభట్ల నారాయణదాసు -‘హరికథ’ పేరు చెప్పగానే తొలుత గుర్తొచ్చే మహనీయుడు, మాననీయుడు శ్రీమత్‌ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు.

Ajjada Adibhatla Narayana Dasu- (31 August 1864-2 January 1945)-‘హరికథా పితామహుడు’ ఆదిభట్ల నారాయణదాసు -‘హరికథ’ పేరు చెప్పగానే తొలుత గుర్తొచ్చే మహనీయుడు, మాననీయుడు శ్రీమత్‌ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు.
Ajjada Adibhatla Narayana Dasu- (31 August 1864-2 January 1945)-‘హరికథా పితామహుడు’ ఆదిభట్ల నారాయణదాసు -‘హరికథ’ పేరు చెప్పగానే తొలుత గుర్తొచ్చే మహనీయుడు, మాననీయుడు శ్రీమత్‌ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు.

ఆదిభట్ల వేంకట చయనులు, నరసమ్మ దంపతులకు రక్తాక్షినామ సంవత్సర శ్రావణ కృష్ణ చతుర్దశి బుధవారం నాడు మఖ నక్షత్రం 4వ పాదంలో సువర్ణముఖీ నదీ తీరాన గల ‘అజ్జాడ’లో ఆదిభట్ల నారాయణదాసు జన్మించాడు. ఆంగ్ల కాలమానం ప్రకారం అది 31 ఆగస్టు 1864. దాసు తండ్రి వెంకట చయనులు ఆజాను బాహుడు. మహా పౌరాణికుడు, కవి, వ్యాఖ్యాత, సత్యసంధుడు, సూర్యోపాసకుడు. ఒకసారి చయనులు గంగాభవానిని ఎనిమిది శ్లోకాలతో స్తుతించి, ఆమె అనుగ్రహం వల్ల నూతిలో నీరు పడేటట్లు చేయగలిగారు. అంతటి శక్తి సంపన్నుడు.

నారాయణ దాసు కూడా ఆజానుబహుడు. సుందర గంభీర విగ్రహులు. తాను జీవించినంత కాలం ఎవరికీ తలవంచి ఎరుగడు. సమస్త భోగాలనూ అనుభవించిన అదృష్ట జాతకుడు. శ్రీచక్ర ఆరాధకుడు, గొప్పభక్తుడు. ఆయన తల్లిదండ్రులు కుమారునికి తొలుత సూర్యనారాయణ అని నామకరణం చేశారట. ఒకసారి వేంకట చయనులు క్షయవ్యాధి పీడితులైనప్పుడు ఆ వ్యాధి నిర్మూలనకై సూర్యోపాసన చేస్తే ఆ జబ్బు తగ్గింది. అందువల్ల కొడుక్కి పెట్టిన సూర్యనారాయణ అనే పేరులోని ‘నారాయణ’ కు చివర దాసు అని చేర్చి, ‘నారాయణ దాసు’ అని పిలవసాగారు.

బాల్యంలోనే మేధావి

నారాయణదాసు తల్లి నరసమ్మని అందరూ ‘చదువుల అవ్వ’ అని, ‘పురాణాల నరసమ్మ’ అని ఆప్యాయంగా పిలిచేవారట. 1869లో మహా శివరాత్రి పర్వదినాన పార్వతీపురం సమీపంలో గల ‘గుంప’ అనే పుణ్యక్షేత్రంలో శివయ్యను దర్శించుకుని తిరిగి వస్తూ ఐదేళ్ల ప్రాయంగల దాసు, ఆయన తల్లి నరసమ్మ ఒక పుస్తక దుకాణం దగ్గర ఆగారు. నరసమ్మ ‘నాయనా ! భాగవత పుస్తకం వెల ఎంత?’ అని అడిగారు. ఆ పుస్తకాల అంగడి యజమాని అయిన రామాజనుల రంగయ్య ‘నీకెందుమ్మా భాగవతం ? చదువు రాదు కదా !’ అన్నాట్ట. అప్పుడామె చంకనున్న చిన్న సూరిని చూపించి ‘ఈ పిల్లవాడు చదువుతాడు, నేను అర్థం చెపుతాను’ అని బదులిచ్చింది. రంగయ్య ‘అలా చేస్తే పుస్తకాన్ని మీకు ఊరికే ఇస్తాను’ అన్నాడు. రంగయ్య ఆ పుస్తకాన్ని బాలుడైన దాసు చేతికిచ్చిన వెంటనే అందులోని దశమ స్కంధం ‘వర్షరుతు వర్ణన’ను అనర్గళంగా చదివాడు. దాని అర్థాన్ని తల్లి కొడుక్కి వివరించడంతో చుట్టూ చోద్యం చూస్తున్న వారికి, పుస్తక విక్రేత రంగయ్యకు మతిపోయినంత పనైంది. రంగయ్య మహా ఆనందించి ఆ గ్రంథాన్ని అందంగా బైండు చేయించి ఉచితంగా సూర్యనారాయణకు బహూకరించాడు.

