* విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి తీరుతాం
* నియంత్రణ కోసమే కమిషన్ ఏర్పాటు
* ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
రాష్ట్రంలోని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాలు పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల నియంత్రణ, ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు వీలుగా పాఠశాల విద్య, ఉన్నత విద్యలకు వేర్వేరుగా ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేయనుంది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు ఛైర్మన్లుగా ఉండే కమిషన్లలో ఆయా రంగాల్లో నిపుణులు, మేధావులను సభ్యులుగా నియమించనున్నారు. ఆయా కమిషన్లకు సివిల్ కోర్టు అధికారాలు కల్పించనున్నారు. విద్యా సంస్థల్లో చేరికలు పెంచడం, డ్రాపవుట్లు తగ్గించడం, విద్యాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా విద్యార్థులకు అవకాశాలు కల్పించడం ఈ బిల్లుల ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. వీటితో పాటు భూ యజమాన్య హక్కుల బిల్లు, మార్కెట్ కమిటీలకు గౌరవ ఛైర్మన్లుగా స్థానిక ఎమ్మెల్యేలను నియమించేందుకు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిని నియమించేందుకు ఉద్దేశించిన జీతాలు, పింఛను చెల్లింపు, అనర్హతల తొలగింపు సవరణ బిల్లులతో పాటు ద్రవ్య వినిమయ బిల్లుకు సోమవారం శాసన సభ ఆమోదం తెలిపింది.
చదువు పిల్లల హక్కు : సిఎం జగన్మోహన్రెడ్డి
రాష్ట్ర్రంలో విద్యా హక్కు చట్టాలని కచ్చితంగా అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గత ప్రభుత్వాలన్నీ ఈ పని చేయలేకపోయాయని, ఫలితంగా లక్షలాది మంది విద్యకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సోమవారం పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు సభలో ఈ అంశంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. చదువుకోవడం పిల్లల హక్కు అని, చదువు అనేది పేదరికం నుంచి బయటపడేందుకు ఒక ఆయుధమని అన్నారు. గత ప్రభుత్వాలు ప్రాధమిక విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం 33 శాతం మంది నిరక్ష్యరాస్యులు ఉన్నారని తెలిపారు. నిరక్ష్యరాస్యతలో జాతీయ సగటు 26 శాతంగా ఉంటే...రాష్ట్ర సగటే ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో పాఠశాల విద్య పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందన్నారు. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను నీరుగారుస్తూ వచ్చిందని విమర్శించారు. రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలను మూసివేశారని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లు ఇష్టానుసారం ఫీజులు పెంచినా పట్టించుకోలేదన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులను 8,9 నెలల పాటు బకాయిలు పెట్టారని మండిపడ్డారు. స్కూలు యాజమాన్యాలే గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని, ఫీజులను నియంత్రించలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రీ ప్రైమరీ నుంచి 1వ తరగతి వరకు రూ.60 వేల నుంచి లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. చదువనేది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బిల్లులోని విషయాలను వివరించారు. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కమిషన్‌కు రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఛైర్మన్‌గా ఉంటారని, జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ విద్యా నిపుణులతో కలిపి 11 మంది సభ్యులుగా ఉంటారని తెలిపారు. జాతీయ విద్యా సంస్థలు మినహా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను కమిషన్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు.
ఉన్నత విద్యకు కమిషన్ ఏర్పాటు
ఇదిలావుంటే ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణకు సైతం కమిషన్ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన బిల్లును కూడా సోమవారం శాసనసభ ఆమోదించింది. కమిషన్‌లో హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఛైర్మన్‌గా, ప్రముఖ విద్యా వేత్తను వైస్ ఛైర్మన్ వ్యవహరించనున్నారు. మొత్తం 8 మంది సభ్యులు ఉండే ఈ కమిషన్ ఉన్నత విద్య సంస్థలను పర్యవేక్షిస్తుంది. ఫీజులు, మౌలిక వసతులు, బోధన తదితర అంశాలను పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు ఈ బిల్లుపై జరిగిన చర్చలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ...విద్య కోసం చేసే ఖర్చుపై ప్రభుత్వం ఏ మాత్రం వెనుకాడబోదని తెలిపారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా రూ. 33 వేల కోట్లు బడ్జెట్లో ప్రతిపాధించినట్లు పేర్కొన్నారు. కమిషన్లకు పూర్తి స్వేచ్చ ఇవ్వడం జరుగుతుందని, విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. యూనివర్సిటీలను సైతం ప్రక్షాళన చేసే దిశలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతకుముందు శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్థసారధి, మేరుగ నాగార్జున తదితరులు మాట్లాడారు.
0 comments:
Post a Comment