జనవరిలో రిజర్వేషన్లు ఖరారు చేస్తాం
మార్చి చివరికి ఎన్నికలు పూర్తి చేస్తాం
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
విచారణ జనవరి 3కు వాయిదా
గ్రామ పంచాయతీల పునర్నిర్మాణం, రిజర్వేషన్లను 2020 జనవరి మొదటి వారానికి పూర్తిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. జనవరి 10న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందు ఆ వివరాల్ని ఉంచుతామని పేర్కొంది. మార్చి 31 నాటికి ఎన్నికలు పూర్తి చేస్తామని తెలిపింది. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పురోగతిని పరిశీలించేందుకు విచారణను జనవరి 3కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్తో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలోని 12,775 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని అభ్యర్థిస్తూ న్యాయవాది తాండవ యోగేష్, ఏవీ గోపాలకృష్ణమూర్తి అనే వ్యక్తి దాఖలు చేసిన వేర్వేరు ప్రజాహిత వ్యాజ్యాలపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది.
ప్రమాణపత్రం దాఖలు చేసిన సాహ్ని
గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గతేడాదిలో హైకోర్టు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించకపోవడంపై వివరణ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీలం సాహ్ని హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు, షెడ్యూల్ వివరాల్ని అందులో పొందుపరిచారు. అవి..
* గ్రామ పంచాయతీల పునర్నిర్మాణం, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ 2020 జనవరి మొదటి వారానికి పూర్తి చేస్తాం.
* రాష్ట్ర ఎన్నికల కమిషన్కు రిజర్వేషన్ల వివరాల్ని 2020 జనవరి 10 నాటికి సమర్పిస్తాం.
* ఎన్నికలు నిష్పాక్షికంగా జరిపేందుకు పరిపాలనా యంత్రాంగాన్ని బదిలీ/పునఃస్థాపన 2020 ఫిబ్రవరి 10 నాటికి పూర్తిచేస్తాం.
* రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది నియామకం, గుర్తించిన పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు 2020 ఫిబ్రవరి 15 నాటికి పూర్తవుతుంది.
* పోలింగ్ అధికారులు, సిబ్బంది శిక్షణ, ఎన్నికల సామగ్రి సమకూర్చుకోవడం, బ్యాలెట్ పత్రాల ముద్రణ, బ్యాలెట్ పెట్టెల సిద్ధం చేసుకోవడం, శాంతిభద్రతల సంరక్షణ కోసం భద్రతా సిబ్బంది నియామకం, శిక్షణ, రవాణా సదుపాయాల ఏర్పాట్లు 2020 ఫిబ్రవరి 22న పూర్తి చేస్తామని ప్రమాణపత్రంలో పేర్కొన్నారు.
0 comments:
Post a Comment