విషమంగానే లతా మంగేష్కర్ ఆరోగ్యం..!
ముంబయి: ప్రముఖ గాయని లతా మంగేష్కర్(90) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉన్నారని.. నెమ్మదిగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. అయితే ఆమె వ్యక్తిగత ప్రతినిధి బృందం(పీఆర్ టీం) మాత్రం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రకటించింది. ‘‘ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఆమె బలంగా పోరాడారు. ఒక గాయనిగా ఆమె ఊపిరితిత్తులకు ఉన్న సామర్థ్యమే ఆమెను గట్టెక్కించింది. నిజంగా గొప్ప యోధురాలు. ఆసుపత్రి నుంచి లతాజీ ఎప్పుడు డిశ్ఛార్జి అవుతారో మేం తెలియజేస్తాం’’ అని పీఆర్ టీం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. మరోవైపు ఆమె తొందరగా కోలుకోవాలని నటి, మథుర ఎంపీ హేమా మాలిని ఆకాంక్షించారు.
హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో ఆమె వేల సంఖ్యలో పాటలు పాడారు. 2001లో ఆమెను కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నతో సత్కరించింది. ఈ ఏడాది మార్చి 30న విడుదలైన ‘‘సౌగంధ్ ముజే ఇస్ మిట్టీ కీ’’ పాట ఆమె పాడిన వాటిలో చివరిది.
0 comments:
Post a Comment