Search This Blog

 • 🖨️ Inter Hall tickets NEW...
 • MORE TO VIEW

Sunday, 23 December 2018

Charlie Chaplin(1889 ఏప్రిల్‌ 16 ---- 1977 డిసెంబర్‌ 25 ) -Biography, Movies and Facts- తిరుగులేని హాస్య నట చక్రవర్తి! -: కష్టాలను దిగమింగి.. ప్రపంచాన్ని నవ్వించాడు-ఆయన గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం.

చార్లీచాప్లిన్.. నవ్వుకు శాశ్వత చిరునామా ఆయన. హాస్యానికి రూపం ఆయన. చేతిలో కర్ర, చిరిగిన కోటు, తలపై టోపీతో తనకే ప్రత్యేకమైన నడక.. అల్లరి, అమాయక చేష్టలతో కడుపుబ్బ నవ్వించే చాప్లిన్ జీవితం మాత్రం నవ్వులుపువ్వులుగా ఏమీ సాగలేదు. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు. ఆయన గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం.

చార్లీచాప్లిన్‌ అంటే!  మూకీల నాటి వాడైనా, నేటికీ చెప్పుకునే అరుదైన నటుడిగా నిలిచాడు చార్లీచాప్లిన్‌!
కానీ... చార్లీచాప్లిన్‌ పంచిన నవ్వులు... కష్టాల కొలిమిలో కాలి రాటుదేలినవి!
అతడు పంచిన అభినయం... పేదరికం ముంగిట నిగ్గుదేలిన అనుభవాల సారం!
ఓ సామాన్య పేద కుటుంబంలో పుట్టి... తినీ తినకా... అనేక బాధలు పడుతూ... పట్టెడన్నం కోసం ఎవేవో పనులు చేస్తూ... ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారుడిగా చార్లీచాప్లిన్‌ ఎదిగిన తీరును తెలుసుకోవాలంటే అతడి జీవితంలోకి ఓసారి తొంగి చూడాలి.
Charlie Chaplin-Biography, Movies and Facts- తిరుగులేని హాస్య నట చక్రవర్తి! - చార్లీ చాప్లిన్: కష్టాలను దిగమింగి.. ప్రపంచాన్ని నవ్వించాడు-ఆయన గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం.
చార్లీ చాప్లిన్-1889 ఏప్రిల్‌ 16 ---- 1977 డిసెంబర్‌ 25


కాల పరీక్షలకు ఎదురు నిలిచి..

చార్లెస్‌ స్పెన్సర్‌ చాప్లిన్‌గా లండన్‌లో పుట్టిన ఓ కుర్రాడు, తన పేరుకు ముందు బ్రిటిష్‌ ప్రభుత్వం గౌరవప్రదంగా ఇచ్చే ‘సర్‌’ బిరుదును పొందడం వెనుక... అతడి 88 ఏళ్ల జీవితంలో 75 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన వెండితెర ప్రస్థానం ఉంది. 1889 ఏప్రిల్‌ 16న పుట్టిన చాప్లిన్, 1977 డిసెంబర్‌ 25న మరణించేలోగా వేదనాభరిత రోజుల్ని, వైభవోపేతమైన దశల్ని, అవమానకరమైన పరిస్థితుల్ని, వివాదప్రదమైన స్థితిగతుల్ని కూడా అనుభవించాడు. కడుపు నింపుకోవడం కోసం పని చెయ్యక తప్పని బాల్యం నుంచి దొరికిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ, ఓర్చుకుంటూ, నేర్చుకుంటూ, అనుభవాలు పేర్చుకుంటూ, నైపుణ్యాలు కూర్చుకుంటూ... ఓ హాస్య నటుడిగా, ఓ చిత్ర నిర్మాతగా, ఓ సంగీతకారుడిగా, ఓ రచయితగా ప్రపంచ స్థాయికి ఎదిగి సినీరంగంలో చెరగని ముద్ర వేయగలిగాడు. ఒకవైపు వెండితెర ప్రస్థానం వెలుగులతో కొనసాగుతుండగానే, అతడి వ్యక్తిగత జీవితం వైవాహిక పొరపాట్లతో ముడిపడుతూ సాగింది. అందుకే నాలుగు పెళ్లిళ్లు, 11 మంది సంతానంతో చాప్లిన్‌ జీవితం మరోవైపు వివాదాస్పద కోణానికి దర్పణం పట్టింది.

తన తొలి చిత్రం తనకే నచ్చలేదు..

