మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఎస్బీఐలో ఏదైనా లోన్ తీసుకున్నారా? మీ ఖాతాలో సమస్యల్ని పరిష్కరించేందుకు కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తుంటారా? ఎట్టిపరిస్థితుల్లో కస్టమర్ కేర్ నెంబర్లను గూగుల్‌లో వెతకకూడదని హెచ్చరిస్తోంది ఎస్బీఐ. ఏ డౌట్ ఉన్నా వెంటనే గూగుల్‌లో వెతకడం చాలామందికి అలవాటు. కానీ ఈ అలవాటే కొంపముంచుతోంది. గూగుల్‌లో బ్యాంకుల కస్టమర్ కేర్ నెంబర్లు తప్పుగా ఉంటున్నాయి. వాటికి కాల్ చేస్తే సైబర్ నేరగాళ్లకు కనెక్ట్ అవుతోంది. సైబర్ నేరగాళ్లు కస్టమర్ల ఖాతా వివరాలన్నీ తెలుసుకొని నిండా ముంచేస్తున్నారు. అకౌంట్ నెంబర్ దగ్గర్నుంచి ఏటీఎం కార్డ్ పిన్ వరకు వివరాలన్నీ తెలుసుకొని అకౌంట్లో ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువయ్యాయి. ఆరా తీస్తే ఆన్లైన్లో దొరికిన నెంబర్లకు కస్టమర్లు కాల్ చేసి మోసపోతున్నట్టు చివరకు తేలుతోంది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రమత్తమైంది. ఖాతాదారులను అప్రమత్తం చేస్తోంది. ఈ మేరకు ట్విట్టర్లో హెచ్చరికలు జారీ చేసింది.
ఎస్బీఐ ట్వీట్లో ఉన్న సమాచారం ప్రకారం ఆన్లైన్లో కస్టమర్ కేర్ నెంబర్లు తప్పుగా ఉంటున్నాయి. అందుకే ఆన్లైన్లో ఎస్బీఐ కస్టమర్ కేర్ నెంబర్లు, బ్రాంచ్ నెంబర్లు వెతకొద్దు. ఆన్లైన్లో గూగుల్‌లో దొరికిన నెంబర్లకు అస్సలు కాల్ చేయొద్దు. https://bank.sbi/ వెబ్‌సైట్‌లోని కస్టమర్ కేర్ నెంబర్లకు మాత్రమే కాల్ చేయాలి. బ్రాంచ్ వివరాలు కావాలంటే వెబ్సైట్లో చూడాలి. ఎస్బీఐని కాంటాక్ట్ చేయాలంటే అధికారిక మార్గాలనే ఉపయోగించాలి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించొద్దు. కార్డ్ వివరాలు, అకౌంట్ నెంబర్లు, సీవీవీ, ఓటీపీ, పిన్ లాంటివి ఎవరికీ చెప్పొద్దు.
ఎస్బీఐ కస్టమర్ కేర్ నెంబర్లు: 1800 11 2211, 1800 425 3800, 080-26599990
0 comments:
Post a Comment