ఆ చిన్ననాటి బాలుడే అనంతర కాలంలో ఓ త్రిశక్తి స్వరూపుడుగా; సంగీత, సాహిత్య, నృత్య, ఆశు కవిత, శృతి, స్వరలయ, హరికథా పితామహుడుగా రూపుదిద్దుకున్నాడు. ఆయనే శ్రీమత్‌ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగా ప్రసిద్ధిగాంచాడు. ఆయన తన హరికథా గానంతో ఒక్క తెలుగు ప్రాంతాన్నే కాక, యావద్భారతదేశాన్నీ మంత్రముగ్ధుల్ని చేయగలగడం తెలుగు జాతి చేసుకున్న పుణ్యఫలం.

హరికథకు అంకురం

1883లో నారాయణదాసు మెట్రిక్యులేషన్‌ చదువుతుండగానే ‘హరికథ’కు అంకురార్పరణ జరిగినట్లు చెబుతారు. మద్రాసు నగరం నుండి అప్పట్లో ‘కుప్పుస్వామి నాయుడు’ అనే భాగవతార్‌ ‘ధ్రువ చరిత్ర’ హరికథను కానుకుర్తి హనుమంతరావు ఇంటిలో ఆడుతూ పాడుతూ చెప్పాడు. దానిని ప్రేరణగా తీసుకున్న నారాయణదాసు తను నేర్చుకున్న సంగీత, నృత్య, సాహిత్యాలను అనుసంధానం చేసి ప్రదర్శించేందుకు ఆ హరికథ అనువైనది అని భావించారు. వెంటనే ‘ధృవ చరిత్ర’ గ్రంథాన్ని రాయడం విశేషం. దానినే దాసు గజ్జెలు ధరించి వేణుగోపాల స్వామి మఠంలో హరికథను తన పందొమ్మిదవ ఏట చెప్పి భక్తులను మెప్పించగలిగారు. అప్పుడాయన ప్రతిభను గమనించి ప్రశంసించి ప్రోత్సహించుటంతో, హరి ఉత్సాహము ద్విగుణీకృతమై విజృంభించింది.

ఆదిభట్ల వారిది కంచుకంఠం. హరికథను ప్రారంభిస్తూ వారు ‘శంభో’ అంటూ నినాదం చేస్తే ఆ కళాశాల ప్రాంగణమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అంతా ప్రతిస్పందించేదని చెబుతుంటారు. విజయనగర పౌరుల ప్రోత్సాహంతో అంతక్రితం గ్రామ సంచారానుభవం వల్ల దాసు పేరన్నతోబాటు దేశ సంచారానికి బయల్దేరారు. ‘ఉర్లాము’ జమీందారిణి కందుకూరి మహాలక్ష్మమ్మ ఆస్ధానంలో గల పండితులను తన ఆశు కవిత ధారతో, హరికథా ప్రదర్శనతో మెప్పించారు. అక్కడి పండితులు ‘మీరు అవధానం చేయగలరా’ అని ప్రశ్నిస్తే, సాహిత్యావ ధానం కూడా చేసి మెప్పించారు. ఒక పర్యాయం నారాయణ దాసు హరికథ చెప్పేందుకు ఉద్యుక్తులౌతూ ‘మీకు హరికథ కావాలా? గిరికథ కావాలా?’ అంటూ నవ్వుతూ సభికుల్ని అడిగితే వారు ‘గిరికథ కావాలి’ అన్నారట. వెంటనే, దాసు ఆశువుగా ‘గిరిజా కళ్యాణం’ కథను హరికథగా చెప్పి శ్రోతల మన్ననలు పొందారు.

