⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Saturday, 2 November 2019

Rakesh Jhunjhunwala-రూ.5వేల నుంచి.. రూ.20వేల కోట్ల సంపాదన..! - భారతీయ వారెన్‌ బఫెట్‌గా పేరుగాంచిన ఝున్‌ఝున్‌వాలా జీవిత విశేషాలు..


రూ.5వేల నుంచి.. రూ.20వేల కోట్ల సంపాదన..! 
స్టాక్‌ మార్కెట్లు, షేర్లు, వాటిల్లో పెట్టుబడులు ఇది చాలా మందికి అర్థం కాని సబ్జెక్ట్‌. రూ.కోట్లు గడిద్దామన్న ఆశతో ఈ రంగంలోకి ప్రవేశించి చేతులు కాల్చుకున్నవారు కోకొల్లలు. కానీ, షేర్‌ మార్కెట్‌ బుల్‌గా పేరుగాంచిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. తాను పట్టిందల్లా బంగారం అన్న చందాన ఆయన ఏ షేర్లు కొంటే వాటి విలువ అమాంతం పెరిగిపోతుంది. రూ.ఐదువేలతో ప్రారంభమైన ఆయన స్టాక్‌ మార్కెట్ల వ్యాపార ప్రస్థానం నేడు దాదాపు రూ.20వేల కోట్లకు చేరింది. ప్రపంచంలోని బిలియనీర్లలో ఒకరిగా ఎదిగారు. ఇదేదో మాయో, మంత్రమో కాదు. స్టాక్‌ మార్కెట్లు, వాటి కదలికలపై ఆయనకున్న పట్టు. కంపెనీల బ్యాలెన్స్ షీట్లపై చేసే అధ్యయనమే ఆయన్ని అగ్రపథాన నిలిపాయి. అయితే, ఆయన మాత్రం వీటన్నింటికీ ఎంతో దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదం లేనిదే సాధ్యం కాదంటారు. భారతీయ వారెన్‌ బఫెట్‌గా పేరుగాంచిన ఝున్‌ఝున్‌వాలా జీవిత విశేషాలు..
13 ఏళ్ల వయసులోనే మార్కెట్లపై ఆసక్తి...
రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జూన్‌ 5, 1969లో జన్మించారు. అదే మహానగరంలో ఉన్న దలాల్‌ స్ట్రీట్‌కి ఆయన దిక్సూచీగా మారారు. తండ్రి ఆదాయపు పన్ను శాఖ అధికారిగా పనిచేసేవారు. అప్పటికే ఆయన స్టాక్ మార్కెట్లలో అడపాదడపా మదుపు చేస్తుండేవారు. దీనిపై తన స్నేహితులతో తరచూ చర్చిస్తూ ఉండేవారు. వీరి సంభాషణల్ని ఆసక్తిగా విన్న ఝున్‌ఝున్‌వాలాకు షేర్‌ మార్కెట్లపై ఆసక్తి పెరిగింది. మార్కెట్‌పై తండ్రిని తరచూ సందేహాలు అడిగేవారు. దీంతో స్టాక్‌ మార్కెట్లకు సంబంధించిన వార్తలు చదవాలని, కంపెనీ ప్రొఫైల్స్‌ని అధ్యయనం చేయాలని తండ్రి సలహా ఇచ్చారు. అలా 13 ఏళ్ల వయసులోనే స్టాక్‌ మార్కెట్లను నిశితంగా పరిశీలించడం ప్రారంభించారు. అప్పుడే మదుపు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తండ్రితో చెప్పారు. అయితే దేనికైనా ప్రొఫెషనల్‌ క్వాలిఫికేషన్‌ అవసరమని భావించిన ఆయన తండ్రి ముందు ఆ అర్హత సాధించాలని సూచించారు. దీంతో 1985లో సీఏ పూర్తి చేశారు. ఆ సమయంలోనే స్టాక్ మార్కెట్లపై అధ్యయనాన్ని మరింత ముమ్మరం చేశారు.
