డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ
దిల్లీ: ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించింది. మిగులు ద్రవ్యం, తగ్గుతున్న వడ్డీరేట్ల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. సవరించిన వడ్డీరేట్లు ఆగస్టు 26 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. కాగా.. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీరేట్లు తగ్గించడం ఈ నెలలో ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు ఆగస్టు 1న కూడా తగ్గించింది.
తాజాగా రిటైల్ డిపాజిట్లపై(అన్ని కాలపరిమితులకు) 10 నుంచి 50 బేసిస్ పాయింట్లు, బల్క్ డిపాజిట్లపై 30 నుంచి 70 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 7 నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5శాతం అందిస్తున్న వడ్డీని 4.5శాతానికి తగ్గించింది. 46 నుంచి 179 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.5 శాతంగా ఇవ్వనుంది. 180 నుంచి ఏడాది లోపు కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీరేటును 6.25శాతం నుంచి 6శాతానికి కుదించింది.
ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై 6.80శాతంగా ఉన్న వడ్డీ రేటును 6.70 శాతానికి తగ్గించింది. 10ఏళ్ల వరకు కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25శాతానికి పరిమితం చేసింది.
0 comments:
Post a Comment