మొబైల్ ఛార్జీల మోత
నేటి అర్ధరాత్రి నుంచే అమలు
వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ ప్రకటన
నెలకు రూ.49 చెల్లిస్తేనే ఇన్కమింగ్ కాల్స్ కూడా
6 నుంచి పెంచుతాం: జియో
దిల్లీ: చౌకధరల మొబైల్ సేవలకు టెలికాం సంస్థలు స్వస్తి పలుకుతున్నాయి. గత నాలుగేళ్లలోనే తొలిసారిగా ప్రీపెయిడ్ చందాదార్లకు కాల్, డేటా ఛార్జీ (టారిఫ్)లు ఈనెల 3 నుంచి పెంచుతున్నట్లు వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ ఆదివారం ప్రకటించాయి. నేటి (సోమవారం) అర్ధరాత్రి 12 గంటల నుంచి ఛార్జీల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపాయి. ఛార్జీల పెరుగుదల 50 శాతం వరకు ఉండనుంది. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసల చొప్పున వసూలు చేస్తామని ఈ సంస్థలు తెలిపాయి. నెలకు కనీసం రూ.49తో రీఛార్జి చేయిస్తేనే చందాదార్లు ఇన్కమింగ్ కాల్స్ అయినా అందుకోగలుగుతారు. ఈనెల 6 నుంచి 40 శాతం వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు, సరికొత్త అపరిమిత వినియోగ పథకాలు ఆవిష్కరించనున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది.
వొడాఫోన్ ఐడియా
చందాదార్ల సంఖ్యా పరంగా ప్రథమ స్థానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) 2, 28, 84, 365 రోజుల కాలవ్యవధితో అపరిమిత వినియోగం కింద ఉన్న పథకాలకు కొత్త ఛార్జీలను ప్రకటించింది. వీటి పెరుగుదల 41.2 శాతం వరకు ఉంది. ప్రస్తుతం 365 రోజుల కాలపరిమితితో అపరిమిత కాల్స్, 12 జీబీ డేటా పథకం రూ.998కి లభిస్తుండగా, ఇకపై 50 శాతం పెరుగుదలతో 24 జీబీ డేటా అందిస్తూ, రూ.1499 కానుంది. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్‌తో 365 రోజుల కాలపరిమితి పథకానికి ఇప్పటివరకు రూ.1699 వసూలు చేస్తుండగా, ఇకపై రూ.2399 అవుతుంది. 84 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ డేటా లభించే అపరిమిత పథకం ధర రూ.458 నుంచి 31 శాతం అధికమై రూ.599కి చేరనుంది. అపరిమిత పథకాల కింద రోజుకు సంక్షిప్త సందేశాల (ఎస్ఎంఎస్) పరిమితిని కూడా 100కు, కాల్స్‌కు కూడా కాలవ్యవధికి అనుగుణంగా నిమిషాల పరిమితిని వర్తింప చేయనున్నారు.
భారతీ ఎయిర్టెల్
ప్రస్తుత పథకాల ఛార్జీల పెంపు రోజుకు 50 పైసల నుంచి రూ.2.85 వరకు ఉందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం 365 రోజుల కాలపరిమితితో అపరిమిత కాల్స్, 12 జీబీ డేటా పథకం రూ.998కి లభిస్తుండగా, ఇకపై 50 శాతం పెరుగుదలతో 24 జీబీ డేటా అందిస్తూ, రూ.1499 కానుంది. 2, 28, 84, 365 రోజుల కాలపరిమితి కలిగిన అపరిమిత కాల్స్, డేటా వినియోగ ఛార్జీల పెరుగుదల 41.14 శాతం ఉండనుంది. అపరిమిత వినియోగ పథకాలే అయినా 28 రోజుల కాలపరిమితికి 1,000 నిమిషాలు, 84 రోజులకు 3,000 నిమిషాలు, 365 రోజులకు 12000 నిమిషాల మేర ఇతర నెట్‌వర్క్‌లకు ఉచితంగా కాల్ చేసుకోవచ్చు. ఇంతకు మించితే నిమిషానికి 6 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్ 365 రోజుల పథకం ధర రూ.1699 నుంచి రూ.2398కి పెరగనుంది. ఇదేసేవలతో 84 రోజుల పథకం ధర రూ.458 నుంచి 598 కానుంది.
జియో
కాల్స్, డేటా ఛార్జీలు 40 శాతం వరకు పెరగనున్నాయి. కొత్త పథకాల కింద చందాదారులకు 300 శాతం అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని తెలిపింది. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు పరిమితి విధిస్తామని స్పష్టం చేసింది.
0 comments:
Post a Comment