చార్లీచాప్లిన్‌ బాల్యమంతా పేదరికంలో, బాధల మధ్యే గడిచింది. తండ్రి చార్లెస్‌ చాప్లిన్, తల్లి హన్నా (లిలీహార్లీ)లు ఇద్దరూ నాటకరంగంలో గాయకులు, నటులే అయినా అంతంత మాత్రం ఆదాయంతో నెట్టుకొచ్చేవారు. చాప్లిన్‌కి ఊహ తెలిసేనాటికే తండ్రి చనిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీనికి సాయం తల్లి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చిన్నారి చాప్లిన్, సోదరుడు సిడ్నీ ఇద్దరూ పొట్టగడవడం కోసం ఏవేవో పనులు చేయకతప్పలేదు. తల్లిదండ్రులు ఆస్తులేవీ ఇవ్వకపోయినా వారసత్వంగా అలవడిన నటనే వారిని రంగస్థలంకేసి అడుగులు వేయించింది. అవకాశాన్ని బట్టి పాట, ఆట, నటనలతో అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. అలా చాప్లిన్‌ చిన్నతనంలోనే తనదైన హాస్య నటనతో మంచి గుర్తింపు పొందగలిగాడు. పందొమ్మిది ఏళ్ల వయసుకల్లా ఓ కంపెనీతో కుదిరిన ఒప్పందం వల్ల చాప్లిన్‌ అమెరికాలో అడుగుపెట్టాడు. అదే అతడి జీవితానికి తొలి మేలు మలుపు. అక్కడి ప్రేక్షకులకు చాప్లిన్‌ హాస్యం నచ్చడంతో 1913లో తొలి సినిమా అవకాశం వచ్చింది. భవిష్యత్తులో వెండితెరపై బలమైన ముద్ర వేసిన చాప్లిన్‌ తొలి సినిమా ఏంటో తెలుసా? కేవలం ఒకే ఒక్క రీలుతో రూపొందిన ‘మేకింగ్‌ ఏ లివింగ్‌’ సినిమా. ఇది 1914 ఫిబ్రవరి 2న విడుదలైంది. అయితే ఆ సినిమా చాప్లిన్‌కి అస్సలు నచ్చలేదు.

అది చాప్లిన్‌ సృష్టించుకున్న ఆహార్యమే..

రెండో సినిమాకి చాప్లిన్, తనకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిన వేషధారణను స్వయంగా ఎంపికచేసుకున్నాడు. అదే... వదులుగా వేళ్లాడే ప్యాంటు, బిగుతుగా ఉండే కోటు, చిన్న టోపీ, పెద్ద బూట్లు, చిట్టి మీసం... దాన్నే ‘ది ట్రాంప్‌ క్యారెక్టర్‌’ అంటారు. ఈ వేషంలో చాప్లిన్‌ను చూపిస్తూ విడుదలైన సినిమా ‘కిడ్‌ ఆటో రేసెస్‌ ఎట్‌ వెనిస్‌’. ఆ వేషం వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించింది. దాంతో ఆపై చాప్లిన్‌ వెండితెర ఆహార్యం అదే అయ్యింది. చాప్లిన్‌ చిత్రాలకు బాగా డిమాండ్‌ పెరగడంతో తొలి దర్శకత్వ అవకాశం ‘కాట్‌ ఇన్‌ ద రైjన్‌’ (1914)తో వచ్చింది. అది సూపర్‌హిట్‌. ఇక ఆపై వారానికో సినిమా వంతున చాప్లిన్‌ ఎన్నో చిత్రాలు రూపొందించాడు. చాప్లిన్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఎన్నో కంపెనీలు అతడితో ఒప్పందం కోసం క్యూ కట్టాయి. అలా 26 ఏళ్లకల్లా ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఆ రోజుల్లో ప్రపంచంలోనే అత్యధికంగా పారితోషికం అందుకునే నటుడిగా చాప్లిన్‌ ఖ్యాతి పొందాడు. ‘ది ఫ్లోర్‌ వాకర్‌’, ‘ది ఫైర్‌మేన్‌’, ‘ది వేగబాండ్‌’, ‘వన్‌ ఏఎమ్‌’, ‘ది కౌంట్‌’, ‘ది పాన్‌షాప్‌’... లాంటి ఎన్నో సినిమాల్లో యువ చాప్లిన్‌ కడుపుబ్బ నవ్వించాడు. ఆపై సొంతంగా ‘యునైటెడ్‌ ఆర్టిస్ట్స్ ’ సంస్థను ప్రారంభించి నిర్మాతగా కూడా మారాడు.

మూడేళ్లలో 50 దేశాల్లో ప్రదర్శితమైందా చిత్రం..