రూ.5000లతో ప్రారంభం...
చదువు పూర్తయిన తర్వాత ఇక స్టాక్‌ మార్కెట్‌నే తన కెరీర్‌గా ఎంచుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇదే విషయాన్ని తండ్రికి చెప్పగా.. పెట్టుబడి మాత్రం తనని అడగొద్దని తెగేసి చెప్పారు. దీంతో తొలుత ఓ స్నేహితురాలి వద్ద తీసుకున్న రూ.5000లను మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టారు. అలా కొన్ని రోజుల్లో కొంత డబ్బు సంపాదించారు. కానీ, ఇలా తక్కువ డబ్బుతో పెట్టుబడులు పెడితే పెద్దగాలాభం లేదని భావించిన ఝున్‌ఝున్‌వాలా భారీ మొత్తంతో రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం మళ్లీ ఓ స్నేహితుడి వద్ద రూ.2.50లక్షలు వడ్డీకి తీసుకున్నారు. వాటితో ‘టాటా టీ’ షేర్లని రూ.43లకు కొన్నారు. మూడు నెలలు తిరగకుండానే వాటి ధర రూ.143లకు చేరుకుంది. దీంతో రూ.5లక్షల లాభం వచ్చింది. ‘టాటా టీ’ షేర్ల భవిష్యత్తుపై ఆయకున్న నమ్మకానికి ఇది నిదర్శనం. అలాగే మార్కెట్ల కదలికలపై ఆయన అధ్యయనం ఏ పాటిదో ఈ ఒక్క ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. అలా 1986-89 మధ్య రూ.2కోట్ల 50లక్షలు సంపాదించారు. వచ్చిన లాభాల్ని తిరిగి పెట్టుబడిగా పెట్టేవారు.
పెద్ద కంపెనీలకు దూరం...
ఝున్‌ఝున్‌వాలా పెద్ద కంపెనీల జోలికి అసలే వెళ్లరు. ఆయన పోర్ట్‌ఫోలియోలో ఉన్న వాటిలో స్మాల్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌ కంపెనీలే ఎక్కువ. ఓసారి ‘సెసా గోవా’ కంపెనీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోతోంది. అలాంటి తరుణంలో కంపెనీకి చెందిన నాలుగులక్షల షేర్లు కొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఝున్‌ఝున్‌వాలా అంచనాలు ఏమాత్రం తప్పలేదు. కొన్ని రోజుల తర్వాత వాటిని అమ్మితే రూ.2కోట్ల లాభం వచ్చింది. 2002-03 మధ్య టైటాన్‌ కంపెనీలోని ఆరు కోట్ల వాటాలను ఒక్కోటి మూడు రూపాయల చొప్పున కొన్నారు. వాటి షేరు ధర ఇప్పుడు రూ.1300వద్ద ఉంది. అలాగే 2006లో లుపిన్‌ షేర్లను రూ.150వద్ద కొన్నారు. ఇప్పుడు దాని ధర రూ.765వద్ద కదలాడుతోంది. ఇలా మార్కెట్‌ కదలికలపై ఆయనకున్న అపార జ్ఞానంతో పెట్టిన పెట్టుబడులన్నీ కొన్ని రెట్లు పెరిగాయి. అలా లాభాల వర్షం కురిపించిన కంపెనీల్లో కొన్ని నేటికీ ఆయన పోర్ట్‌ఫోలియోలో కొనసాగుతుండడం విశేషం. ప్రజ్‌ ఇండస్ట్రీస్‌, అరబిందో ఫార్మా, ఎన్‌సీసీ, టైటాన్ వీటిల్లో కొన్ని.