కాంతి పుంజం

దాసు తనకి పరిచయస్థుడైన ‘జయంతి కామేశం’ అనే వ్యక్తిని కలవడానికి ఒరిస్సా రాష్ట్రంలోని బరంపురం వెళ్లారు. కామేశం అక్కడ పేరు ప్రఖ్యాతులు గల ప్లీడరు. వారింట్లో దాసు అడుగు పెట్టగానే, కామేశం గుమాస్తా దాసుకి ఎదురొచ్చి ప్లీడరు గారు మేడమీదున్నారు, మీ పేరు చెప్పండి, మీరొచ్చినట్లు చెబుతానన్నాడు. మీరేం చెప్పనక్కరల్లేదు. నేనే వెళ్తానని దాసు దూకుడుగా మేడపైకి వెళ్లిపోయారట. పుస్తకం చదువకుంటున్న కామేశం అలికిడి విని తేరిపార చూస్తూ ‘ఎవరయ్యా నువ్వు’ అని అడిగారట. నారాయణ దాసు దానికి ‘మానవాకృతిలో వచ్చిన గంధర్వుడను’ అంటూ అతి ధీమాగా సమాధానం చెప్పారు. వెంటనే ఆశ్చర్యంతో కామేశం ‘ఔను ! నిజమే నువ్వు రాగానే నా గదిలోకి ఏదో కాంతి ప్రసరించినట్లయ్యింది’ అని చెప్పి, దాసుని అక్కున జేర్చుకుని ఆదరించారు. తరువాత దాసు అదే ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో కొన్ని వందల హరికథలు చెప్పడం విశేషం. ఇదే పంథాలో నారాయణ దాసు గోదావరి (నేటి తూర్పుగోదావరి) జిల్లా రాజ మహేంద్రవరంలో హరికథ చెప్పారు. ఆదిభట్లను ‘సకల కళా వల్లభుడు’ అనేవారు. ఆయన సంభాషణా చతురుడే కాక చతుర్ముఖ పారాయణంలోనూ (జూదం, పేకాట) దిట్టే!

సంగీత శాస్త్ర వైదుష్య ప్రకటన ప్రధానంగా దాసు హరికథలు చెబుతూ ఏలూరు, బందరు, కాకినాడ, అమలాపురం, విజయనగర పట్టణాలతోబాటు ఎన్నోచోట్ల కథాగానం చేశారు. ఆయన సతీమణి లక్ష్మీ నరసమ్మ. ఆమెకు రాముని కథపై మక్కువ ఎక్కువ. 1915లో ఆమె కాలం చేసింది. అప్పుడు నారాయణదాసు భార్య ఆత్మశాంతి కోసం ‘యదార్థ రామాయణం’ రాసి ఆ మహాస్వాధ్వికి అంకితం చేసారు.

బహుముఖ ప్రతిభ


ఒకసారి దాసు తన ధర్మపత్ని లక్ష్మీ నరసమ్మతో కలిసి కాశీ యాత్ర చేసుకుని తిరిగివస్తూ దారిలో కలకత్తా నగరంలో ఆగారట. అక్కడ వారు బెంగాలీయుల కోసం హిందీ భాషలో ‘శ్రీకృష్ణ జననం’ హరికథ చెప్పారు. ఆ హరికథను విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ విన్నారు. ఆ తరువాత ఒకసారి ఆయన విజయనగరం విచ్చేసినప్పుడు నారాయణ దాసుని కలిసి ‘మీరు కలకత్తాలో హరికథ చెబుతూ ‘బేహాగ్‌’ రాగం ఆలపించారు, అదింకా నా చెవుల్లో మార్మోగుతున్నది’ అని మెచ్చుకోలుగా అన్నారట.