చార్లీ చాప్లిన్‌ తొలి పూర్తిస్థాయి చిత్రం ‘ది కిడ్‌’ (1921). అరవై ఎనిమిది నిమిషాల నిడివి ఉండే ఇది చాప్లిన్‌ చిత్రల్లోకెల్లా పెద్దది. మూడేళ్ల ఈ సినిమా 50 దేశాల్లో ప్రదర్శితమై అంతులేని ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత వచ్చిన ‘ఎ ఉమన్‌ ఆఫ్‌ ప్యారిస్‌’ (1923), ‘ది గోల్డ్‌ రష్‌’ (1925), ‘ది సర్కస్‌’ (1928) లాంటి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయి. అప్పటికి మూకీలు పోయి, టాకీలు వచ్చినా కొంత కాలం పాటు చాప్లిన్‌ వాటికి దూరంగా ఉన్నాడు. అందుకే ‘సిటీ లైట్స్‌’ (1931), ‘మోడర్న్‌ టైమ్స్‌’ (1936) చిత్రాలను డైలాగులు లేకుండానే తీశాడు. జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ను వ్యంగ్యంగా అనుకరిస్తూ తీసిన ‘ది గ్రేట్‌ డిక్టేటర్‌’ (1940) నుంచి చాప్లిన్‌ పదేళ్ల పాటు రాజకీయ వివాదాల్లోను, వ్యక్తిగత జీవితపు ఒడిదుడుకుల్లోను కూరుకుపోయాడు. అతడిపై కమ్యూనిస్ట్‌ సానుభూతిపరుడిగా ముద్ర పడడంతో పాటు, తనకన్నా ఎంతో చిన్న వాళ్లను పెళ్లిళ్లు చేసుకోవడం విమర్శలకు గురిచేసింది. కొన్ని కేసులు చుట్టుముట్టడంతో అన్నేళ్లు తనకు ఆశ్రయమిచ్చిన అమెరికాను విడిచి వెళ్లక తప్పని పరిస్థితులు ఎదురయ్యాయి. ఆపై స్విట్జర్లాండ్‌ వెళ్లి ‘మాన్సియర్‌ వెర్‌డాక్స్‌’ (1947), ‘లైమ్‌లైట్‌’ (1952), ‘ఎ కింగ్‌ ఇన్‌ న్యూయార్క్‌’ (1957), ‘ఎ కౌంటెస్‌ ఫ్రమ్‌ హాంగ్‌కాంగ్‌’ (1967) లాంటి తన శైలికి భిన్నమైన సినిమాలు తీశాడు.

ఆస్కార్‌ వేదికపై అరుదైన గౌరవం..

అమెరికా వదిలి పెట్టిన చార్లీచాప్లిన్‌ 20 ఏళ్ల తర్వాత తిరిగి అమెరికా రావలసి వచ్చింది. అది ఆస్కార్‌ అవార్డు అందుకోవడం కోసం! 1972లో అకాడమీ చాప్లిన్‌కు గౌరవ అవార్డును ప్రకటించింది. ఆ పురస్కారాన్ని అందుకోడానికి అతడు వేదిక మీదకి వచ్చినప్పుడు ఆ వేడుకకు హాజరైన ఆహూతులంతా లేచి నిలబడి 12 నిమిషాల పాటు ఎడతెరిపి లేకుండా చప్పట్ల వర్షం కురిపించారు. ఆస్కార్‌ వేడుకల చరిత్రలోనే అత్యధిక సమయం నమోదైన ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’ అది!

తర్వాత ఈ హాస్య నట చక్రవర్తి ఆరోగ్యం క్రమేణా క్షీణించింది. మాటలేని స్థితిలో చక్రాల కుర్చీకి పరిమితమవాల్సి వచ్చింది. 1974లో ‘మై లైఫ్‌ ఇన్‌ పిక్చర్స్‌’ పేరుతో చిత్రాలతో కూడిన ఆత్మకథ వచ్చింది. 1975లో ‘ద జెంటిల్‌మేన్‌ ట్రాంప్‌’ పేరిట అతడి జీవితంపై ఓ డాక్యుమెంటరీ విడుదలైంది. అదే సంవత్సరం రాణి ఎలిజబెత్‌ చేతుల మీదుగా బ్రిటన్‌ అత్యున్నత పురస్కారం ‘నైట్‌హుడ్‌’ను చక్రాల కుర్చీ మీద నుంచే అందుకున్నాడు చాప్లిన్‌. జీవితమంతా ప్రపంచాన్ని నవించడానికే వెచ్చించిన చార్లీచాప్లిన్‌ 1977 డిసెంబర్‌ 25న నిద్రలోనే గుండెపోటుకు గురై 88 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఎప్పటికీ తనను తల్చుకునే సినీ అభిమానుల గుండెల్లో ఓ చిరునవ్వుతో పాటు, ఓ విషాదాన్నీ వదలివెళ్లాడు!!

