త్వరలో దేశవ్యాప్తంగా ‘ఆధార్ సేవా కేంద్రాలు
*🌻దిల్లీ:* పాస్పోర్టు సేవా కేంద్రాలు మాదిరిగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) ఆధార్ గుర్తింపు కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 53 నగరాల్లో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందు కోసం రూ.300 నుంచి రూ.400కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆధార్లో ఏవైనా అప్డేట్స్ చేయించుకోవాల్సి వస్తే బ్యాంకులు, తపాల కార్యాలయాల్లోని ఆధార్ కేంద్రాలకు వెళ్తున్నారు. ఇక మీదట అటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉడాయ్ ప్రయత్నిస్తోంది.
🌻ప్రస్తుతం బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో దాదాపు 30వేల ఆధార్ కేంద్రాలు ఉన్నాయి. ఆధార్లో పేర్లు మార్పు, ఫోన్ నెంబరు, ఎన్రోల్మెంట్, అప్డేట్తో ఇతర పనుల కోసం ప్రజలు ఈ కేంద్రాలకు వెళ్తున్నారు. అలా కాకుండా ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రజలు సులభంగా ఆధార్ అప్డేట్స్ చేయించుకునేందుకు వీలుగా ఉంటుందని ఉడాయ్ అధికారి ఒకరు తెలిపారు. 2019 ఏప్రిల్ నాటికి 53 నగరాల్లో ఆధార్ సేవా కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
🌻ఇప్పటి వరకు ప్రతి రోజు దాదాపు నాలుగు లక్షల మంది ఆధార్ వివరాలను(అడ్రస్, ఫొటో, మొబైల్ నెంబరుతో పాటు ఇతర వివరాలు) అప్డేట్ చేయించుకుంటున్నారు. ఆధార్ రాజ్యంగబద్ధమైనదేనని కానీ అన్నింటికీ దాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరమేమి లేదని గత నెల సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకు ఖాతాలకు, మొబైల్ ఫోన్లకు, పాఠశాలల్లో ప్రవేశాలకు ఆధార్ అవసరం లేదని తేల్చి చెప్పింది. కానీ ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు, శాశ్వత ఖాతా సంఖ్య(పాన్)కు మాత్రం ఆధార్ తప్పనిసరి అనే నిబంధన కొనసాగుతుందని స్పష్టం చేసింది.
0 comments:
Post a Comment