1904లో బెంగు ళూరులో గాయక మహాసభ జరిగింది. దానికి దేశీయ గాయక శ్రేష్ఠులెందరో విచ్చేశారు. నారాయణదాసు వంతు వచ్చింది. అప్పుడాయన ‘రుక్మిణీ కళ్యాణం’ కథ చెప్పారు. దానికి దక్షిణామూర్తి అనే విద్వాంసుడు రెండు చేతులు ఎత్తి దాసుకి ‘లయబ్రహ్మ’ అనే బిరుదు నిచ్చారట. 1919లో సంగీత ప్రియుడు, భూస్వామి అయిన కానుకుర్తి లక్ష్మీనరసింహారావు ప్రోత్సాహంతో విజయరామ గజపతి విజయనగరంలో సంగీత కళాశాలను 05 ఫిబ్రవరి 1919లో స్థాపించారు. దానికి దాసు ప్రధానాచార్యగా నియమితులయ్యారు. 1921లో దాసు ‘రామచంద్ర శతకం’ రచించారు. అదే ఏడాది కృష్ణాజిల్లా నందిగామలో ‘హరికథాభి వర్ధనీ’ సమాజం వారు ‘రుక్మిణీ కళ్యాణం’ పేరుతో హరికథ పోటీలు నిర్వహించారు. అక్కడ దాసుకి మరిచిపోలేని సత్కారం జరిగింది. 1924 లో దాసుకి విజయనగరం పట్టణంలో షష్ఠిపూర్తి అభిమానుల సమక్షంలో జరిగింది.

ఇతర రచనలు

ఆదిభట్ల నారాయణదాసు కేవలం హరికథకులే కాకుండా హరికథేతర కృతులను కూడ రచించారు. దానికి వారి కృతులెన్నో ఉదాహరణలై లోక ప్రసిద్ధి గాంచాయి. అందులో సంస్కృత శతకాలు, మిశ్ర భాషా శతకాలు, అచ్చ తెనుగు శతకాలూ ఉన్నాయి. వాటిలో కాశీ శతకం, రామచంద్ర శతకం గీర్వాణ భాషలో వ్రాసినవైతే, కాశీ శతకం అనుష్ఠ్యులతో వ్రాసినది. దీనిలో మకుటం ఉండదు. వీటికితోడు ఆయన ముకుంద శతకం, మృత్యుంజయ శివశతకం, సూర్యనారాయణ శతకం, సత్యవ్రతి శతకం వంటి కొన్ని కందపద్య శతకాలు రచించారు. ‘వేల్పువంద’ అనే పేరుతో దాసు ఒక అచ్చ తెనుగు శతకం, ‘మృత్యుంజయాష్ఠకం’ అనే అష్టకం సంస్కృతంలో వ్రాసి నట్లు చెబుతారు. కాని నేడవి లభ్యం కావడం లేదు.

అజ్జాడ రచించిన రూపకాలు రెండు. అవి ‘దంభపుర ప్రహసనం’, ‘సారంగధర నాటకం’. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుముఖ ప్రక్రియాస్రష్ఠ అయిన దాసు ప్రబంధాలను కూడా నాలుగింటిని రచించారు. బాటసారి, మేలు బంతి, ట్రావెలర్‌, తారకం అనేవి. నారాయణదాసు స్వీయ కృతులనే కాకుండా బహుభాషావేత్త కాబట్టి ఏడు అనువాద గ్రంథాలనూ రచించారు. ‘ఉమర్‌ ఖయ్యామ్‌ రుబాయతు, నవరస తరంగిణి, తల్లి విన్కి, నూఱు గంటి, మ్రొక్కుబడి, వెన్నునివేయి పేర్లవినకం, వేల్పుమాట’ అనేవి. దాసు విరచిత శాస్త్ర గ్రంథాలైతే తొమ్మిది. అవి క్రమంగా ‘మన్నిమిన్ను, తర్క సంగ్రహం, వ్యాకరణ సంగ్రహం, సీమపల్కు వహి, పురుషార్థ సాధనం, చాతుర్వర్గ్య సాధనం, జగజ్జ్యోతి, దశవిధ రాగానవతి, కుసుమ మంజరి, అచ్చ తెలుగు పలుకుబడి’ అనేవి. ‘ఆదిభట్ల నారాయణదాసు జీవిత చరిత్రము’ అనే పేరుగల యక్షగానాన్ని పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు రచిస్తే, మరువాడ వేంకట చయనులు ‘నారాయణదాసు జీవిత చరిత్రము’ను రాశారు.

ప్రతిభ, వ్యుత్పత్తి సమపాళ్లలో గల సరస్వతీ పుత్రుడు, విశిష్ఠ పురుషుడు అయిన ఆదిభట్ల 1945 జనవరి మాసంలో శివసాయుజ్యం పొందారు. ‘హరికథ’ పేరు చెప్పగానే తొలుత గుర్తొచ్చే మహ నీయుడు, మాననీయుడు శ్రీమత్‌ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసే.

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top