మరి కొన్ని జ్ఞాపకాలు..

* చాప్లిన్‌ తన మొదటి భార్య మిడ్రెడ్‌ హ్యారిస్‌ను 1918లో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు పుట్టినా రెండు రోజులకే చనిపోయాడు. తర్వాత ఇద్దరూ రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. రెండో భార్య లిటా గ్రే ‘ది కిడ్‌’, ‘ది గోల్డ్‌ రష్‌’ చిత్రాల్లో నటించింది. వారికిద్దరు పిల్లలు. మూడేళ్లకే ఈ బంధం ముగిసింది. మూడోసారి పాలెట్‌ గొడార్డ్‌ను 1936 పెళ్లి చేసుకున్నాడు. ఈమె ‘మోడర్న్‌ టైమ్స్‌’, ‘ది డిక్టేటర్‌’ సినిమాల్లో కనిపించింది. వీరి బంధం ఐదేళ్లకే ముగిసింది. ఆ తర్వాత 53 ఏళ్ల వయసులో 18 ఏళ్ల ఊనా ఓనీల్‌ను 1943లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఎనిమిది మంది సంతానం.

* ప్రతి సినిమాలోను ప్రతి సన్నివేశంలో కనిపించే చార్లీచాప్లిన్‌ ఒకే ఒక చిత్రంలో మాత్రం ఓ అనామకుడిగా, కొన్ని సెకన్లు మాత్రమే కనిపిస్తాడు. అదీ ఓ పోర్టర్‌గా! పైగా అది హాస్యప్రధానమైన సినిమా కాదు. ఓ రొమాంటిక్‌ డ్రామా. ఎందుకంటే చాప్లిన్‌కి సీరియస్‌ సినిమా తీయాలనే కోరిక ఉండడమే. ఆ సినిమా ‘ఏ ఉమన్‌ ఆఫ్‌ ప్యారిస్‌’ (1923). ఇదీ విజయవంతమైంది.

* ‘ది సర్కస్‌’ చిత్రం చాప్లిన్‌కి తొలి అకాడమీ అవార్డును తెచ్చిపెట్టింది. అయితే అప్పటికి ‘ఆస్కార్‌’ అనే పేరు ఆ వేడుకకు లేదు. దీన్ని 1929లో తొలి వేడుకలో ఇచ్చారు.
చార్లీ చాప్లిన్ 1889లో లండన్‌లో జన్మించారు. దాదాపు పది సంవత్సరాలు లాంబెత్ వర్క్ హౌస్‌లో నివసించారు. తర్వాత 1910లో అమెరికా వెళ్లారు.
చార్లీచాప్లిన్ చిన్నతనంలో తినడానికి తిండి కూడా లేక ఎంతో ఇబ్బందిపడ్డారు. దీంతో పరిచయస్థులు, బంధువుల ఇళ్లకు సరిగ్గా భోజనం సమయానికి వెళ్లేవారట. అలాంటి సమయంలో వచ్చే అతిథిని ఎలాగూ భోజనం చేసి వెళ్లమంటారు కదా. అదే ఆయన కడుపు నింపేది.
టైమ్ మ్యాగజీన్ ముఖచిత్రంపై కనిపించిన తొలి నటుడు చార్లీ చాప్లిన్.

ఉక్రెయిన్‌కు చెందిన ఖగోళ పరిశోధకురాలు ఒకరు తాను కనుగొన్న గ్రహశకలానికి చాప్లిన్ 3623 అని పేరు పెట్టారు.
చాప్లిన్ కేవలం హాస్య నటుడే కాదు మంచి రచయిత, దర్శకుడు కూడా.
టాకీ సినిమాలు వచ్చాక కూడా చాప్లిన్ మూకీలే తీశారు.
చాప్లిన్ హాలీవుడ్‌ను వీడిన తరువాత స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో నివసించారు. ఆయన జ్ఞాపకార్థం అక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది.
చాప్లిన్‌కు ఇష్టమైన ప్రదేశాల్లో స్కాట్లాండ్‌లోని నేర్న్ ఒకటి. ఇక్కడికి ప్రతి సంవత్సరం వెళ్లేవారు. "ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నాకు లభించే ప్రశాంతత వెలకట్టలేనిది" అని చాప్లిన్ తన సన్నిహితులతో చెప్పేవారు. బహుశా అక్కడి ప్రజలకు చాప్లిన్ ఎవరో పెద్దగా తెలియకపోవడం కూడా ఆయనకు ఇక్కడ అభిమానుల తాకిడి లేకుండా చేసి ఉండవచ్చు. అదే ఆయనకు బాగా సంతోషాన్నిచ్చేది.

0 comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top