దిగ్గజ కంపెనీల జోలికి మాత్రం ఆయన ఏనాడూ పోలేదు. అమాంతం ఎగిసిపడే షేర్లంటే తనకు భయమంటారు ఝున్‌ఝున్‌వాలా. షేర్ల ఎంపికలో ఆయన ఎవరి సలహాల్ని తీసుకోరు. ఫండమెంటల్‌ అనాలసిస్‌, వాల్యూ ఇన్వెస్టింగ్‌ స్ట్రాటజీస్‌ ఆధారంగా స్టాక్స్‌ని ఎంచుకుంటారు. అయితే, ఝున్‌ఝున్‌వాలా కొన్ని సందర్భాల్లో నష్టాల్ని కూడా చవిచూశారు. 2011లో ఆయన పోర్ట్‌ఫోలియోలోని 30శాతం షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. కానీ, మార్కెట్‌పై ఆయనకున్న అవగాహనతో 2012లో తిరిగి కోలుకున్నారు..
పలు కంపెనీల బోర్డుల్లో...
అంబానీకి రిలయన్స్‌, నారాయణమూర్తికి ఇన్ఫోసిస్‌, ప్రేమ్‌జీకి విప్రో ఇలా ఒక్కొక్కరికి ఒక్కో కంపెనీ. కానీ, ఝున్‌ఝున్‌వాలాకి మాత్రం అనేక కంపెనీలు. ఈ రోజు ఉన్న కంపెనీలు రేపు ఉండకపోవచ్చు. కొత్త కంపెనీలు వచ్చి చేరతాయి. పాతవి పోతుంటాయి. ఇలా ఝున్‌ఝున్‌వాలాకి ఎన్నో కంపెనీలు. ప్రస్తుతం పలు కంపెనీలు ఆయన్ను తమ బోర్డుల్లో సభ్యుడిగా చేర్చుకున్నాయి. అలాగే తన పేరులోని తొలి రెండక్షరాలు, తన భార్య రేఖా పేరులోని తొలి రెండక్షరాలు కలిపి ‘రేర్ ఎంటర్‌ప్రైజెస్‌‌’ అనే పేరుతో కొంతమంది భాగస్వాములతో కలిసి ఓ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని స్థాపించారు. ఆప్‌టెక్‌ లిమిటెడ్‌, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
గుర్రపు పందేలంటే మహా సరదా...
కాసులు కురిపించే కంపెనీల వేటలో నిమగ్నమయ్యే ఝున్‌ఝున్‌వాలాకి దైవభక్తి ఎక్కువే. పెద్దలపై అపారమైన గౌరవం. మీ విజయానికి కారణం ఏంటంటే ‘దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాద బలమే.. ఆ తర్వాతే అన్నీ’ అని వినయంగా చెబుతారు. కేవలం తన తెలివితేటలతో రూ.వేల కోట్లు సంపాదించిన ఝున్‌ఝున్‌వాలా పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తనకు 60సంవత్సరాలు అంటే 2020నాటికి తన సంపాదనలో 20శాతం స్వచ్ఛంద కార్యక్రమాలకు కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేశారు. లాభాల్ని గడించడమే కాదు. వాటిని విలాసంగా ఖర్చు పెడుతూ.. ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు ఝున్‌ఝున్‌వాలా. ముంబయిలో ఖరీదైన ప్రాంతంలో రూ.వందల కోట్లు విలువ చేసే బంగ్లా ఉంది. అలాగే సినిమాలంటే కూడా ఝున్‌ఝున్‌వాలాకి చాలా ఆసక్తి. కి అండ్‌ కా, ఇంగ్లిష్‌ వింగ్లిష్‌, షమితాబ్‌ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. గుర్రపు పందేలంటే ఆయనకు మహా సరదా. ఆయన దగ్గర 20వరకు రేసు గుర్రాలున్నాయని చెబుతుంటారు! అయితే స్టాక్స్‌ ఎంపికలోనే కాదు.. గెలుపు గుర్రాలను ఎంచుకోవడంలోనూ ఝున్‌ఝున్‌వాలా సిద్ధహస్తులట!

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top